రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్న బెన్ స్టోక్స్

ABN , First Publish Date - 2020-09-25T00:21:44+05:30 IST

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు విజయంతో బోణీ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో

రాజస్థాన్ రాయల్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్న బెన్ స్టోక్స్

దుబాయ్: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు విజయంతో బోణీ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. క్వారంటైన్ కారణంగా జోస్ బట్లర్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. రెండో మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశం ఉండగా, జట్టుకు మరో తీపి కబురు ఇది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చే నెల తొలి వారంలో యూఏఈ చేరుకోనున్నాడు. 


న్యూజిలాండ్‌లో ఉన్న తన తండ్రి అనారోగ్యం పాలవడంతో వెళ్లిన స్టోక్స్ స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన చివరి రెండు టెస్టులు, వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో అతడు ఆడే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. అతడి ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా ఎప్పటికప్పుడు అతడికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటూ వస్తోంది. న్యూజిలాండ్‌లో ఉండగానే ట్రైనింగ్ మొదలుపెట్టిన బెన్ స్టోక్స్ వచ్చే నెల తొలి వారంలో యూఏఈ చేరుకుని జట్టుతో కలుస్తాడని తెలుస్తోంది. 


బెన్ స్టోక్స్ యూఏఈ చేరుకున్న వెంటనే ఆరు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. ఆ తర్వాత రెండుసార్లు నిర్వహించే కొవిడ్ పరీక్షల్లో నెగటివ్ ఫలితం వస్తే బబుల్‌లో చేరుతాడు. అంటే ఆక్టోబరు రెండో వారంలో ఆర్ఆర్ జెర్సీ ధరించే అవకాశం ఉంది. స్టోక్స్ కనుక జట్టులో చేరితే మేనేజ్‌మెంట్‌కు మరో తలనొప్పి తప్పదు.


జట్టులో ప్రస్తుతం నలుగురు విదేశీ ఆటగాళ్లు..  స్టీవ్ స్మిత్, టామ్ కరన్, జోఫ్రా అర్చర్, డేవిడ్ మిల్లర్లు ఉన్నారు. ఇప్పుడు బట్లర్ కూడా రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యారు. అతడు కనుక జట్టులోకి వస్తే కరన్, మిల్లర్లలో ఎవరో ఒకరు పక్కన కూర్చోవాల్సి ఉంటుంది. మరి బెన్‌స్టోక్స్ కనుక వస్తే బెంచ్‌కు పరిమితమయ్యే మరో ఆటగాడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. 


Updated Date - 2020-09-25T00:21:44+05:30 IST