Abn logo
Nov 28 2020 @ 00:20AM

బాలీవుడ్‌లోకి బెల్లంకొండ గ్రాండ్‌ ఎంట్రీ

కథానాయకుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలి సినిమా ‘అల్లుడు శీను’కు వీవీ వినాయక్‌ దర్శకుడు. మరోసారి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు తన స్నేహితుడు బెల్లంకొండ సురేశ్‌ తనయుడిని పరిచయం చేసే బాధ్యతను వీవీ వినాయక్‌ తీసుకున్నారు. ‘ఛత్రపతి’ రీమేక్‌ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పరిచయం కానున్న సంగతి తెలిసిందే. పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ గడ నిర్మించనున్న ఈ సినిమాతో దర్శకుడిగా వినాయక్‌ కూడా హిందీకి పరిచయమవుతున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.


‘‘బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ‘ఛత్రపతి’ సరైన చిత్రమని నమ్ముతున్నా. ప్రభా్‌సగారు పోషించిన పాత్రలో నటించే అవకాశం రావడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను. వినాయక్‌గారితో మరోసారి పనిచేసే అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నా’’ అని సాయి శ్రీనివాస్‌ అన్నారు. జయంతిలాల్‌ గడ మాట్లాడుతూ ‘‘హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈతరానికి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘ఛత్రపతి’ గొప్ప కథ. దానికి స్టార్‌ అవసరం. సాయి శ్రీనివాస్‌ పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌. రీమేక్‌ చిత్రాలు తెరకెక్కించడంలో వినాయక్‌ నిరూపించుకున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాం’’ అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.


నా కల నెరవేరింది

‘‘హిందీ సినిమాలో నటించాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కల. ఇంతకు ముందు కూడా నాకు కొన్ని ఆఫర్స్‌ వచ్చాయి. దీనికి కారణం- జయజానకీ నాయక హిందీ డబ్బింగ్‌. దీని వల్ల ఉత్తర భారతదేశంలో నాకు మంచి పేరు వచ్చింది. యూట్యూబ్‌ వ్యూస్‌ 35 కోట్ల వరకూ ఉన్నాయి. అయితే మంచి కథ కోసం ఇంత కాలం ఆగాం. సాధారణంగా హిందీ సినిమాల్లో మదర్‌.. బ్రదర్‌ సెంటిమెంట్లు బాగా పనిచేస్తాయి. మదర్‌ ఇండియా నుంచి ఇప్పటి దాకా ఈ సెంటిమెంట్‌ ఉన్న సినిమాలకు తిరుగుండదు. అలాంటి ఒక సినిమా ఛత్రపతి. అందుకే దీనిని ఎంపిక చేసుకున్నాం. వినాయక్‌ సర్‌ దగ్గర మళ్లీ పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్‌ జనవరి నుంచి మొదలవుతుంది..’’

- సాయి శ్రీనివాస్‌ 

Advertisement
Advertisement
Advertisement