పడకలు సరే.. వసతుల మాటేమిటి?

ABN , First Publish Date - 2021-05-17T06:51:01+05:30 IST

తిరుపతిలోని ఆయుర్వేద వైద్యశాలను కొవిడ్‌ చికిత్సకు మార్చారు. పడకలకు తగ్గట్టుగా వసతులు, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమయ్యారు. దీనివల్ల కరోనా బాధితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పడకలు సరే.. వసతుల మాటేమిటి?

ఆయుర్వేద వైదశాలలో కరోనా బాధితుల అవస్థలు

వైద్యపరికరాలు, మందులకు కొరత 

తిరుపతి, మే 15  (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఆయుర్వేద వైద్యశాలను కొవిడ్‌ చికిత్సకు మార్చారు. పడకలకు తగ్గట్టుగా వసతులు, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమయ్యారు. దీనివల్ల కరోనా బాధితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

ఆయుర్వేద వైద్యుశాలలో 190 పడకలున్నాయి. అందులో 20 బెడ్స్‌కు ఆక్సిజన్‌ సరఫరా రిపేరు కావడంతో ఖాళీగానే ఉంచుతున్నారు. 

మొదటి ఫ్లోర్‌లో ఎంత పెట్టినా రెండు లీటర్ల కంటే ఎక్కువ ఆక్సిజన్‌ రావడంలేదు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 70 మంది బాధితులకు సరిపడా ఉంటే 170 మందికి పెడుతున్నారని తెలుస్తోంది. వెంటనే ఆక్సిజన్‌ సరఫరా నిపుణులతో తనిఖీ చేయించి సమస్యను పరిష్కంచాల్సి ఉంది. 

- ఆస్పత్రిలో 10 వార్డులున్నాయి. వంద మంది బాధితులకు డ్యూటీలో కేవలం నలుగురే నర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. వీరికి సంఖ్యను పెంచాలి.

-షుగర్‌ చూడటానికి ఒక్క పరికరమూ లేదు. పల్స్‌ ఆక్సీ మీటర్‌ ఫ్లోర్‌ మొతానికి ఒక్కటే ఉంది. బ్రీతింగ్‌ అందకపోతే పెట్టే నెబులైజేషన్‌ కూడా లేదు. ఆక్సిజన్‌ థెరపీ ఇవ్వడానికి ఎన్‌.ఐ.వి.(నాన్‌ ఇన్విసివ్‌ వెంటలేటర్‌) లేదు. సి.ప్యాప్‌, బై ప్యాప్‌ వంటి చిన్న చిన్న యంత్రాలు కూడా లేవు. 200 మందికి ఒక ఈసీజీ మిషన్‌ ఉంది. అదీ బతికున్న వారికి కాకుండా.. చనిపోయారా లేదా అని నిర్ధారించుకోవడానికి వాడుతున్నట్లు సమాచారం. 

-రెమ్‌డెసివిర్‌ సుమారు 200 కావాలని వైద్యులు అడిగితే 10 ఇవ్వడంతో ఎవరికి వాడాలో తెలియని పరిస్థితి. దీంతో పలుకుబడి ఉన్నవారికే వాడుతున్నారనే విమర్శలున్నాయి. 

-200 పడకలకు ఒక పల్మనాలలిస్టు, ఒక అనస్థీషియన్‌ ఉండాలి. కానీ ఇక్కడ లేరు.

-చిన్న చిన్న ఇబ్బందులకు వాడాల్సిన మాత్రలు కూడా రెండు రోజులుగా లేవు. 

- సాచురేషన్‌ తగ్గిపోతే ఎమర్జెన్సీ సూదులు ఉంటాయి. అలాంటివీ లేవిక్కడ. 

- ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో అడ్మిషన్స్‌ అనధికారికంగా ఆపేశారు. ఆక్సిజన్‌ లేదు. మీ  రిస్క్‌పైన ఉండాల్సి వస్తుందని చెప్పి పంపేస్తున్నారని తెలుస్తోంది.  

- ఆస్పత్రిలోని కొత్త డాక్టర్లు, హౌస్‌ సర్జన్లు, జూనియర్‌ వైద్యులు కష్టపడితున్నా పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవటం ఇబ్బందులుపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి వైద్యులకు అవసరమైన పరికరాలను కల్పిస్తే మరింత మెరుగైన వైద్యం ఆయుర్వేద వైద్యశాలలో లభించే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. 


Updated Date - 2021-05-17T06:51:01+05:30 IST