కిళ్లీషాపులే బెల్టు దుకాణాలు

ABN , First Publish Date - 2020-12-03T04:53:06+05:30 IST

బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామంటూ ప్రభుత్వం, ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం కన్పించడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

కిళ్లీషాపులే బెల్టు దుకాణాలు
పెదపాడులో ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలో రోడ్డు పక్కన పాడేసిన మద్యం సీసాలు,

 పెదపాడులోని బెల్ట్‌షాపుల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు

 మందుబాబుల ఆగడాలతో స్థానికులు, మహిళలకు ఇక్కట్లు

పెదపాడు, డిసెంబరు 2: బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామంటూ ప్రభుత్వం, ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నా  ఆచరణలో మాత్రం కన్పించడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. పెదపాడులో ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణం సమీపంలోనే బెల్టుషాపులు యథే చ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద లూజు అమ్మకాలు, మద్యం తాగేందుకు అనుమతి లేదు. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద నిర్ణీత వేళల్లోనే అమ్మ కాలు జరుగుతాయి. మిగతా వేళల్లో సమీపంలోని కిళ్లీషాపులే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లుగా మారుతున్నాయి. వ్యాపారనంతరం సంబంధిత బెల్ట్‌ షాపుల నిర్వాహకులు పాడేసిన ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్‌ డిస్పోజల్‌ గ్లాసులు ప్రభుత్వ మద్యం దుకాణం సమీపంలోనే గుట్టగా పడి ఉన్నాయి. ఇక్కడ  కిళ్లీషాపులే మద్యం అమ్మకాలతో, మందుబాబులతో నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఈ ప్రాంతంలో మందుబాబులు మందు తాగి రోడ్లపై చిందేస్తుండటంతో స్థానికులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో అనధికార మద్యం అమ్మకాలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.


బెల్టు షాపులపై నిరంతర నిఘా

ఎల్‌.చిరంజీవి, ఎక్సైజ్‌ సీఐ

కిళ్లీషాపులు, ఇతర దుకాణాల్లో మద్యం అమ్మకాలపై నిరంతరం నిఘా ఉంచాం. అటువంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ మద్యం దుకాణం పరిసరాల్లో, ఇతర దుకాణాల్లో మద్యం తాగేం దుకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు  తీసుకుంటాం.

Updated Date - 2020-12-03T04:53:06+05:30 IST