Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంచినీరు రోడ్డు పాలు

బేగంపేట చికోటి గార్డెన్‌ రోడ్డులో పగిలిన పైపులైన్‌

వాటర్‌వర్క్స్‌ అధికారుల దృష్టికి 

తీసుకెళ్లినా పట్టించుకోని వైనం

బస్తీల్లో చివరి ఇళ్లకు లో ప్రెషర్‌తో సరఫరా

ఇబ్బంది పడుతున్న స్థానికులు


హైదరాబాద్/బేగంపేట: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. మంచినీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన వాటర్‌వర్క్స్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోడ్డు పాలవుతోంది. ఆయా సెక్షన్ల పరిధుల్లోని బస్తీలు, కాలనీల్లోని చివరి ఇళ్లకు లోప్రెషర్‌తో మంచినీరు సరఫరా అవుతుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ వాటర్‌ వర్క్స్‌ సెక్షన్‌ పరిధిలో నిత్యం పలుచోట్ల పైపులైన్‌లు లీకేజీ అవుతుండడంతో మంచినీరు వృథాగా పోతోంది. 

వారం రోజుల నుంచి ప్రకాశ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చికోటి గార్డెన్‌కు వెళ్లే రహదారి పక్కన పైపులైన్‌ పగలడంతో మంచినీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈ విషయం ఆ సెక్షన్‌ పరిధిలోని అధికారులకు తెలియకపోవడం విశేషం. రోడ్డుపై నీరు వృథాగా పోతోందని స్థానికులు లైన్‌మెన్లకు చెప్పినా వారు పట్టించుకోలేదు. మేనేజర్‌ శశాంక్‌కు ఫోన్‌ చేయగా ఆయన లిఫ్ట్‌ చేయలేదని స్థానికులు చెబుతున్నారు. వాటర్‌, సివరేజీ సమస్యలపై ఫోన్‌ చేస్తే సదరు అధికారి స్పందించడం లేదని పలువురు అంటున్నారు.


లీకేజీలపై దృష్టి సారించని అధికారులు

బేగంపేట డివిజన్‌లోని పలు బస్తీల్లో మంచినీరు లో ప్రెషర్‌తో సరఫరా అవుతోంది. మాతాజీనగర్‌ ప్రాంతంలో చివరన ఉన్న సుమారు 50 ఇళ్లకు లో ప్రెషర్‌తో మంచినీరు వస్తోందని వాటర్‌ వర్క్స్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓల్డ్‌ కస్టమ్స్‌ బస్తీలో సైతం లో ప్రెషర్‌తో సరఫరా అవుతోంది.  ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలో ఖాళీ స్థలం పక్కన చెత్త గోడౌన్ల వద్ద ఉన్న పలు ఇళ్లకు మంచినీరు సరిగా రావడం లేదని ప్రజలు కొద్దిరోజుల క్రితం కార్పొరేటర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు పైపులైన్‌ల లీకేజీలపై దృష్టి సారించకపోవడంతో సమస్య ఏర్పడుతోందని అంటున్నారు. 


సమస్య పరిష్కరిస్తాం

బేగంపేటలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం. కొన్నిచోట్ల లో ప్రెషర్‌తో సరఫరా అవుతోందని ఫిర్యాదులు రావడంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆయా ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ప్రధాన రహదారిలో పైపులైన్‌ లీకేజీ సమస్యను సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.

- టి. మహేశ్వరి, బేగంపేట కార్పొరేటర్‌ 

Advertisement
Advertisement