వైద్యుడిగా నమ్మించి.. కొంపముంచాడు!

ABN , First Publish Date - 2021-02-25T04:24:42+05:30 IST

బోధన్‌లో నకిలీ పాసుపోర్టుల వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. నకిలీ పాసుపోర్టుల వ్యవహారంలో ఎస్‌బీ అధికారులు కీలకం కాగా వారిని నమ్మించి నట్టేటాముంచారు.

వైద్యుడిగా నమ్మించి.. కొంపముంచాడు!

- నకిలీ పాసుపోర్టు వ్యవహారంలో పరిమల్‌బెన్‌ కీలక సూత్రధారి
- వైద్యుడిగా నమ్మించి పోలీసు ఇంట్లోనే ఆశ్రయం
- ఒకే ఇంట్లో 20 మందిపైనే ఆశ్రయం
- అందరికీ నకిలీ పాసుపోర్టులు



బోధన్‌, ఫిబ్రవరి 23: బోధన్‌లో నకిలీ పాసుపోర్టుల వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. నకిలీ పాసుపోర్టుల వ్యవహారంలో ఎస్‌బీ అధికారులు కీలకం కాగా వారిని నమ్మించి నట్టేటాముంచారు. డబ్బును ఆశగా చూపి ఎర వేశారు. ఏకంగా ఒక్కో వ్యక్తికి ఇంటికి నెలకు 2వేల రూపాయల పైనే అద్దె చెల్లిస్తామంటూ ఒకే గదిలో 20 మంది పైన చేరి పోలీసు ఇంట్లో ఆశ్రయం పొందారు. ఆ తరువాత కాలనీవాసులను, స్థానికులను అందరిని నమ్మించి అన్నింటా భాగస్వాములై ఎవరికి అనుమానం కలుగకుండా నకిలీ పాసుపోర్టులు పొందారు.


ఈ వ్యవహారంలో పాస్‌పోర్టు ఏజెంట్‌ పశ్చిమబెంగాల్‌కు చెందిన పరిమల్‌బెన్‌ కీలకమైన వ్యక్తి. పశ్చిమబెంగాల్‌ నుంచి బోధన్‌కు చేరుకున్న ఆయన పక్కగా స్కెచ్‌ వేశాడు. మొదటగా బోధన్‌కు వచ్చిన పరిమల్‌బెన్‌ పైల్స్‌ వైద్యుడిగా అందరిని నమ్మించాడు. వైద్యంతో తనది అందవేసిన చేయి అని ప్రచారం చేసుకున్నాడు. బోధన్‌ కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో పైల్‌ వైద్యశాలను ప్రారంభించాడు. ఆ తరువాత మెల్లగా పాస్‌పోర్టుల కోసం ఎస్‌బీ పోలీసు అధికారి మల్లేష్‌తో పరిచయం ఏర్పరచుకున్నాడు. మెల్లగా మల్లేశ్‌ ఇంట్లోకే మకాం మార్చాడు.


పైల్స్‌ వైద్యున్ని అంటూ పరిచయం చేసుకున్న పరిమల్‌బెన్‌ మెల్లగా నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారాన్ని మొదలుపెట్టాడు. పశ్చిమబెంగాల్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తులను బోధన్‌ ప్రాంతానికి రప్పించాడు. బోధన్‌ నకిలీ పాస్‌పోర్టులకు సురక్షిత ప్రాంతంగా గుర్తించి అందరిని తెలివిగా రప్పించాడు. వీరందరిని ఎస్‌బీ పోలీసు అధికారి మల్లేశ్‌ ఇంట్లోనే మకాంకు దించాడు. ఒకే ఇంట్లో కింది భాగంలో పోలీసు అధికారి పై భాగంలో పరిమల్‌బెన్‌తో పాటు మిగతావారంతా అద్దెకు దిగారు. ఎలాంటి అనుమానం రాకుండా స్థానికులతో కలిసిపోయారు.


పండుగలు పబ్బాలు అన్నింటా స్థానికులతో భాగస్వాములయ్యారు. ఏకంగా వినాయకచవితి పండుగకు వీరంతా ప్రత్యేకంగా ఓ గణపతిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానికులంతా వీరిని తమలో ఒకరిగా భావించారు. ఎలాంటి అనుమానం రాకుండా కార్యకలాపాలు సాగించారు. ఎస్‌బీ అధికారి ఇంట్లో అద్దెకు దిగే క్రమంలో ఆయనను సైతం డబ్బుతో వల వేశారు.




20 మందిపైనే ఒకే ఇంట్లో ఉండేందుకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున నెలసరి అద్దెకు ఎస్‌బీ అధికారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీరి వద్ద నుంచి నెలసరి 40వేల రూపాయల అద్దెను వసూలు చేశాడు. ఈ క్రమంలో ఎస్‌బీ అధికారిని మెల్లగా నమ్మించి పాస్‌పోర్టుల ఎరవేశారు. తమకు పాస్‌పోర్టులు ఏర్పాటు చేయించాలని ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరుగా పాస్‌పోర్టులను ఎస్‌బీ అధికారి ప్రోద్బలంతో పొందారు.


పరిమల్‌బెన్‌ సోషల్‌మీడియాలో అత్యంత చురుగ్గా ఉండడంతో పాటు వివిధ ప్రైవేటు కార్యక్రమాలు, యూట్యూబ్‌ వీడియోలు టిక్‌టాక్‌లు రూపొందించాడు. తనకు సినీ రంగంపై సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌లలో నటన పట్ల ఉత్సాహం ఉందని గతంలో తాను రూపొందించిన వివిధ కార్యక్రమాలను స్థానికులకు చూయించి తాను త్వరలోనే విదేశాలకు వెళ్తున్నట్లు నమ్మించసాగాడు.


వైద్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో కీలకసూత్రధారి అయ్యాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బోధన్‌లో పరిమల్‌బెన్‌ బాగోతం గుట్టురట్టు అయ్యింది. పైల్స్‌ వైద్యుడంటూ అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. వైద్యుడిగా అందరిని నమ్మించి నకిలీ పాస్‌పోర్టులతో బురిడి కొట్టించాడని చర్చించుకుంటున్నారు.

Updated Date - 2021-02-25T04:24:42+05:30 IST