‘టిమ్స్‌’లో నిండిపోయిన బెడ్లు

ABN , First Publish Date - 2021-05-14T09:01:52+05:30 IST

కరోనా విజృంభణ నేపథ్యంలో గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో రోగుల తాకిడీకి బెడ్లన్నీ నిండిపోయాయి. మరోవైపు ఆస్పత్రికి భారీ సంఖ్యలో రోగులు వస్తూనే ఉన్నారు

‘టిమ్స్‌’లో నిండిపోయిన బెడ్లు

గేటు వద్ద అంబులెన్సుల్లో కరోనా రోగులు క్యూ.. బెడ ్ల కోసం గంటల తరబడి ఎదురుచూపులు

వైద్య సిబ్బంది కొరతతో అవస్థలు


మియాపూర్‌, మే13(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ నేపథ్యంలో గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో రోగుల తాకిడీకి బెడ్లన్నీ నిండిపోయాయి. మరోవైపు ఆస్పత్రికి భారీ సంఖ్యలో రోగులు వస్తూనే ఉన్నారు. గురువారం ఆస్పత్రి ప్రధానగేటు వద్ద దాదాపు 10 అంబులెన్సులు, మరో 15 ఆటోల్లో కరోనా రోగులు, వారి బంధువులు క్యూ కట్టారు. రోగుల్లో చాలా మంది శ్వాస సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టిమ్స్‌ ఆస్పత్రిలో చేరాలంటే గంటల తరబడి సమయం పడుతోంది. ఇక ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయాలు ఉండే వార్డులో బెడ్‌ దొరకడం గగనమైపోతోంది. అత్యవసరం ఉన్న రోగులను వెంటనే ఆస్పత్రిలోకి తీసుకువెళ్లి వైద్య చికిత్స అందించే పరిస్థితి లేదని, దీంతో వారి ఆరోగ్యం విషమించి చనిపోతున్నారని రోగుల బంధువులు అంటున్నారు. రోజుకు దాదాపు 200 మంది రోగులు టిమ్స్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 600 మందికి సాధారణ చికిత్స, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న మరో 100 మందికి ఆక్సిజన్‌, వెంటిలేషన్‌ ఉన్న వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రతి రోజు 20-30 మంది మృత్యువాత పడుతున్నారు. 


కింది అంతస్తుల నుంచి వచ్చే ఆక్సిజన్‌ పైపుల ద్వారా పై అంతస్తుల్లోని రోగులకు అందే క్రమంలో సరైన ప్రెజర్‌ ఉండకుండాపోతుండడంతో కొంతమంది రోగులు చనిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టిమ్స్‌ ఆస్పత్రిలోసిబ్బంది కొరత  కూడా తీవ్రంగా ఉంది. మరోపక్క ఇక్కడ పనిచేస్తున్న కేర్‌టేకర్లు, వైద్యసిబ్బంది చాలా మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోగులకు సమయానికి మందులు, ఆహారం అందించకపోవడంతో చనిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం వైద్య సిబ్బందిని నియమించి ప్రాణాలు కాపాడాలని రోగుల బంధువులు కోరుతున్నారు. కాగా, రెండు వారాల  క్రితం క్యాంటీన్‌లో ఆహారం బాగోలేదని క్యాంటీన్‌ కాంట్రాక్టర్‌ను మార్చినపట్టికి మళ్లీ పరిస్థితి అలానే ఉందని రోగుల బంధువులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-14T09:01:52+05:30 IST