పాలనకేదీ ఆలన?

ABN , First Publish Date - 2021-09-13T04:52:44+05:30 IST

గ్రామ పంచాయతీలు. పల్లె పాలనకు పట్టు కొమ్మలు. దేశానికి రాష్ట్రపతి కార్యాలయం ఎంత అవసరమో గ్రామ పంచాయతీలకు పంచాయతీ భవనాలు అంతే అవసరం.

పాలనకేదీ ఆలన?
మల్లాయిగూడెం పంచాయతీకి భవనం లేకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక పాఠశాలలో సమావేశం నిర్వహిస్తున్న అధికారులు

కొత్త పంచాయతీలకు భవనాలు లేక ఇబ్బందులు

ట్రాక్టర్ల కొనుగోలు, ప్రకృతి వనాలపైనే సర్కారు శ్రద్ధ

అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు

అధికారులకు, ప్రజలకు తప్పని ఇబ్బందులు

అశ్వారావుపేట రూరల్‌, సెప్టెంబరు 12: గ్రామ పంచాయతీలు. పల్లె పాలనకు పట్టు కొమ్మలు. దేశానికి రాష్ట్రపతి కార్యాలయం ఎంత అవసరమో గ్రామ పంచాయతీలకు పంచాయతీ భవనాలు అంతే అవసరం.గ్రామ పంచాయతీలు. పల్లె పాలనకు పట్టు కొమ్మలు. దేశానికి రాష్ట్రపతి కార్యాలయం ఎంత అవసరమో గ్రామ పంచాయతీలకు పంచాయతీ భవనాలు అంతే అవసరం. కానీ పాలకులు పంచాయతీలకు అవసరమైన భవనాల నిర్మాణాలపైనే దృష్టి పెట్టటం లేదు. ఎంతో కొంత ప్రయోజనం ఉన్న ట్రాక్టర్ల కొనుగోలు, ఏమాత్రం ప్రయోజనం ఉంటుందో కూడా పెద్దగా తెలియని పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపై చూపిన శ్రద్ధ భవనాల మంజూరు పట్ల లేదు. ఫలితంగా ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహించే గ్రామసభలు, ఇతర సమావేశాలు చెట్టు కిందనే నిర్వహించుకోవాల్సి వస్తోంది. నూతనంగా అంటే దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. ప్రభుత్వాల తీరుతో ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు, అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాత పంచాయతీల్లో చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అవి ఎపుడు కూలుతాయో తెలియని పరిస్థితి.

నియోజకవర్గంలో 105 గ్రామపంచాయతీలు

నియోజకవర్గం పూర్తిగా గిరిజన ప్రాంతం. గతంలో అ శ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అ న్నపురెడ్డిపల్లి ఇలా ఐదు మండలాల్లో 57 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో కొన్ని గ్రామా లు పంచాయతీలకు విసిరేసినట్లుగా ఉన్నాయి. ఈనేపధ్యం లో పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018లో శివారు గ్రామాలు, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. ప్రజలకు మరింతగా సేవలు అందేలా పం చాయతీలను ఏర్పాటు చేసింది ఐదు మండలాల్లో 57 గ్రామపంచాయతీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 105 కు చేరింది. అశ్వారావుపేట మండలంలో పాతవి 16 కాగా కొత్తవి 14, చందుగొండ మండలంలో పాతవి 9 కాగా పా తవి 5 పంచాయతీలు కాగా మొత్తం 14 ఉన్నాయి. ములకలపల్లి మండలంలో పాతవి ఆరు కాగా కొత్తవి 14 ఏర్పడ్డాయి. దమ్మపేట మండలంలో పాతవి 18 ఉంటే అద నంగా 13 పంచాయతీలను ఏర్పాటు చేశారు. ఇలా ఐదు మండలాల్లో కొత్తగా 48పంచాయతీలను ఏర్పాటు చేశారు.

పాఠశాలల్లో...చెట్ల కిందే సమావేశాలు

పల్లెలకు గ్రామపంచాయతీ భవనాలే వేధికలు. పంచాయతీలో ప్రభుత్వ పరంగా ఏకార్యక్రమం జరగాలన్నా ఇ క్కడ నుంచే ప్రారంభంకావాలి. గతంలో కంటే ఇపుడు ఎక్కువగా పంచాయతీ భవనాల్లో ప్రతీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వ్యవస్థ ఇక్కడ నుంచే ఆరంభం అవుతుంది. గ్రామస్తులకు ఏపని కావాలన్నా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అయితే నియోజకవర్గంలో కొత్త పంచాయతీలకు ఎక్కడా భవనాలు లేవు. ప్రస్తుతం దమ్మపేట మండలంలోని పార్కెలగండిలో మాత్రమే కొత్త పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇక నియోజకవర్గంలో అనేక పంచాయతీలను పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, చిన్న చిన్న గదుల్లోనే ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీల్లో సమావేశాలు జరపాలంటే రోడ్లు, చెట్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి.  

