నమ్మకం కలగాలి

ABN , First Publish Date - 2020-06-06T07:47:33+05:30 IST

ఉపద్రవాలు, వైపరీత్యాల సమయంలో ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం ఏర్పడడం ముఖ్యం. ఈ ఆపద నుంచి ఈ పాలకుల నాయకత్వంలో గట్టెక్కగలము, ప్రమాదాన్నుంచి ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, నిపుణులు,..

నమ్మకం కలగాలి

ఉపద్రవాలు, వైపరీత్యాల సమయంలో ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం ఏర్పడడం ముఖ్యం. ఈ ఆపద నుంచి ఈ పాలకుల నాయకత్వంలో గట్టెక్కగలము, ప్రమాదాన్నుంచి ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, నిపుణులు, బలగాలు– అందరూ సమర్థంగా, సరైన దిశలో పనిచేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో బలంగా ఏర్పడాలి. ఇటువంటి సందర్భాలలో బలప్రదర్శనతో విధేయతను సాధించలేము. కేవలం నమ్మకం, కేవలం విశ్వాసం మాత్రమే ప్రజలను నియమబద్ధం చేయగలవు. ఆధునిక కాలంలో, ప్రభుత్వాల చర్యలు మాత్రమే కాక, అవి వెల్లడిస్తున్న సమాచారం కూడా విశ్వసనీయతను కలిగించే సాధనమే. సమాచారాన్ని ఇష్టం వచ్చినట్టు పెంచి, తగ్గించి, మినహాయించి, వక్రీకరించి ప్రజలలో ప్రచారం చేయడం ద్వారా తమ రాజకీయ లక్ష్యాలను సాధించుకున్న నియంతలు చరిత్రకు తెలుసు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో సైతం సమాచారనిర్వహణ మీదనే ఏలికలు అమితంగా ఆధారపడుతున్నారు. సత్యమో అసత్యమో ఏదయితేనేం, విశ్వసనీయత కల్పించడం తాత్కాలికంగా అయినా ఫలితాలను సాధిస్తుంది. 


కరోనాకాలంలో అధికారిక సమాచారం మీద ప్రజలకు క్రమంగా విశ్వాసం సడలిపోతోంది. ముప్పు మొదలయినప్పుడు, ప్రభుత్వం మీద విశ్వాసంతో లాక్‌డౌన్‌ వంటి కఠినచర్యలకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. ఆ సహకారం వెనుక ఎంతో త్యాగం ఉన్నది. అధిక సంఖ్యాక ప్రజలు తమ జీవనోపాధిని, భవిష్యత్తును పణంగా పెట్టుకుని, నిర్బంధజీవనంలోకి మళ్లారు. వలసకార్మికుల పరిస్థితి అయితే, లాక్‌డౌన్‌ ముఖచిత్రంగా మారి దేశాన్ని నిలదీసింది. జీవనోపాధి అదృశ్యమైపోయి, రవాణాసాధనమే లేనప్పుడు, కాలినడకన వేలమైళ్లు నడవడాన్ని ఎంచుకున్న ఆ శ్రమజీవులు, ఆ ఆత్మహింసను కాక, ఏ దౌర్జన్యాన్నో ఎంచుకుని ఉంటే? అమెరికాలో జరుగుతున్నదాన్ని చూసి, మనదేశంలో ప్రజలు నేర్చుకోవాలి అని అన్నాడని సీనియర్‌ న్యూస్‌ ప్రెజెంటర్‌ వినోద్‌ దువాను సోషల్‌ మీడియాలోని వేధింపురాయుళ్లు బాధిస్తున్నారు కానీ, ఆయన అన్నదాంట్లో తప్పేమీ లేదు.


