తీసుకున్న డబ్బులు అడిగినందుకే..

ABN , First Publish Date - 2021-03-05T05:41:18+05:30 IST

తీసుకున్న డబ్బులు అడిగినందుకే..

తీసుకున్న డబ్బులు అడిగినందుకే..
వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ సీఐ

  • ప్రియురాలిని హత్య చేసిన నిందితుడి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు


తాండూరు రూరల్‌: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకే ప్రియురాలిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తాండూరు రూరల్‌ సీఐ జలందర్‌రెడ్డి తెలిపారు. తాండూరు మండలం కరన్‌కోట్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. యాలాల మండలం పగిడ్యాల్‌కు చెందిన బ్యాగరి లక్ష్మి(30)వద్ద నుంచి పెద్దేముల్‌ మండలం బండమదిపలికి చెందిన ప్రియుడు మాల నర్సింహులు రూ.40వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లక్ష్మి పలుమార్లు కోరింది. అయినప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. దీంతో నర్సింహులు లక్ష్మిని చంపితే డబ్బులు ఇవ్వడం ఉండదనే ఉద్దేశ్యంతో పధకం పన్నాడు. గతనెల 25న రాస్నం బ్యాంకుకు వెళ్లాల్సిఉందని, డబ్బులు డ్రా చేసుకోవాలని లక్ష్మి నర్సింహులుకు తెలిపింది. ఇదే అదనుగా భావించిన నర్సింహులు తాండూరు నుంచి ఒక బీరు బాటిల్‌, కత్తి తీసుకుని రాస్నం బ్యాంకు వెళ్లారు. బ్యాంకులో పని ముగించుకొని పగిడ్యాల్‌వైపు నడుచుకుంటూ సమీపంలోని అటవీప్రదేశంలోకి ఇద్దరూ వెళ్లారు. నర్సింహులు వెంట తెచ్చుకున్న బీర్‌ ఇద్దరూ తాగారు. దీంతో నర్సింహులు తాగినమత్తులో ఉన్న లక్ష్మిని వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచి, గొంతు నులిమి హత్య చేశాడు. లక్ష్మి మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె కాళ్లకు ఉన్న రెండు వెండి కడియాలతోపాటు చేతికి ఉన్న మరో వెండి కడియం, ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో లక్ష్మి ఇంటికి రాలేదని తల్లి బ్యాగరి పద్మమ్మ గతనెల 28న యాలాల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు పెద్దేముల్‌ మండలం బండమీదిపల్లికి చెందిన మాల నర్సింహులుపై అనుమానంతో తమదైన శైలిలో విచారణ చేపట్టారు. గతనెల 25న రాస్నం అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు రూరల్‌ సీఐ వివరించారు. నర్సింహులును రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.400, వెండికియాలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

Updated Date - 2021-03-05T05:41:18+05:30 IST