రోజా కన్నీటి వెనుక..

ABN , First Publish Date - 2021-01-19T07:17:45+05:30 IST

నోరు విప్పితే నిప్పులుమిసే రోజా, ఎవరినైనా.. ఎంతకైనా..

రోజా కన్నీటి వెనుక..

పొగపెడుతున్న సొంత పార్టీ నేతలు   

పారిశ్రామికవాడ కోసం రోజా సేకరించిన భూముల్లో  టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ప్రతిపాదన


తిరుపతి(ఆంధ్రజ్యోతి): నోరు విప్పితే నిప్పులుమిసే రోజా, ఎవరినైనా ఎంతకైనా సవాలు చేసే రోజా, టీవీ తెరమీద పంచాయతీల్లో  బాధితుల పక్షాన నిలబడి దబాయించి మాట్లాడే రోజా...సోమవారంనాడు శాసనసభ హక్కుల కమిటీ ఎదుట భోరుభోరున ఏడ్చిన తీరు రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది.  ఫైర్‌బ్రాండ్‌గా పేరుబడ్డ రోజా ఇంత బేలగా కన్నీటి పర్యంతం కావడానికి వెనుక కారణాలేమిటన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎన్నికలకు ముందు, తర్వాతా పార్టీలో రోజాకు ప్రాధాన్యంలో తేడా స్పష్టంగా కనిపించడం ఒక కారణం అయితే, ఆశించిన పదవి దక్కకపోయినా నియోజకవర్గంలో కూడా కనీస ప్రాధాన్యం తనకు దక్కడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. దీని వెనుక ఉన్నవారితో నేరుగా ఢీకొనలేక, మౌనంగా ఉండలేక  సతమతమవుతున్న రోజా చివరికి సోమవారం శాసనసభ హక్కుల కమిటీ ముందు భావోద్వేగంతో బద్దలయ్యారు.


ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ పదవి పట్ల అసంతృప్తి ఉన్నా సర్దుకుని స్వీకరించారు. తన ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో రోజా ప్రత్యర్ధి వర్గానికి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చినా సర్దుకున్నారు. అయితే ఆ వర్గం మాత్రం తనతో సఖ్యతగా ఉండడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల వెనుక జిల్లాలో చక్రం తిప్పుతున్న నాయకుడి పాత్ర ఉందని రోజా వర్గం భావిస్తోంది. అధికారులెవరూ ఏ విషయంలోనూ తనకు సమాచారం ఇవ్వకపోవడం వెనుక కూడా కారణం ఈ నాయకుడే అని వారు నమ్ముతున్నట్టు తెలుస్తోంది.


రోజాకు తెలియకుండానే టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు

నగరి నియోజకవర్గంలో పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం తాను కష్టపడి రైతులను ఒప్పించి సేకరించిన స్థలాన్ని తనకు తెలియకుండా టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాల కోసం  కేటాయించాలంటూ ప్రతిపాదనలు సిద్ధం చేయడం కూడా రోజా ఆవేదనకు, ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. వడమాలపేట మండలం పాదిరేడు రెవిన్యూ గ్రామంలో 475 ఎకరాల భూమిని పారిశ్రామికవాడ  కోసం రోజా పట్టుబట్టి సేకరిస్తున్నారు. భూములిచ్చిన రైతులకు ఆమె పలు హామీలు కూడా ఇచ్చారు. మొత్తం ప్రక్రియ పూర్తవుతున్న దశలో ఒక్కసారిగా ఆ భూములను టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాల కోసం కేటాయించాలన్న ప్రతిపాదన సిద్ధమైంది.


టీటీడీకి చెందిన ఓ కీలక వ్యక్తి, జిల్లాకు చెందిన ఓ మంత్రి ఎమ్మెల్యే రోజాకు తెలియకుండానే ఆ భూములను టీటీడీ ఉద్యోగులకు కేటాయించేలా అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించడంతో పాటు నేరుగా సీఎం జగన్‌ను కలసి ఆమోదముద్ర వేయించారని సమాచారం. ఆలస్యంగా విషయం తెలుసుకున్న రోజా నేరుగా సీఎంను కలసి పరిస్థితి వివరించారంటున్నారు. తొలుత సంబంధిత భూములను ఏపీఐఐసీ కోసం సేకరిస్తున్నందున టీటీడీకి కేటాయించలేమని టీటీడీకి లేఖ రాసిన జిల్లా ముఖ్య అధికారి, తర్వాత దానికి విరుద్ధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం రోజాకు ఆగ్రహం తెప్పించిందని చెబుతున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీయడానికే పనిగట్టుకుని ఇలా చేస్తున్నారని రోజా భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-01-19T07:17:45+05:30 IST