బెగ్గింగ్‌ రహిత నగరంగా తీర్చిదిద్దుతాం- రెడ్డి సుమ్రహ్మణ్యం

ABN , First Publish Date - 2020-02-23T01:07:50+05:30 IST

రాజధాని నగరాన్ని బెగ్గింగ్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు.

బెగ్గింగ్‌ రహిత నగరంగా తీర్చిదిద్దుతాం- రెడ్డి సుమ్రహ్మణ్యం

హైదరాబాద్‌: రాజధాని నగరాన్ని బెగ్గింగ్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. బెగ్గర్స్‌కు పూర్తిస్థాయిలో పునరావాసం,ఆర్ధిక స్వాలంబనకు మార్కెటింగ్‌ టైఅప్‌తో అనువైన వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా పది నగరాలను పైలట్‌  ప్రాజెక్ట్‌ కింద చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. 2020 ఏప్రిల్‌ నుంచి పైలట్‌ ప్రాజెక్ట్‌ను అమలుచేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. టూరిజం ప్లాజాలో శనివారం జీహెచ్‌ఎంసి, పోలీసు, ఎన్‌జీవోలతో నిర్వహించిన సదస్సులో బెగ్గింగ్‌లో ఉన్నవ్యక్తులకు గౌరవ ప్రదమైన పునరావాసం కల్పించే సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బెగ్గర్స్‌ పునరావాసానికి రూ. 10కోట్లను కేంద్ర ప్రభుత్వం విదుదల చేయనున్నట్టు తెలిపారు. 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ గా పనిచేసినప్పుడు మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉండేదని కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్ననగరాల్లో ఉత్తమ సిటీగా హైదరాబాద్‌ గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. దానికి ఇక్కడ ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులు , బహుళ సంస్కృతిక, సామరస్య జీవన విధానం మూల కారణమని తెలిపారు. 


నిరుపేదల సంక్షేమం పైనే నగర ఔన్నత్యం కనబడుతుందని తెలిపారు. పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. పేదలు గౌరవంగా ఉండేందుకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మిస్తున్నదని, పేదలకు అన్నపూర్ణ భోజన పథకాన్ని అమలుచేస్తున్నదని అభినందించారు. ప్రతి వ్యక్తి గౌరవంగా బ్రతికేందుకు అవకాశం కల్పించడంలో భాగంగా బెగ్గర్స్‌ సామాజిక, ఆర్ధిక , కుటుంబ పరిస్థితులను గుర్తించాలని అన్నారు. ఈ అంశంలో ఎన్‌జీవోలతో పాటు కమ్యూనిటీ పాత్ర కీలకమైనదని చెప్పారు. బెగ్గర్స్‌కు పునరావాసం కల్పించడంతోపాటు వారి మానసిక,శారీరక రుగ్మతలకు వైద్యసేవలను అందించాలని అన్నారు. స్వతంత్రంగా బతికేందుకు జీవనోపాధిని కల్పించే రంగంలో నైపుణ్యశిక్షణతోపాటు మార్కెటింగ్‌ను అనుసంధానం చేయాలని సూచించారు. సంవత్సరం కాలంలో హైదరాబాద్‌నగరంలో బెగ్గర్స్‌కు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక ఉండాలని సూచించారు. బెగ్గింట్‌లో ఉన్న కుటుంబాల పిల్లలకు విద్యా సదుపాయాలను కల్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. 


విద్య వల్ల ఆయా కుటుంబాల వ్యవహార శైలిలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో కేంద్ర సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి రాధికా చక్రవర్తి మాట్లాడుతూ బెగ్గర్స్‌కు సమగ్ర పునరావాస కార్యక్రమం పై విధి విధానాలను రూపొందించేందుకు దేశ వ్యాప్తంగా సామాజికవేత్తలు, విద్యావేత్తలు, స్వచ్చంద సంస్థలు ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నట్టు తెలిపారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ మాట్లాడుతూ బెగ్గర్స్‌ పునరవాస కార్యక్రమంలో అమలులో కేంద్ర ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసి పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. ఈ సదస్సులో రంగారెడ్డిజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరీశ్‌, జీహెచ్‌ఎంసి అడిషనల్‌ కమిషనర్‌ సంతోష్‌, రాహుల్‌బొజ్జా , శంకరయ్య, యుడిసి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సౌజన్య, ట్రాఫిక్‌ డిసిపి చౌహాన్‌ పోలీస్‌అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-23T01:07:50+05:30 IST