బీ అలర్ట్‌

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

పట్టణానికి చెందిన ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు

బీ అలర్ట్‌

షాద్‌నగర్‌లో సంపూర్ణంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌

పట్టణవాసులను వెంటాడుతోన్న కరోనా మహమ్మారి

తాజాగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు పాజిటివ్‌

లాక్‌డౌన్‌ సడిలింపే కొంపముంచిందా!

కంటైన్‌మెంట్‌ జోన్లుగా పలు కాలనీలు

కాలనీల్లో సమాచారం సేకరిస్తున్న వైద్య సిబ్బంది

విస్తృతంగా తనిఖీలు చేపడుతున్న పోలీసులు


షాద్‌నగర్‌: పట్టణానికి చెందిన ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ విధించిన నాటినుంచి ఒక్క పాజిటివ్‌ కేసు కూడా లేకపోవడంతో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన రెండు, మూడు రోజుల్లోనే ప్రజలు ఇష్టానుసారంగా బయట సంచరించడం ప్రారంభించారు. కొందరు దూర ప్రాంతాల్లో జరిగిన శుభకార్యాలకు కూడా హాజరయ్యారు. అయితే, పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన యువకుడు నవాబ్‌పేట మండలంలోని బండ ఎల్కిచర్లలో జరిగిన శుభకార్యానికి వెళ్లొచ్చాడు. అతని స్నేహితుడైన మరో యువకుడు హైదరాబాద్‌లోని జియాగూడలో కరోనా పాజిటివ్‌తో మృతిచెందిన ఓ వ్యక్తి అంత్యక్రి యల్లో పాల్గొన్నాడు.


దీంతో వైద్యశాఖ, పోలీసు సిబ్బంది పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే 33 మందిని కట్టడి కేంద్రానికి తరలించారు. ఈ కోవలోనే ఇంకెవరితో ఆ యువకులు కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారనే కోణంలో విచారణ చేపట్టారు. సోమవారం  ఈశ్వర్‌కాలనీకి చెందిన మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు కాలనీలను పాటు మెయిన్‌రోడ్‌ పరిసర ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి పూర్తిగా కట్టడి చేశారు. కాగా, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏసీపీ సురేందర్‌ సూచన మేరకు సోమవారం నుంచి పట్టణంలోని దుకాణాలన్నింటినీ మూసి వేయించారు. కేవలం కిరాణ, మెడికల్‌, కూరగాయల దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. అనవసరంగా బయటకు వచ్చిన వ్యక్తుల వాహనాలను పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. కట్టడి చేసిన ఆయా కాలనీలకు ఎవరూ వెళ్లకుండా తగిన చర్యలు చేపట్టారు. దీంతో మెయిన్‌రోడ్‌తో పాటు పలు కాలనీలకు వెళ్లే రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.    


కట్టడి కేంద్రాల్లో కరోనా అనుమానితులు

కీసరరూరల్‌: కరోనా వైరస్‌ అనుమానితులను కీసర మండల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం కట్టడి కేంద్రానికి తరలిం చారు. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమెను గాంధీ అసుపత్రికి తరలించారు. అమె కుటుంబ సభ్యులు ముగ్గురు దమ్మాయిగూడలోని బంధువుల ఇంట్లో ఉన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి వారి పరిస్థితిని వివరించారు.


తమకు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మండల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వారి వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.  కరోనా లక్షణాలు లేకపోవడంతో వారితో పాటు మరో నలుగురిని ఇంట్లోనే ఉండాలని సూచించారు. వారిని నిత్యం పర్యవేక్షించి అవసరమైన మందులను అందజేయనున్నట్లు మండల వైద్యాధికారి సరిత తెలిపారు. కట్టడి కేంద్రంలో ఉన్న వారికి నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు కమిషనర్‌ స్వామి వెల్లడించారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST