డయాలసిస్‌కు పడకల క్రైసిస్‌!

ABN , First Publish Date - 2021-12-02T09:26:54+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన స్వామి (పేరు మార్చాం) వయసు 45 ఏళ్లు కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు.

డయాలసిస్‌కు పడకల క్రైసిస్‌!

  • కిడ్నీ రోగులకు ఆస్పత్రుల్లో దొరకని ఉచిత బెడ్లు
  • ఎవరైనా కిడ్నీ మార్పిడి చేయించుకుంటేనో,
  • చనిపోతేనో మాత్రమే కొత్తవారికి అవకాశం
  • రోజురోజుకూ రోగుల సంఖ్య పెరగడం వల్లే
  • రాష్ట్రంలో 46 ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాలు
  • ప్రైవేటులోనూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు
  • రోజూ పది వేల మందికి డయాలసిస్‌ 
  • ఏటా కొత్తగా 3 వేల కిడ్నీ ఫెయిల్యూర్‌ కేసులు
  • కొత్త కేంద్రాల ఏర్పాటుతోనే అందరికీ సేవలు
  • మరో 30-40 కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్లు


రాష్ట్రంలో కిడ్నీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వారందరికీ ఎప్పటికప్పుడు రక్తశుద్ధి (డయాలసిస్‌) చేస్తే తప్ప ప్రాణాలు నిలవని పరిస్థితి ఉంది. వీరికోసం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటికితోడు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలందిస్తున్నారు. రెండింట్లో కలిపి రోజుకు సుమారు పది వేల మందికి డయాలసిస్‌ చేస్తున్నారు. కానీ, కిడ్నీ విఫలమవుతున్న రోగుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడంతో.. కొత్తవారికి బెడ్‌లు దొరకడంలేదు. ఇప్పటికే డయాలసిస్‌ పొందుతున్నవారిలో ఎవరైనా కిడ్నీ మార్పిడి చేయించుకుంటే లేదా చనిపోతే తప్ప.. కొత్త రోగులకు బెడ్‌ దొరకని పరిస్థితి నెలకొంది.


హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన స్వామి (పేరు మార్చాం) వయసు 45 ఏళ్లు  కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో ఆయన రెండు మూత్రపిండాలు పూర్తిగా పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ గానీ, కిడ్నీ మార్పిడి గానీ చేయించుకోవాలని నెఫ్రాలజిస్టులు సూచించారు. దీంతో స్వామి.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్‌ చేయించుకునేందుకు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లారు. కానీ, అన్నిచోట్లా బెడ్లు ఖాళీగా లేవన్నారు. ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాలకు వెళ్లినా అదే పరిస్థితి ఉంది. బెడ్‌ కోసం ముందుగా పేరు రాయించుకోవాలని, తర్వాత చూద్దామని చెప్పారు.


అది ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్‌ కాలేజీ. అక్కడ 14 డయాలసిస్‌ యూనిట్లు ఉన్నాయి. ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు పని చేస్తుంటాయి. ఆరోగ్యశ్రీ కింద రోజుకు 25 మంది వరకు డయాలసిస్‌ చేస్తుంటారు. అక్కడ డయాలసిస్‌ బెడ్‌ కావాలని అడిగితే కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. గత పదేళ్లుగా డయాలసిస్‌ చేయించుకునేవారు ఉన్నారని, షెడ్యూల్‌ ప్రకారం వారికే చేయాల్సిందిగా నిబంధనలు చెబుతున్నాయని, తామేమీ చేయలేమని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. ఉన్నవారిలో ఎవరైనా కిడ్నీ మార్పిడి చేయించుకోవడమో, చనిపోవడమో జరిగితే తప్ప కొత్త వారికి పడకలు ఇచ్చే పరిస్థితి లేదని వారు అంటున్నారు. 


ఇదీ.. రాష్ట్రంలోని కిడ్నీ రోగుల దుస్థితి. కొందరు రోజులు, నెలల తరబడి డయాలసిస్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా బెడ్‌ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ బెడ్స్‌.. ఒకటి రెండు రోజుల తర్వాత అయినా దొరికాయి. కానీ, కిడ్నీ రోగులకు మాత్రం డయాలసిస్‌ బెడ్స్‌ దొరకాలంటే నెలలు, ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏటా కొత్తగా 3 వేల మంది మూత్రపిండాల వైఫల్యానికి గురవుతున్నారు. ఇప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్‌ అయినవారు.. ఆయా కేంద్రాల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఉన్నరోగులు తగ్గకపోగా, కొత్త రోగులు పుట్టుకొస్తున్నారు. దీంతో డయాలసిస్‌ కేంద్రాలు సరిపోవడంలేదు. పాతవారికి రక్తశుద్ధి చేస్తూనే.. కొత్త రోగులకు కూడా సేవలందించాల్సి వస్తోంది. కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగులకు వారానికి కనీసం రెండుసార్లు రక్తశుద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆ కేంద్రాల్లో వారికి షెడ్యూల్‌ స్లాట్‌ ఇస్తారు. దాని ప్రకారం వారు డయాలసిస్‌ కేంద్రాలకు వెళ్లి రక్తశుద్ధి చేయించుకుంటారు. దీంతో ఉన్న కేంద్రాలన్నింట్లో ఇప్పటికే షెడ్యూల్‌ స్లాట్స్‌ బుక్‌ అయిపోయాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగి వస్తే బెడ్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కొత్త కేసులు పెరుగుదలకు తగ్గట్లుగా డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు కావడం లేదు. దీంతో డయాలసిస్‌ రోగులు నరకం అనుభవిస్తున్నారు. 


