అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2022-01-19T05:01:31+05:30 IST

అప్రమత్తంగా ఉండండి

అప్రమత్తంగా ఉండండి

నెలాఖరులోపు రెండో విడత వ్యాక్సినేషన్‌ పూర్తవ్వాలి 

టీకా ప్రక్రియలో రాష్ట్రంలో ఖమ్మానిది రెండోస్థానం

ఖమ్మంనగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టండి

దళితబంధు అమల్లోనూ ఆదర్శంగా ఉండాలి

జిల్లాకు త్వరలోనే మంత్రి హరీష్‌రావు రాక

ఖమ్మంలో అధికారులతో సమీక్షలో మంత్రి పువ్వాడ

ఖమ్మం, జనవరి 18 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్యారోగ్యశాఖతోపాటు మిగిలిన శాఖలు కూడా అప్రమత్తంగా ఉండి కరోనా, ఒమైక్రాన్‌ వ్యాప్తి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం వైద్య,ఆరోగ్యశాఖతో పాటు పలు సంక్షేమశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడత వ్యాక్సినేషన్‌లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో ఉన్నా.. రెండో విడతలో మాత్రం కొన్నిచోట్ల వెనుకబడి ఉన్నామన్నారు. ఆయా ప్రాంతాలను గుర్తించి స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు, ఆసుపత్రుల్లో కల్పిస్తున్న సదుపాయాల గురించి కలెక్టర్‌, డీఎంహెచ్‌వోను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌వో మాలతి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత వ్యాక్సినేషన్‌లో 10,60,518మందికి టీకాలు వేసి నూరుశాతం సాధించామని, రెండోవిడతలో 9,13,335మందికి వ్యాక్సిన్‌ వేశామని, అయితే ఖమ్మంనగరంతో పాటు ఎర్రుపాలెం, ముదిగొండ మండలాల్లో కొంత లక్ష్యానికి వెనుకబడి ఉన్నామన్నారు. 69,335మంది 15-18 ఏళ్ల టీనేజర్లకు గాను 43,203మందికి టీకాలు వేశామని, మిగిలిన వారికికూడా టీకాలు వేస్తామన్నారు. జిల్లా ఆసుపత్రితోపాటు సత్తుపల్లి, మధిర, పెనుబల్లి, తిరుమలాయపాలెం, తదితర ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటుచేశామని, జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల ఆధ్వర్యంలో 600వరకుపడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం కరోతో 21మంది ప్రైవేటు, 25మంది ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా ఏరియా ఆసుపత్రుల సమన్వయ అధికారి వెంకటేశ్వర్లు వివరించారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ వరుస పండుగలతో పాటు కోడిపందాల నేపథ్యంలో కరోనా వ్యాప్తి పెరిగిందని, సరిహద్దు మండలాల్లో వ్యాక్సినేషన్‌ను నూరుశాతం పూర్తిచేయాలన్నారు. ఖమ్మం నగరంలో ప్రత్యేకాధికారులను నియమించి స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. కొందరు ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనరోగులకు కాక్‌టెయిల్‌ టీకా ఇస్తూ రూ.వేలు వసూలు చేస్తున్నారని, ప్రస్తుతం డెల్టావైరస్‌కాకుండా ఒమైక్రాన్‌ వేరియంట్‌ కారణంగా అంత తీవ్రత ఉండదని, దీనిపై వైద్యారోగ్యశాఖ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాక్‌టెయిల్‌ వ్యాక్సిన్‌ వినియోగించే ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టాలని, వారికి సమావేశం నిర్వహించి అనవసరంగా ఈ వ్యాక్సిన్‌ ఇవ్వొద్దని సూచించాలన్నారు. లేదంటే అవగాహనలేకుండా కరోన పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరు అప్పులు చేసి కాక్‌టెయిల్‌ టీకా తీసుకుని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు. జిల్లా ఆసుపత్రిలో నెలనెలా సమీక్షా సమావేశం నిర్వహించాలని, డాక్టర్లు,సిబ్బంది కొరత ఉంటే వెంటనే తాత్కాలిక పద్ధతిలో నియమించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రవైద్యారోగ్యశాఖమంత్రి హరీష్‌రావు ఖమ్మం వస్తున్నారని, అప్పటికల్లా ఖమ్మం ఆసుపత్రిలో ప్రధాన గేటు ఆర్చీ మార్పుచేయాలని, అలాగే క్యాథ్‌ల్యాబ్‌, ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అదేరోజు సత్తుపల్లి, మధిరలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని, ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయాలని కోరారు. 

దళితబంధులోనూ ఆదర్శంకావాలి

దళితబంధు పథకం అమల్లో ఖమ్మంజిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలచేలా చూడాలని మంత్రి పువ్వాడ ఆదేశించారు. ఈ పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సీఎం కేసీఆర్‌ పైలెట్‌ ప్రాజెక్టుగా చింతకాని మండలాన్ని ఎంపికచేశారని, ప్రతీ గ్రామానికి నియమించిన ప్రత్యేకాధికారులు లబ్ధిదారుల జాబితాలు సిద్ధంచేయాలని, లబ్ధిదారులకు ఆసక్తి ఉన్న యూనిట్ల ఎంపికలో గ్రామ ప్రత్యేక అధికారులే మార్గదర్శనం చేయాలన్నారు. దళితబంధు పథకం కోసం లబ్దిదారులతో బ్యాంకు ఖాతాలు ఏర్పాటుచేయాలని, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గానికి జిల్లాకు అధికారుల బృందాన్ని పంపి అక్కడ దళితబంధు అమలు తీరుపై అవగాహన పెంచుకోవాలన్నారు.  జిల్లాలో ప్రతీ నియోజకవర్గం నుంచి 100మంది లబ్ధిదారులను ఎంపికచేయాలని, ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కలెక్టర్‌ వీపీగౌతమ్‌ మాట్లాడుతూ కరోనా నియంత్రణ, దళితబంధు అమలుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈసమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగర కమిషనర్‌ ఆదర్శసురభి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, శిక్షణ కలెక్టర్‌ రాహుల్‌, జడ్పీసీఈవో అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:01:31+05:30 IST