Abn logo
Oct 29 2020 @ 01:00AM

‘బెకా’ బంధం

భారత్‌, అమెరికా ‘టూ ప్లస్‌ టూ’ చర్చలకు ఈ మారు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కరోనా భయంతో విదేశీ పర్యటనలకు నేతలు వెనుకంజవేస్తున్న కాలంలో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులు మాత్రం ముఖానికి గుడ్డకట్టుకొని మరీ ఢిల్లీ వచ్చి వాలారు. మరో వారంలో అమెరికాలో ఎన్నికలు ఉండగా, అందులో డెమోక్రాట్లదే విజయమని పలు విశ్లేషణలు తేల్చేస్తున్న నేపథ్యంలో ఉభయదేశాల రక్షణ, విదేశాంగమంత్రుల మధ్యా ఈ చర్చలు జరిగాయి. భారత్‌తో బంధానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యం ఎంతటిదో ఈ పరిణామం తెలియచెబుతున్నది.


చర్చోపచర్చల అనంతరం ఉభయదేశాలూ ‘బేసిక్‌ ఎక్స్‌ఛేంజ్‌ అండ్‌ కో ఆపరేషన్‌ అగ్రిమెంట్‌’ (బెకా)పై సంతకాలు చేశాయి. రక్షణరంగంలో సహకారానికి ఉపకరించే నాలుగు మౌలిక, కీలక ఒప్పందాల్లో ఇది చివరిది. ఉభయదేశాల రక్షణ సంబంధాలను మరింత బలంగా ముడివేసే ఈ ఒప్పందంతో అత్యాధునిక మిలటరీ సాంకేతికతను అందుకోవడానికీ, ఉపగ్రహ రహస్య సమాచారాన్ని పంచుకోవడానికీ వీలవుతుంది. ఇప్పటివరకూ అమెరికా తన సైనిక అవసరాలకు మాత్రమే వాడుతున్న కీలక టెక్నాలజీని ఇకపై మనకూ ఇస్తుందని అంటున్నారు. రక్షణ రంగ తయారీలోనూ అమెరికా పాత్ర విశేషంగా పెరుగుతుంది. ఈ ఒప్పందంతో భారత సైనిక రహస్యాలు అమెరికా గుప్పిట్లోకి వెళ్ళే ప్రమాదం ఉన్నదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నవే. కూలంకష చర్చలతో వాటిని సంపూర్ణంగా నివృత్తి చేసుకొన్నాకే రక్షణపరంగా ఇలా ఒక్కటయ్యామని మన నేతలు భరోసా ఇస్తున్నారు. అమెరికాకు దాదాపు యాభైఏడు దేశాలతో బెకా ఒప్పందం ఉన్నది కనుక ఇది మనకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు. ఒప్పందం కుదర్చుకొన్న దేశాల్లో కొన్నింటికి అమెరికా తన రక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలరీత్యా అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటి రక్షణ వ్యవస్థలను మెరుగుపరచినమాట వాస్తవం. విస్తృతమైన అమెరికా నిఘా ఉపగ్రహాల వ్యవస్థను వాడుకోగలిగిన కారణంగా ఈ దేశాల క్షిపణి ప్రయోగ సామర్థ్యమూ మెరుగుపడింది. ‘బెకా’ ఒప్పదంతో అమెరికా మనకు అధునాతన సాయుధ డ్రోన్లను సమకూరుస్తుంది, మన దేశ క్షిపణులు, డ్రోన్లు లక్ష్యాలను మరింత కచ్చితత్వంతో ఛేదించేందుకు అగ్రరాజ్యం అందించే ఉపగ్రహ సమాచారం ఉపకరిస్తుంది.


చైనాకు ప్రత్యక్ష, పరోక్ష హెచ్చరికలు చేస్తూ, భారత్‌కు అండగా మేమున్నామంటూ అమెరికా సీనియర్‌ మంత్రులు గట్టిగా గర్జించారు. లద్దాఖ్‌ సరిహద్దుల్లో అతిక్రమణలకు పాల్పడి, వేలమంది సైనికులను మోహరించి, ఆర్నెల్లుగా ఉద్రిక్తతలను కొనసాగిస్తున్న చైనాకు ఈ ఒప్పందం ఓ హెచ్చరికగా పనిచేస్తుందని కొందరి నమ్మకం. ఇటీవలే అమెరికా–జపాన్‌–ఇండియా–ఆస్ట్రేలియాల ‘క్వాడ్‌’తో సంయుక్త నౌకా విన్యాసాలకు సిద్ధపడిన తరువాత, ఈ ఒప్పందం భారత్‌కు వ్యూహాత్మక దన్ను ఇవ్వవచ్చు. వారంలో ఎన్నికలు ఉండగా ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఒప్పందానికి సిద్ధపడటంలో ఆశ్చర్యమేమీ లేదు. చైనాను నియంత్రించాల్సిన అవసరం ఒక విధంగా భారత్‌కంటే అమెరికాకే ఎక్కువ. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న చైనాను తాను నలుమూలలనుంచీ చుట్టుముడుతున్నానని ట్రంప్‌ ఓటర్లకు చూపుతున్నారు. ట్రంప్‌ బృందం ఇరుదేశాల మధ్యా ఉన్న రక్షణ సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ, అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ తొందరపడకూడదని భారత్‌ నిర్ణయించుకుందట. ఉభయదేశాల సైన్యం మధ్యా ‘ఇన్నోవేషన్‌ పార్టనర్‌షిప్‌’ వంటివి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాతే సాధ్యపడే అవకాశాలున్నాయి. 


డెమోక్రాట్లు, రిపబ్లికన్లలో ఎవరు గెలిచినా అమెరికా భౌగోళిక రాజకీయాల్లో వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ పాత్ర తగ్గేదేమీ కాదు. కానీ, ఉభయదేశాల రక్షణ భాగస్వామ్యాన్నీ ట్రంప్‌–మోదీ కలసికట్టుగా ముందుకు తీసుకుపోయిన తీరు గతంలో లేనిది. చైనాను నిలువరించేందుకు వాడుకోవడం తప్ప ట్రంప్‌ ఏలుబడిలో మిగతా చాలా విషయాల్లో భారత్‌కు అన్యాయమే జరిగింది. ఉద్యోగాల్లోనూ, వాణిజ్యంలోనూ ట్రంప్‌ ప్రసాదించిందల్లా అంక్షలూ అడ్డంకులే. కరోనా కష్టాల్లో ఉన్న భారత్‌కు ఇతర రంగాల్లోనూ అమెరికా సహకారం హెచ్చాలి. అప్పుడే ఈ స్నేహానికి అర్థం, పరమార్థం. 

Advertisement
Advertisement