CM Stalin నుంచి తెలుగు నేతలకు అందని ఆహ్వానం.. కారణాలేంటో..!

ABN , First Publish Date - 2022-03-01T07:41:10+05:30 IST

తెలుగు నేతలకు CM Stalin నుంచి అందని పిలుపు!

CM Stalin నుంచి తెలుగు నేతలకు అందని ఆహ్వానం.. కారణాలేంటో..!

  • ఆహ్వానం పంపించని స్టాలిన్‌
  • కాంగ్రెస్‌ లేని కూటమి కోసం కేసీఆర్‌
  • కేంద్రంతో అంటకాగుతున్న జగన్‌
  • బీజేపీతో పోరుకు సిద్ధంగాలేని చంద్రబాబు
  • చెన్నైలో స్టాలిన్‌ పుస్తక ఆవిష్కరణోత్సవం
  • హాజరైన రాహుల్‌గాంధీ,  ఒమర్‌ అబ్దుల్లా,
  • పినరయి విజయన్‌, తేజస్వి యాదవ్‌

 

చెన్నై, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రాలకు మరిన్ని హక్కులు కల్పించాలి. ఆ దిశగా రాజ్యాంగంలో మార్పులు చేయడానికి కాంగ్రెస్‌ సహా అన్ని పార్టీలు సమైక్య ఉద్యమం చేపట్టాలి’’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. చెన్నై ట్రేడ్‌ సెంటర్‌లో ఆయన రచించిన ‘ఒంగళిల్‌ ఒరువన్‌’ (మీలో ఒకడిని) పుస్తకావిష్కరణ సభ సోమవారం జరిగింది. ఈ పుస్తకాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్‌... ‘రాష్ట్రాలలో స్వయం పరిపాలన’ అనే నినాదం దిశగా అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కేరళ సీఎం పినరయి విజయన్‌, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌ పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఆహ్వానాలు ఎందుకు అందలేదు? ఇదీ తమిళనాట జరుగుతున్న చర్చ.


కొత్త ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ ఉత్సాహం చూపుతున్నా స్టాలిన్‌ మాత్రం ఆయనవైపు చూడడం లేదు. బీజేపీతో ఆయన ఎప్పుడు కయ్యం ప్రదర్శిస్తారో, ఎప్పుడు నెయ్యం పెట్టుకుంటారో అర్థంగాకనే కేసీఆర్‌ను దూరంగా పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌ విషయానికి వస్తే... అక్రమాస్తుల కేసుల్లో పీకల్లోతున ఇరుక్కున్న ఆయన బీజేపీని కాదని ఏమీ చేయలేరని స్టాలిన్‌ భావిస్తున్నట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రస్తుతం ఎవరినీ కొత్తగా శత్రువులను చేసుకునే పరిస్థితుల్లో లేరని, అందుకే ఆయనను కూడా పుస్తకావిష్కరణ సభకు పిలవలేదని పేర్కొన్నాయి.

Updated Date - 2022-03-01T07:41:10+05:30 IST