సుందర శార్దూలం

ABN , First Publish Date - 2021-01-18T10:10:58+05:30 IST

శార్దూల్‌ ఠాకూర్‌ (115 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), వాషింగ్టన్‌ సుందర్‌ (144 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 62)ల అసాధారణ బ్యాటింగ్‌తో మూడో టెస్టులో భారత జట్టు ఆకట్టుకుంది.

సుందర శార్దూలం

  • వాషింగ్టన్‌, ఠాకూర్‌ అర్ధసెంచరీలు
  • ఏడో వికెట్‌కు శతక భాగస్వామ్యం
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 336
  • ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 21/0
  • సిడ్నీ మైదానంలో భారత్‌ చూపిన తెగువ.. గాబాలోనూ 
  • ఆవిష్కృతమైంది.. 186 పరుగులకే ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ అవుట్‌.. 
  • ఇక క్రీజులో ఉంది తొలి టెస్టు ఆడుతున్న వాషింగ్టన్‌ సుందర్‌..

ఒక టెస్టు అనుభవమున్న శార్దూల్‌. అప్పటికి భారత్‌ ఇంకా 183 పరుగుల లోటుతో ఉంది.  ఈ స్థితిలో ఆసీస్‌ ఆధిక్యం 33 రన్స్‌కు మాత్రమే పరిమితమవుతుందని ఎవరైనా ఊహించగలిగారా? కానీ జరిగిందదే.. మరో 50 పరుగులైనా సాధిస్తారా అనుకున్న దశ నుంచి ఈ ఇద్దరి పట్టుదల టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చింది. వరల్డ్‌ క్లాస్‌ బౌలర్ల నుంచి వస్తున్న బంతులను ఎలాంటి బెరుకు లేకుండా ఈ యువ బ్యాట్స్‌మెన్‌ ఆడిన తీరు అతి సుందరమే. కచ్చితమైన షాట్లతో, చక్కటి డ్రైవ్స్‌తో.. చూస్తుండగానే శతక భాగస్వామ్యంతో కంగారూల ఆధిక్యాన్ని నేలమీదికి తెచ్చి శభాష్‌ అనిపించుకున్నారు.


బ్రిస్బేన్‌: శార్దూల్‌ ఠాకూర్‌ (115 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), వాషింగ్టన్‌ సుందర్‌ (144 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 62)ల అసాధారణ బ్యాటింగ్‌తో మూడో టెస్టులో భారత జట్టు ఆకట్టుకుంది. అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌ కలిగిన ఆసీస్‌ ఈ జోడీని విడదీసేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో వీరు భారత్‌ను ఆదుకున్నారు. ఈ జోడీ ఆటతీరుతోనే ఆదివారం మూడో రోజు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 111.4 ఓవర్లలో 336 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ (38), రహానె (37), పుజార (25), పంత్‌ (23) ఓ మాదిరిగా ఆడారు. హాజెల్‌వుడ్‌కు ఐదు, స్టార్క్‌, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత కేవలం 33 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. వార్నర్‌ (20 బ్యాటింగ్‌), హారిస్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ ప్రస్తుత ఆధిక్యం 54 పరుగులు.


పేలవ షాట్లకు వెనుదిరిగి..: 62/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ తొలి సెషన్‌లో మరో 99 పరుగులు సాధించింది. అయితే రహానె, పుజార వికెట్లను కోల్పోయింది. ఈ ఇద్దరూ తొలి గంటపాటు ఓపిగ్గా బ్యాటింగ్‌ కొనసాగించారు. 39వ ఓవర్‌లో పుజార వికెట్‌ను హాజెల్‌వుడ్‌ తీయగా మూడో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన రహానె.. స్టార్క్‌ బౌలింగ్‌లో లంచ్‌ బ్రేక్‌కు ముందు స్లిప్‌లో వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అటు మయాంక్‌ మాత్రం ఈసారి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. స్పిన్నర్‌ లియాన్‌ ఓవర్‌లో భారీ సిక్సర్‌ సాధించాడు. అయితే భోజన విరామం తర్వాత రెండో బంతికే మయాంక్‌ అనవసర షాట్‌కు మూల్యం చెల్లించుకున్నాడు. కుదురుకున్న దశలో హాజెల్‌వుడ్‌ ఓవర్‌లో షార్ట్‌ లెంగ్త్‌ డెలివరీని ఆడి సెకండ్‌ స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అటు పంత్‌ కూడా కాసేపటికే పేలవ షాట్‌తో గల్లీలో ఉన్న గ్రీన్‌కు దొరికిపోయాడు.