2017లోనే డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో 5500 మంది డయాలసిస్‌ రోగులు ఉండేవారు. వీరికోసం ప్రభుత్వం 2017లో కొత్తగా రక్తశుద్ధి కేంద్రాలను ప్రారంభించింది. నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి, ఒక్కో ఆస్పత్రి పరిధిలో కొన్ని చొప్పున డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిమ్స్‌ పరిధిలో 16 కేంద్రాల్లో 85 డయాలసిస్‌ మెషిన్లు, గాంధీ పరిధిలో 13 కేంద్రాల్లో 94 మెషిన్లు, ఉస్మానియా పరిధిలో 10 కేంద్రాల్లో 73 మెషిన్ల చొప్పున మొత్తం 39 కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, 2017 డిసెంబరు నాటికి కేవలం 12 రక్తశుద్ధి కేంద్రాలే పని చేశాయి. ఆ తరువాత దశలవారీగా మిగిలిన 27 కేంద్రాల్లో డయాలసిస్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం రోగుల సంఖ్య పెరిగిపోవడంతో డయాలసిస్‌ కేంద్రాల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం 46 కేంద్రాల్లో డయాలసిస్‌ సేవలందిస్తున్నారు. వీటిలో ప్రతి నెలా 28 వేల డయాలసిస్‌ సెషన్స్‌ చేస్తున్నారు. మరోవైపు 73 ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. రెండింట్లో కలిపి రోజుకు పది వేల మందికి డయాలసిస్‌ చేస్తున్నారు. ఏటా 7.5 లక్షల డయాలసిస్‌ సెషన్స్‌ చేస్తున్నారు. ఇవన్నీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే చేస్తున్నారు. 


తొలుత నెలకు 14 వేల కౌంట్స్‌.. ప్రస్తుతం 28 వేలు

2018 ప్రథమార్ధంలో ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల్లో నెలకు సగటున 14 వేల కౌంట్స్‌ చేసేవా రు. కిడ్నీ వైఫల్యం తీవ్రతను బట్టి రోగులకు వారానికి 2-3 సార్లు డయాలసిస్‌ చేస్తారు. చేసిన ప్రతిసారీ ఒక కౌంట్‌ కింద పరిగణిస్తారు. అలా తొలినాళ్ల లో ప్రభుత్వ కేంద్రాల్లోనే నెలకు 14 వేల కౌంట్స్‌ చేయగా, ప్రస్తుతం అవి 28 వేలకు పెరిగాయి. 2014 నుంచి 2021 (నవంబరు 16) వరకు 42,66,079 డయాలసిస్‌ కౌంట్స్‌ చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఏడేళ్లలో డయాలసిస్‌కు ప్రభుత్వం రూ.575.95 కోట్లు వెచ్చించింది. 


మరో 30-40 చోట్ల కేంద్రాల ఏర్పాటుకు వినతులు

ప్రస్తుతం రాష్ట్రంలో కిడ్నీ రోగుల సంఖ్య 11 వేలకు చేరింది. దీంతో ఇప్పుడున్న డయాలసిస్‌ కేంద్రాలు సరిపోవడంలేదు. దీనికితోడు ప్రస్తుత కేంద్రాలు కొందరికి దూరంగా ఉన్నాయి. దీంతో డయాలసిస్‌ కేంద్రాల సంఖ్యను పెంచాలని స్థానిక ప్రజాప్రతినిధులపై రోగులు ఒత్తిడి తెస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి 30-40 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు పెట్టుకున్నారు. 


కొంత  గ్యాప్‌ ఉంది

ప్రస్తుతం బీపీ, షుగర్‌ వల్ల కిడ్నీ జబ్బుల శాతం పెరిగింది. దీన్ని ఆలస్యంగా గుర్తించే సమయానికి మూత్రపిండాలు చెడిపోతున్నాయి. దాంతో డయాలసిస్‌ అవసరమవుతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు డయాలసిస్‌ సౌకర్యం బాగా పెరిగింది. అయినా పెరుగుతున్న కేసులకు, ఉన్న సౌకర్యాలకు మధ్య కొంత గ్యాప్‌ ఉంది. మరిన్ని డయాలసిస్‌ కేంద్రాలు అవసరం. బీపీ, షుగర్‌ ఉన్నవారు ప్రతి ఏటా విఽధిగా కిడ్నీ ఫంక్షన్‌ టెస్టు చేయించుకోవాలి. త్వరగా వ్యాధిని గుర్తిస్తే, డయాలసిస్‌ దాకా వెళ్లకుండా కాపాడవచ్చు. ఆలస్యంగా గుర్తించడం వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం ఉంటుంది. అలాగే ఇష్టారాజ్యంగా పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్లు వేసుకోవద్దు.                                      - డాక్టర్‌ శ్యాంసుందర్‌రావు, కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్టు, కిమ్స్‌ ఆస్పత్రి

Updated Date - 2021-12-02T09:26:54+05:30 IST