అందంతో పాటు ఆరోగ్యం!

ABN , First Publish Date - 2020-05-16T05:30:00+05:30 IST

ఫిట్‌నెస్‌ పరంగా సెలబ్రిటీలు అనుసరించే పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి. వ్యాయామానికి ముందు, తర్వాత వాళ్లు పాటించే నియమాలు, జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ అనుసరించదగినవే! గాయనిగా, నటిగా ఇండియన్‌ పాప్‌ చార్ట్స్‌లో మెరిసిపోయిన...

అందంతో పాటు ఆరోగ్యం!

ఫిట్‌నెస్‌ పరంగా సెలబ్రిటీలు అనుసరించే పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి. వ్యాయామానికి ముందు, తర్వాత వాళ్లు పాటించే నియమాలు, జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ అనుసరించదగినవే! గాయనిగా, నటిగా ఇండియన్‌ పాప్‌ చార్ట్స్‌లో మెరిసిపోయిన అందాల తార జాస్మిన్‌ వాలియా చెబుతున్న బ్యూటీ సీక్రెట్స్‌ ఇవి!


వర్కవుట్‌కు ముందు వార్మప్‌!

‘‘వ్యాయామానికి ముందు వార్మప్‌ ఎంతో అవసరం. లేదంటే గాయాలను కొని తెచ్చుకున్నవాళ్లం అవుతాం! వార్మప్‌ చేయకుండా నేరుగా వ్యాయామంలోకి దిగిపోతే శరీరం షాక్‌కు గురవుతుంది. అలా కాకుండా వార్మప్‌ చేస్తే ‘తీవ్రమైన వ్యాయామం చేయబోతున్నాం, అందుకు సిద్ధంగా ఉండు’ అంటూ శరీరానికి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. వార్మప్‌ కోసం స్ట్రెచె్‌సలో భాగంగా నేను సైడ్‌ స్టెప్స్‌ చేస్తాను. బేసిక్‌ వార్మప్స్‌ యూట్యూబ్‌లో కూడా దొరుకుతాయి. వార్మప్‌ చేయకుండా డాన్స్‌ చేస్తే, మరుసటి రోజు ఒళ్లంతా విపరీతమైన నొప్పులు మొదలవుతాయి. అదే వార్మప్‌ చేసి, డాన్స్‌ సాధన చేస్తే, నొప్పులూ వేధించవు. అదే వార్మప్‌ మహిమ. 


స్కిన్‌ కేర్‌! 

వ్యాయామంతో విపరీతంగా చెమట పడుతుంది. వెంట్రుకలు కూడా చెమటతో తడిసి ముద్దవుతాయి. ఇలా ప్రతిరోజూ జరుగుతుంది. కాబట్టి, చెమట వల్ల చర్మ సమస్యలు, శిరోజాల సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తాను. వర్కవుట్‌ తర్వాత ఆవిరి స్నానం చేస్తాను. క్లెన్సర్‌ లేదా టోనర్‌తో పాటు మేలు రకం మాయిశ్చరైజర్‌ వాడతాను.వర్కవుట్‌ సమయంలో వెలువడే చెమట వల్ల జుట్టు పాడవకుండా రెండు వారాలకు ఒకసారి జుట్టుకు నూనె పట్టిస్తాను. కండిషనర్‌, హెయిర్‌ మాస్క్‌లను వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే వదిలేస్తాను. అప్పటికి అవి వెంట్రుకల కుదుళ్లలో ఇంకిపోయి, పోషకాలతో వెంట్రుకలు మెరుపును సంతరించుకుంటాయి. వర్కవుట్‌ తర్వాత చెమట, మృతకణాలతో చర్మరంధ్రాలు మూసుకుపోకుండా, ఫేస్‌స్క్రబ్‌ వాడతాను.’’


Updated Date - 2020-05-16T05:30:00+05:30 IST