సుందర్‌ - శార్దూల్‌ అదుర్స్‌: పంత్‌ అవుట్‌ కాగానే 186/6 స్కోరుతో భారత్‌ కష్టాల్లో పడినట్టే కనిపించింది. క్రీజులో ఉన్న సుందర్‌, శార్దూల్‌ బ్యాట్స్‌మెన్‌ కాకపోవడంతో ఆసీ్‌సకు భారీ ఆధిక్యం ఖాయమే అనుకున్నారంతా.. కానీ అనూహ్యంగా ఈ జోడీ ఎదురుదాడికి దిగింది. ఏకంగా 217 బంతులపాటు ఆసీ్‌సకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ముఖ్యంగా ఠాకూర్‌ తానెదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. కమిన్స్‌ వేసిన ఈ ఓవర్‌లో మరో ఫోర్‌ కూడా బాది తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. దీంతో టీ బ్రేక్‌ సమయానికి జట్టు స్కోరు 253/6కి చేరింది. ఇక ఆఖరి సెషన్‌లో మరింత దూకుడును కనబర్చడంతో స్కోరులో వేగం పెరిగింది. ఓవైపు తమ ఆధిక్యం తగ్గుతుండడంతో ఆసీస్‌ బౌలర్లలో నిరాశ కనిపించింది. ఈ జోడీని విడదీసే క్రమంలో బంతులు వేసీ వేసీ అలిసిపోయారు.


గంటకు 140 కి.మీ వేగంతో ఆసీస్‌ పేస్‌ త్రయం షార్ట్‌పిచ్‌ బంతులను సంధించినా ఈ ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. డ్రైవ్‌, పుల్‌ షాట్లతో ఆకట్టుకున్న ఠాకూర్‌.. లియాన్‌ ఓవర్‌లో సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే సుందర్‌ కూడా టెస్టుల్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. ఫస్ల్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా దిగే సుందర్‌ గాబా మైదానంలో కచ్చితమైన షాట్లతో అలరించాడు. ఎట్టకేలకు 103వ ఓవర్‌లో ఆసీస్‌కు బ్రేక్‌ దొరికింది. ఠాకూర్‌ను కమిన్స్‌ బౌల్డ్‌ చేయడంతో ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత సుందర్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయడంతో  27 పరుగుల తేడాతో భారత్‌ చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. 


వాళ్లు కవ్వించినా... 

నేను క్రీజులోకి వచ్చే సమయానికి జట్టు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఫ్యాన్స్‌ ఆస్ట్రేలియా బౌలర్లను ఉత్సాహపరుస్తున్నారు. మాటలతో కవ్వించి నా ఏకాగ్రతను దెబ్బతీయాలని ఆసీస్‌ ఆటగాళ్లు చూశారు. ఒక ట్రెండుసార్లు వారి ప్రశ్నలకు బదులిచ్చా. దాంతో స్లెడ్జింగ్‌కు ప్రయత్నించారు. కానీ నేను పట్టించుకోలేదు. వన్డే సిరీస్‌ ఆరంభంలో కోచ్‌ రవిశాస్త్రి అన్న మాటలు నా మదిలో మెదిలాయి. ఈ దేశంలో నువ్వు సత్తా చాటితే ఆ ప్రత్యేకతే వేరుగా ఉంటుందని చెప్పాడు. నాలో బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యముంది. జట్టులో త్రోడౌన్‌ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్న సమయంలో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటా. అది ఈరోజు ఉపయోగపడింది. క్రీజులో పాతుకుపోతే పరుగులు అవే వస్తాయి. తద్వారా పరుగుల అంతరం తగ్గిపోతుందని సుందర్‌, నేను అనుకున్నాం. ఫలితం రాబట్టాం.   

     - శార్దూల్‌ ఠాకూర్‌ 


ప్రేక్షకుల జేజేలు..

