బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-06-04T10:17:09+05:30 IST

ఈ నెల మూడో వారానికల్లా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని కొవిడ్‌ 19 నిపుణులు చెబుతున్నారని, దీనికి తగినట్లు జిల్లాలో పరీక్షలు, హాస్పిటళ్లు, ..

బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధం చేసుకోవాలి

మూడో వారానికి  కేసులు గరిష్ఠమయ్యే అవకాశం

65 ఏళ్లు పైబడిన వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి 

మృతుల శాతాన్ని తగ్గించాలి

వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.జవహర్‌ రెడ్డి


కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 3: ఈ నెల మూడో వారానికల్లా కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని కొవిడ్‌ 19 నిపుణులు చెబుతున్నారని, దీనికి తగినట్లు జిల్లాలో పరీక్షలు, హాస్పిటళ్లు, బెడ్లు, ఐసీయూ, వెంటిలేటర్లు, వైద్యులను సిద్ధం చేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కర్నూలు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఆయన కరోనా కట్టడి చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో కర్నూలు, అనంతపురం కలెక్టర్లు వీరపాండియన్‌, గంధం చంద్రుడు, కర్నూలు ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రవిపట్టన్‌శెట్టి, రామసుందర్‌రెడ్డి, డీఎంఏ డా.రాంప్రసాద్‌, కర్నూలు, అనంతపురం డీఎంహెచ్‌వోలు డా.రామగిడ్డయ్య, డా.అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.


జవహర్‌రెడ్డి మాట్లాడుతూ 65 ఏళ్లు పైబడిన వారికి కరోనా టెస్టులను పెద్ద సంఖ్యలో చేయాలన్నారు. జిల్లాలో మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కంటైన్మెంట్‌ జోన్లలో అందరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రత్యేకించి కర్నూలు, ఆదోని, నంద్యాల మున్సిపాల్టీ పరిధుల్లో 65 ఏళ్లు పైబడిన బీపీ, షుగర్‌, హృద్రోగ సమస్యలున్న వారికి టెస్టులు చేయించాలన్నారు. జూన్‌ మూడో వారానికల్లా కేసులు పెరిగే ఆస్కారం ఉందని, అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లాలో 4 వేల పడకలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలన్నారు. 


జిల్లాలో 45వేల మందికి పరీక్షలు

కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 45,618 కరోనా శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహించగా, 723 పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు. 25 మంది మృతి చెందారన్నారు. ఇంకా 2,691 శాంపిల్స్‌ పరీక్షలు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో 68 శాతం కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. ఆర్‌టీపీసీఆర్‌, ట్రునాట్‌, టెస్టింగ్‌ యంత్రాలకు అదనంగా రెండు మరో ఆర్‌టీపీసీఆర్‌ యంత్రాలను జిల్లాకు మంజూరు చేయాలని కలెక్టర్‌ కోరారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ చంద్రుడు మాట్లాడారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డా.పి.చంద్రశేఖర్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌రెడ్డి, డీసీహెచ్‌లు డా.శిరీష, డా.రమేష్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, ఈఈ విజయభాస్కర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T10:17:09+05:30 IST