శిథిలావస్థకు చేరిన పంచాయతీ భవనాలు

ప్రస్తుతం నియోజకవర్గంలోని అనేక పాత పంచాయతీ భవనాలు శిథిలదశకు చేరుకున్నాయి. అశ్వారావుపేట మం డలంలోని కన్నాయిగూడెం, బచ్చువారిగూడెం, గుమ్మడివల్లి ఇలా అనేక పంచాయతీ కార్యాలయాలు శిథిల దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల క్రితమే అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం పంచాయతీ భవనాన్ని కూల్చివేశారు. ఇతర మండలాల్లోనూ పలు చోట్ల ఇదే పరిస్థితి. శిథిలావస్థకు చేరిన పంచాయతీల్లో పాలకవర్గాలకు, అధికారులకు ఇబ్బందులు తప్పటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పం చాయతీలన్నీ రెండు మూడు గదులతోనే నిర్మించి ఉన్నా యి. ఆయా పంచాయతీల్లో సామగ్రి, రికార్డులు నిల్వ చేయటానికే సరిపోతుంది. పట్టుమని పాతిక కుర్చీలు వేసి సమావేశాలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో చాలా పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది.

ట్రాక్టర్ల కొనుగోలు, ప్రకృతి వనాలపైనే శ్రద్ధ

 ప్రస్తుతం పంచాయతీల్లో కనిపిస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా మొక్కలు నాటడంతో పాటు పల్లె ప్రగతి పేరుతో ఏదో కార్యక్రమం చేపడుతు న్నారు. ఇందుకు రూ.లక్షల్లోనే ఖర్చు చేస్తున్నారు. ఒక మాదిరి నుంచి పెద్ద పంచాయతీలు అయితే రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇక పంచాయతీల కోసమని దాదాపు రూ.5లక్షల నుంచి రూ. ఏడు లక్షల వరకు వెచ్చించి ట్రాక్టరు, ట్యాంకరు కొనుగోలు చేశారు. ఇవి కాకుండా ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పేరుతో రూ.లక్షలు వెచ్చించి పార్కులు ఏర్పాటు చేశారు. ట్రాక్టరు, ట్యాంకర్‌ వల్ల కొంతమేర ప్రయోజనం ఉంది. కాని పల్లెల్లో ఏర్పాటు చేసిన పార్క్‌లు వల్ల కలిగిన లాభం మాత్రం ఏమాత్రం కనిపించలేదు. అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా దాదాపు 80వరకు పార్క్‌లు ఏర్పాటు చేశారు. అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన ఒకటి రెండు పార్క్‌లు తప్ప మిగిలిన పార్క్‌ల వల్ల కలిగిన ప్రయోజనం ఏమీ లేదు. పార్క్‌ల ఏర్పాటుకు రూ.లక్షల్లోనే ఖర్చు అయింది. పైన పేర్కొన్న పార్క్‌లు, ట్రాక్టర్లకు పంచాయతీ నిధులను ఖర్చు పెట్టటం తప్పులేదు కాని అసలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికైన పంచాయతీ భవనాల నిర్మాణాలపై శ్రద్ధ పెట్టడడంలేదనే అందరి నుంచి వచ్చే ప్రశ్న. ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేయిస్తున్న ప్రభుత్వం పంచాయతీ భవనాల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కోరుతున్నారు. పంచాయతీలకు వెంటనే కొత్త భవనాలను మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

ఇబ్బందిగా ఉంటోంది

నారం రాజశేఖర్‌

సర్పంచుల సంఘం అశ్వారావుపేట మండల అధ్యక్షుడు 

 కొత్త పంచాయతీలు ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటాయి. అయినా ఇంతవరకు భవనాలను మంజూరు చేయలేదు. సొంత భవనాలు లేకపోవటంతో వాళ్ల పంచన, వీళ్ల పంచన ఉండాల్సి వస్తుంది. నిత్యం అందరి సమస్యలు పరిష్కరించే పంచాయతీలు తమకు మాత్రం సొంత గూడును ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. భవనాలు లేకపోవటం వలన మీటింగ్‌లకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే నిధులను మంజూరు చేయాలి. 

కొత్త పంచాయతీలను వెంటనే నిర్మించాలి

కారం సుధీర్‌, సీతాయిగూడెం

 కొత్త పంచాయతీల్లో సొంత భవనాలు లేకపోవటంతో కొంత ఇబ్బందిగా ఉంటోంది. పంచాయతీ ద్వారా అనేక రకాల పనులు జరుగుతున్నాయి. భవనాలు లేకపోవటంతో సమావేశాలకు ఇబ్బందిగా ఉంటుంది. కొత్త పంచాయతీల ఏర్పాటు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నా సొంత భవనాలు లేకపోవటంతో ఇబ్బందిగా మారింది. వెంటనే కొత్త భవనాలను నిర్మించాలి.

Updated Date - 2021-09-13T04:52:44+05:30 IST