అప్పటిదాకా ఆసీస్‌కు మద్దతు పలికిన ప్రేక్షకులే..అవుటై తిరిగి వెళ్లేటప్పుడు శార్దూల్‌కు జేజేలు పలకడం విశేషం. టీమిండియా సహచరులు కూడా లేచి నిల్చొని చప్పట్లు చరుస్తూ ఠాకూర్‌ను అభినందించారు. 


గాబాలో చరిత్ర

21 ఏళ్ల వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ల వీరోచిత ఆట తీరుతో గాబా మైదానంలో భారత్‌కు రికార్డు భాగస్వామ్యం లభించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఏడో వికెట్‌కు ఈ జోడీ ఏకంగా 123 పరుగులు అందించింది. దీంతో 30 ఏళ్ల క్రితం కపిల్‌ దేవ్‌, మనోజ్‌ ప్రభాకర్‌ ఈ వికెట్‌కు నమోదు చేసిన 58 పరుగుల రికార్డు గల్లంతైంది. ఓవరాల్‌గా ఆసీ్‌సలో ఏడో వికెట్‌కు ఇది మూడో ఉత్తమ భాగస్వామ్యం. పంత్‌-జడేజా (2018-19లో 204), విజయ్‌ హజారే-హెచ్‌.అధికారి (1947-48లో 132) ముందున్నారు.


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 369

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్టార్క్‌ (బి) లియాన్‌ 44; గిల్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 7; పుజార (సి) పెయిన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 25; రహానె (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 37; మయాంక్‌ (సి) స్మిత్‌ (బి) హాజెల్‌వుడ్‌ 38; పంత్‌ (సి) గ్రీన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 23; సుందర్‌ (సి) గ్రీన్‌ (బి) స్టార్క్‌ 62; శార్దూల్‌ (బి) కమిన్స్‌ 67; సైనీ (సి) స్మిత్‌ (బి) హాజెల్‌వుడ్‌ 5; సిరాజ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 13; నటరాజన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 111.4 ఓవర్లలో 336. వికెట్ల పతనం: 1-11, 2-60, 3-105, 4-144, 5-161, 6-186, 7-309, 8-320, 9-328, 10-336. బౌలింగ్‌: స్టార్క్‌ 23-3-88-2; హాజెల్‌వుడ్‌ 24.4-6-57-5; కమిన్స్‌ 27-5-94-2; గ్రీన్‌ 8-1-20-0; లియాన్‌ 28-9-65-1; లబుషేన్‌ 1-1-0-0.


ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: హ్యారిస్‌ (బ్యాటింగ్‌) 1; వార్నర్‌ (బ్యాటింగ్‌) 20; మొత్తం: 6 ఓవర్లలో 21/0. బౌలింగ్‌: సిరాజ్‌ 2-1-12-0; నటరాజన్‌ 3-0-6-0; సుందర్‌ 1-0-3-0.


గాబా.. వీళ్లకు దాబా!

శార్దూల్‌, సుందర్‌ అద్భుత ప్రదర్శన చేశారు. గాబా.. వీళ్లిద్దరికీ దాబా. ఈ భారత జట్టు గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. దబాంగ్‌ 

- వీరేంద్ర సెహ్వాగ్‌


ఇద్దరూ అసాధారణంగా పోరాడారు. అసలైన టెస్ట్‌ క్రికెట్‌ అంటే ఇదే. అరంగేట్ర టెస్ట్‌లోనే వషీ చూపిన సహనం అద్భుతం. శార్దూల్‌.. తులా పరత్‌ మాన్లా రె (మరాఠీ భాషలో మరోసారి నీకు హ్యాట్సాఫ్‌ అని అర్థం)

- విరాట్‌ కోహ్లీ


కఠిన సవాళ్ల మధ్య టీమిండియా అమోఘమైన పోరాటం చేసింది. శార్దూల్‌, వాషింగ్టన్‌ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు

- సచిన్‌ టెండూల్కర్‌


సిరీ్‌సలో భారత ఆటగాళ్లు పోరాటానికి ప్రతీకగా నిలిచారు. తమ సామర్ధ్యం కన్నా గొప్ప ప్రదర్శనలు చేస్తున్నారు. 

-  హర్షా భోగ్లే 

Updated Date - 2021-01-18T10:10:58+05:30 IST