ఈ దేశప్రజలు కూడా ఇప్పుడు వీధుల్లోకి వచ్చిన దౌర్జన్యాలకు పాల్పడాలని ఆయన అనలేదు. నల్లజాతి ప్రజలు, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తున్న తీరును చూసి, మనదేశంలోని దళితులు, సకల బాధితులు ప్రేరణ పొందాలని దువా అన్నారు. అమెరికాలో జరుగుతున్నది న్యాయపోరాటమే అని సాక్షాత్తూ అధ్యక్షుడి కుమార్తెనే మద్దతు పలికారు. మన దేశంలో కష్టజీవులు, సామాజికంగా అణగారినవాు తీవ్రమైన సహనాన్ని ప్రదర్శిస్తున్న మాట నిజం. లేకపోతే, మన దేశంలో వ్యవస్థ ఇంత నిరాఘాటంగా నడవలేదు. కానీ, ఇంతటి సహనం కూడా సడలిపోతే? ఆఖరి విశ్వాసపు పోగు కూడా పిగిలిపోతే? అందుకే, ప్రపంచవ్యాప్తంగా వివేకవంతులు చెబుతున్నదేమిటంటే, తక్కిన సమయాల్లో ఎంతగా పెత్తనం మీదా, అబద్ధం మీదా ఆధారపడినా, ఈ సమయంలో, ఈ ప్రళయకాలంలో మాత్రం సత్యమే పలకండని. ఎక్కువ బాధితులయ్యేది మళ్లీ అడుగుతరగతులవారే అయినప్పటికీ, మౌలికంగా ఇది మానవళి మొత్తం సమస్య. అందరూ కలసి దీన్ని ఎదుర్కొనాలి. ఒకరినొకరం మోసపుచ్చుకోగూడదు.


వైరస్‌ పరీక్షల సంఖ్య దగ్గర నుంచి, దాని తీవ్రతను అంచనా వేసే దాకా – రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజలలో భయం వ్యాపించి ఉన్నది. భీతావహ స్థితి పెరుగుతున్న కొద్దీ, పురోగమిస్తున్నామని నాయకులు చెబుతున్నారు. సమీపంలోనే కరోనా తచ్చాడుతున్నా, కిటికీలన్నీ తెరుస్తున్నారు. ఒకపక్క రోగుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతుంటే, స్టాక్‌ మార్కెట్‌ ఎదుగుదల గురించిన పారవశ్యాలు వినిపిస్తున్నాయి. వ్యాధిని, వ్యాప్తిని, తీవ్రతని అంచనావేయవలసింది వృత్తి ప్రమాణ సంస్థలు. ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పవలసింది కూడా ఆ సంస్థలే. కానీ, వైద్యపరిశోధనపై జాతీయస్థాయి సంస్థలే తరచు నియమాలను, మార్గదర్శకాలను మార్చుతున్నాయి. వారి సడలింపులు లాక్‌డౌన్‌ సడలింపుల కంటె వేగంగా జరుగుతున్నాయి.


కరోనా పాజిటివ్‌ అయినా సరే, లక్షణాలు తీవ్రంగా లేకపోతే, ఇంటికి పంపేస్తామని చెబుతున్నారు. ప్రజలను ముందు అందుకు సన్నద్ధం చేయాలి. సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. అనేక ముద్రలు ఉన్నాయి. సంప్రదాయ శ్మశానాలలో అంత్యక్రియలను కూడా అనుమతించని భయాందోళనలు. ఈ కట్టడి సడలింపులు నిజంగానే ప్రజారోగ్య వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయా, లేక, తాళాలు తెరిపించే అవసరం కొద్దీ జరుగుతున్నాయా? బ్రిటన్‌లో కరోనా వైరస్‌ తీవ్రతను 1 నుంచి 5 స్థాయిలలో కొలుస్తారు. ఒకటి అంటే, వ్యాధి నియంత్రణలోకి వచ్చినట్టు. అయిదు అంటే అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నట్టు. ప్రమాదహెచ్చరికను 4 నుంచి 3 కు తగ్గించాలని వచ్చిన ఒత్తిడిని ఇంగ్లండ్‌ ప్రధాన వైద్యాధికారి తిరస్కరించారు. ప్రమాదస్థాయిని అధికారికంగా తగ్గిస్తేనే, లాక్‌డౌన్‌ సడలింపులు జరుగుతాయి. జూన్‌ 15 నుంచి స్కూళ్లను, షాపులను తెరవాలన్న ప్రయత్నం సాగుతోంది. దీన్ని ‘‘బుడిబుడి నడకలు’’ అని పిలుస్తున్నారు. అంతకు మించిన వేగంతో సడలింపులు కోరుతున్న వర్గాలు, ప్రమాదస్థాయి తగ్గించమని వైద్య సంస్థలపై ఒత్తిడి తెచ్చాయి. మరి మన దేశంలో కూడా మార్కెట్‌ ఒత్తిడి పనిచేస్తున్నదా? నిజంగానే మన ఆరోగ్యరక్షణకు, ఇప్పుడు ప్రకటించిన సడలింపులకు పొంతన ఉన్నదా? ఆలోచించాలి.


అపనమ్మకాలు తొలగించాలి. నమ్మకం కలిగించాలి.

Updated Date - 2020-06-06T07:47:33+05:30 IST