Abn logo
Sep 27 2021 @ 00:12AM

చివరి ఆయకట్టుకు అందని సాగు నీరు

కొలుముల పేట సమీపంలో దెబ్బతిన్న టీజీపీ పంట కాలువ

  1. అధ్వానంగా టీజీపీ పంట కాలువలు 
  2. ఏళ్ల తరబడి మంజూరు కాని నిధులు 
  3. ఆందోళనలో రైతులు 


చాగలమర్రి, సెప్టెంబరు 26: చెంతనే కాలువ ఉన్నా పంట పొలాలకు నీరు అందడం లేదు. ఉప కాలువల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. 18 ఏళ్ల యినా పంట కాలువ పనులు చేపట్టలేదు. దీంతో ప్రధాన కాలువ నుంచి చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పది వేల ఎకరాలు సాగుకు నోచుకోలేదు. ముత్యాలపాడు, డి.వనిపెంట, చింతలచెరువు, పెద్దవంగలి, కొలుములపేట, చిన్నవంగలి, పెద్దబోదనం తదితర గ్రామాల్లో పంట కాలువల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తాగు, సాగు నీరు అందించేందుకు 35, 36, 37 బ్లాక్‌లలో 2004లో పనులు చేపట్టారు. అప్పటి కాంట్రాక్టర్లు కొంత వరకు కాలువ పనులు చేపట్టి మధ్యలో పనులు నిలిపి వేశారు. అప్పటి నుంచి కాలువ పనులను పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది తెలుగుగంగ ప్రధాన కాలువకు వెలుగోడు జలాశయం నుంచి నీరు విడుదల చేసినా తమ పంట పొలాలకు అందడం లేదని వాపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి పంట కాలువలకు ప్రవహించే ఉప కాలువలకు లైనింగ్‌ పనులు చేయకపోవడంతో పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల కాలువలను రైతులు సాగు భూముల్లోకి కలుపుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలు, స్ట్రక్చర్ల పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. 


లైనింగ్‌ పనులు చేపట్టాలి

తెలుగుగంగ కాలువ మా ఊరి గుండానే వెళ్తుందని తాగు, సాగు నీటికి ఇబ్బంది ఉండదని సంతోషించాం. కాలువ పనులు పూర్తి చేయకుండానే మధ్యలోనే నిలిపి వేశారు. సకాలంలో పనులు చేసి ఉంటే నీరు ప్రవహించేది. అధికారులు స్పందించి కాలువ లైనింగ్‌ పనులు పూర్తి చేయాలి.

-  రమణయ్య, రైతు, చిన్నవంగలి 


 నివేదిక పంపించాం

టీజీపీ కాలువల లైనింగ్‌ పనులకు ప్రతిపాదనలు చేశాం. 2004లో చేసిన పనులకు అగ్రిమెంట్‌ పూర్తి కాకపోవడంతో పనులు చేసేందుకు ఇబ్బందిగా ఉంది. ఈ ఏడాది ప్రధాన కాలువలో మరమ్మతులు చేపట్టాం. రూ.80కోట్లతో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. మూడు బ్లాక్‌లలో లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. 

- గోవిందరాజులు, డీఈ, చాగలమర్రి