ఆగని బాదుడు

ABN , First Publish Date - 2021-10-23T06:05:36+05:30 IST

పెట్రో ధరల బాదుడు ఆగడం లేదు. లీటరు ధర వంద దాటేసిన తర్వాత కూడా వేగంగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆగని బాదుడు

  • పెట్రోలు లీటరు రూ.112.47.. డీజిల్‌ ధర 105.04
  • జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రకరకాల ధరలు.. పైసల్లో తేడాలు
  • దూరం పెరిగే కొద్దీ రవాణా చార్జీల వల్ల ధరల్లో వ్యత్యాసాలు
  • బంకుల్లో అదనపు బాదుడు 
  • గగ్గోలు పెడుతున్న వాహనదారులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పెట్రో ధరల బాదుడు ఆగడం లేదు. లీటరు ధర వంద దాటేసిన తర్వాత కూడా వేగంగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు బయటకు తీయడానికి ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. కానీ వాహనం బయటకు తీయకపోతే రోజు గడవదు. దీంతో అప్పోసస్పో చేసి పెట్రోలు, డీజిల్‌ కొట్టిస్తున్నారు. దూర ప్రయాణాలు వాహనాల మీద వెళ్లడం కొంతమంది మానేశారు. బయటకు వెళ్లాలంటే కనీసం లీటరు పెట్రోలు అవసరం ఉంటుంది. కొన్ని నెలల కిందట రూ.100 ఇస్తే సుమారు లీటరున్నర పెట్రోలు వచ్చేది. ఇవాళ పెట్రోలు లీటరు రూ.112.47, డీజిల్‌ ధర 105.04గా అయింది. ఇవి రాజమహేంద్రవరంలోని ఒక ప్రాం తంలోని ధరలు. గురువారం లీటరు పెట్రోలు ధర రూ.112.12 పైసలకు ఉంది. శుక్ర వారం మరో 35 పైసలు పెరిగింది. దాదాపు ప్రతీ రోజూ ఎంతోకొంత పెరుగుతూనే ఉంది. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ పెట్రోలు, డీజిల్‌ కొనుగోలు చేయకపోతే కదలని పరిస్థితి ఉంది. ఈనెల ఒకటో తేదీన లీటరు పెట్రోలు ధర రూ.107.44గా ఉంది. డీజిల్‌ ధర రూ.99.33గా ఉంది. అక్కడ నుంచి పెరుగుతూ వచ్చి గురువారం నాటికి లీటరు పెట్రోలు రూ.112.12కు చేరగా, డీజిల్‌ రూ.104.67కు చేరింది. శుక్రవారం లీటరుపెట్రోలు ధర రూ.112.47కి చేరగా, డీజిల్‌ రూ.105.04కి చేరింది. కిరాయికి వాహనాలు నడిపే ఆటోవాలాలు, టాక్సీవాలాలు గిజగిజలాడిపోతున్నారు. చార్జీలు కూడా పెంచేస్తున్నారు. దీంతో ఎక్కువమంది బస్సులు ఎక్కడానికి మొగ్గు చూపుతున్నారు. లారీ ఓనర్లు కూడా తీవ్ర గగ్గోలు పెడుతున్నారు. కార్లు మీద వెళ్లడానికి కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ధనవంతులు ఏదో విధంగా వాహనాలు తీస్తుంటే, సామాన్య మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇంత భారీగా ధరలు పెరిగిపోతున్నా జిల్లాలో చాలా పెట్రోలు బంకుల్లో దోపిడీ ఆగడం లేదు. లీటరు పెట్రోలు కొట్టించుకుంటే అందులో కొన్ని పాయింట్లు మిగుల్చుకుని కొంత లాగేయడం మామూలైపోయింది. ఇక  పెట్రోలు ధరలు జిల్లావ్యాప్తంగా ఒకేలా లేవు. గోకవరం మండలంలోని గుమ్మలదొడ్డిప్రాంతం నుంచి వివిధ బంక్‌లకు పెట్రోలు, డీజిల్‌ సరఫరా అవుతుంది. అక్కడ ఒక ధర ఉండగా, అక్కడ నుంచి ఆయిల్‌ ట్యాంకర్‌ బయలుదేరి, ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడకు గోకవరం నుంచి ఉన్న దూరాన్ని పెట్టి చార్జి వసూలు చేస్తారు. ఈ చార్జీల వల్ల అక్కడ మరింత ధరలు పెరుగుతున్నాయి. గోకవరంలో శుక్రవారం పెట్రోలు లీట రు ధర రూ.112.40 పైగా ఉండగా, రాజమహేంద్రవరంలో ఒక ప్రాంతంలో రూ.112.47 గా ఉంది. లాలాచెరువు ప్రాంతంలో రూ.112.56 ఉంది. సిటీలో కూడా వివిధ బంకుల్లో కొన్ని పైసల వ్యత్యాసం ఉంది. ఇక కోనసీమ, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే కొద్దీ మరింత ధర పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాకు కూడా ఎక్కువగా గోకవరం నుంచే రవాణా అవుతుంది. దూరం పెరిగే కొద్ది పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి.

Updated Date - 2021-10-23T06:05:36+05:30 IST