అందని రుణం!

ABN , First Publish Date - 2020-09-19T10:59:16+05:30 IST

పట్టణాల్లో చిరు వ్యాపారులకు రుణం అందని ద్రాక్షలా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్‌ పథకం ద్వారా ఒక్కో చిరు వ్యాపారికి రూ.10 వేల రు

అందని రుణం!

 నెలల తరబడి ఎదురుచూస్తున్న వీధి వ్యాపారులు

 ఆసక్తి చూపని బ్యాంకర్లు

 పట్టించుకోని మెప్మా అధికారులు


(రాజాం/ఇచ్ఛాపురం):పట్టణాల్లో చిరు వ్యాపారులకు రుణం అందని ద్రాక్షలా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్‌ పథకం ద్వారా ఒక్కో చిరు వ్యాపారికి రూ.10 వేల  రుణం అందజేయాలని నిర్ణయించింది. ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా)కు అప్పగించింది.


కానీ, నెలలు గడుస్తున్నా బ్యాంకర్లు ఇంతవరకూ రుణాలు మంజూరు చేయలేదు. దీంతో వేలాది మంది చిరు వ్యాపారులు రుణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కరోనా ఇబ్బందుల వేళ.. తమను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మునిసిపాలిటీల్లో చాలా మంది వీధి వర్తకులు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆత్మనిర్బర్‌ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున రుణ సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో చాలామంది వర్తకులు దరఖాస్తు చేసుకున్నారు.


బ్యాంకర్లు మాత్రం రుణాల మంజూరుకు మోకాలడ్డుతున్నారు. గ్రౌండింగ్‌ అయిన యూనిట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాల్టీలు, రాజాం, పాలకొండ నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ పట్టణాల్లో 2,633 మంది వీధి వర్తకులు ఉన్నట్టు మెప్మా అధికారులు గుర్తించారు. గుర్తింపు కార్డులను అందజేశారు.


వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. అన్ని బ్యాంకులకు అనుసంధానించారు. ఈ ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా రుణాలు అందించడానికి బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,633 మంది వీధి వర్తకులు ఉండగా... 1,437 మంది దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందులో బ్యాంకుల నుంచి కేవలం 99 మాత్రమే రుణం పొందారు. మిగిలిన 1,338 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.


ఉన్నతాధికారుల ఆదేశాలను కొంతమంది మేనేజర్లు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రుణాలు అందించడంలో రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే మన జిల్లా వెనుకబడి ఉంది. మిగతా జిల్లాల్లో ఇప్పటికే 70 నుంచి 80 శాతం రుణాలు అందజేసినట్టు తెలుస్తోంది. వీధి వ్యాపారులు ఆధార్‌ అనుసంధానం చేసుకోవడానికి ముందుకు రాకపోవడమే రుణ మంజూరులో జాప్యానికి కారణమని మెప్మా అధికారులు చెబుతున్నారు. ఆధార్‌ లింక్‌ అయిన వెంటనే ఓటీపీ వస్తుందని..


దానిని అనుసరించి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయంటున్నారు. ఆధార్‌ నెంబర్‌ అనుసంధానం సమయంలో సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయని, దీంతో రుణాల మంజూరు ప్రక్రియ జాప్యమవుతుందని పేర్కొంటున్నారు. అయితే.. కరోనా వ్యాప్తి వేళ అరకొరగా విక్రయాలు సాగుతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వీధి వ్యాపారులు వాపోతున్నారు. రుణాల మంజూరుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. 


 రుణ సదుపాయం ఇలా..  

ఈ ఏడాది మార్చి 24 నాటికి వీధి వర్తకులుగా బతుకుతెరువు సాగిస్తున్న వారే ఈ పథకానికి అర్హులు. మార్చి 2022 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. అర్హులైన ఒక్కో వ్యాపారికి రూ.10వేల చొప్పున రుణం మంజూరు చేయనున్నారు. ఈ మొత్తాన్ని 12 సమాన వాయిదాల్లో చెల్లించాలి. వాయిదాలు సక్రమంగా చెల్లించిన వర్తకులకు 7 శాతం వడ్డీ రాయితీని మళ్లీ వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తారు. రుణ పరిమితి పెంచుతారు. ఇలా తీసుకున్న రుణాన్ని వడ్డీతో కలిపి.. రూ.11,349 చెల్లించాలి. ప్రభుత్వం వడ్డీ రాయితీ కింద రూ.402, క్యాష్‌బ్యాక్‌, ఇంటెన్సివ్‌ కింద రూ.1200 కలిపి మొత్తం రూ.1602 తిరిగి ఇస్తుంది. దీంతో బ్యాంకు నుంచి పొందిన రుణం మాత్రమే జమ చేసినట్టవుతుంది. 


కుటుంబ జీవనం కష్టం..-యందవ పొట్టమ్మ, రాజాం

లాక్‌డౌన్‌తో వ్యాపారాలు లేక నష్టపోయాం. కుటుంబ జీవనం  కష్టంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల రుణం అందిస్తే ఈ సమయంలో ఎంతో అండగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి రుణం అందించే ఏర్పాటుచేయాలి. 

 

ఏడు నెలలుగా కష్టాలు..గోరు వెంకటరమణ, చిరు వ్యాపారి, రాజాం

ఏడు నెలలుగా వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు రుణం ప్రకటించడంతో ఆనందించాం. కానీ బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఈ విషయంలో జాప్యం చేయకుండా రుణం అందేలా ఏర్పాటు చేయాలి.   


ఆధార్‌ లింక్‌ చేయకే..-రత్నం, మెప్మా అధికారి, రాజాం

వీధి వ్యాపారులు ఆధార్‌ అనుసంధానించకపోవడం వల్లనే రుణ మంజూరులో జాప్యమవుతోంది. రాజాం నగర పంచాయతీ పరిధిలో 84 మందికి ఆధార్‌ లింక్‌ చేయించాం. 14 మందికి రుణాలు ఇప్పించాం. వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆధార్‌ లింక్‌ చేసుకోవాలి. 


వేగవంతం చేస్తాం.. ఎం.కిరణ్‌కుమార్‌, మెప్మా పీడీ, శ్రీకాకుళం

వీధి వర్తకులకు బ్యాంకుల రుణ సదుపాయం వేగవంతం చేస్తాం. ఇప్పటికే బ్యాంకు రీజనల్‌ మేనేజర్లు, ఎల్‌డీఎంలతో మాట్లాడి.. సహకరించాలని కోరాం. వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  



 రుణాల ప్రక్రియ ఇలా..

--------------------------------------------------------------------------------------------------------------------------------

మునిసిపాలిటీ వీధి వ్యాపారులు ఆన్‌లైన్‌లో నమోదు రుణాల మంజూరు పెండింగ్‌ దరఖాస్తులు

----------------------------------------------------------------------------------------------------------------------------------------

పలాస .710 మంది        303                 11                  292

ఆమదాలవలస 165 మంది         74      5                   69

పాలకొండ         121 మంది         76     10                   66

ఇచ్ఛాపురం         295 మంది        186                 23                  163

శ్రీకాకుళం 988 మంది                666                 26                  640

రాజాం 354 మంది        132                 24                   108

-------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 2633 మంది        1437     99 1338

----------------------------------------------------

Updated Date - 2020-09-19T10:59:16+05:30 IST