Abn logo
Jun 13 2021 @ 10:19AM

భూగర్భ మ్యూజియం.. అన్నీ అస్థిపంజరాలే.. ఆ 45 నిమిషాలు వెన్నులో వణుకు ఖాయం..!

కింగ్ నాగార్జున మన్మధుడు సినిమా చూశారా? దానిలో హీరోయిన్‌తో కలిసి నాగ్ ఓ బిజినెస్ ట్రిప్‌కు వెళ్తాడు. అక్కడే బ్రహ్మానందం ఎంటరై మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు. ఇదంతా జరిగేది ఫ్యాషన్ పుట్టినిల్లు ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లో. ఆ సినిమాలో చూసి ప్యారిస్ అందాలకు ఎవరైనా ముగ్ధులైపోతారు. ఆ తర్వాత మరోసారి నాగ్ తన ‘ఊపిరి’ సినిమాతో ప్యారిస్ మెరుపులు చూపించారు. అవన్నీ చూసి ప్యారిస్ అంటే అందాలే అనుకున్నారంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ మెరుపుల నగరం అడుగు భాగంలో వణుకు పుట్టించే ఒక వింత ఉంది. ఈ నగర వీధుల కిందే ఉన్న ఈ వింతను చూస్తే ఎవరికైనా సరే శరీరం భయంతో ఝల్లుమంటుంది. ఎందుకంటే ఈ అందాల నగరం కింద కుప్పలు తెప్పలుగా ఉన్నది మానవ కంకాళాలు!


అస్థిపంజరాలూ, ఎముకలు, పుర్రెలు.. ఒకటి కాదు రెండు కాదు కనీసం 60 లేక 70 లక్షలమందికి చెందిన మానవ అవశేషాలు ప్యారిస్ నగరం కిందే ఉన్నాయి. వీటినే ప్యారిస్ కాటకోంబ్స్ అంటారు. ఇవి ఇప్పుడు కాదు 18వ శతాబ్దంలోనే కళేబరాలతో నిండటం మొదలయ్యాయి. చరిత్రలోకి వెళ్తే అప్పట్లో ఫ్రాన్స్ దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో స్మశానాల స్థలం తగ్గిపోయింది. ప్రజల సంఖ్య పెరిగింది. ప్యారిస్‌లో అతిపెద్ద స్మశాన వాటిక లెస్ ఇన్నొసెంట్స్. దీనికి చాలా దగ్గరలోనే ప్రధాన ఫుడ్ మార్కెట్ లెస్ హాలెస్ ఉంది. అయితే లెస్ ఇన్నొసెంట్స్ స్మశానంలో మృతదేహాలు మరీ ఎక్కువైపోయాయి. ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలు స్మశానం నుంచి భయంకరంగా దుర్వాసన వస్తోందంటూ ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. దీంతో అప్పటి రాజులు ప్యారిస్ నగరంలో ఎవరూ అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశించారు. కానీ చర్చి దానికి ఒప్పుకోలేదు. ఎప్పట్లాగే లెస్ ఇన్నొసెంట్స్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తూనే వచ్చింది. మతంతో తగువు పెట్టుకోవడం ఇష్టం లేని పాలకులు నిమ్మకుండిపోయారు.


ఆ స్మశానం నుంచి ఎంతలా దుర్వాసన రావడం మొదలైందంటే.. స్థానికంగా సువాసనలు వెదజల్లే సెంట్‌లు అమ్ముకునే వారు కూడా వ్యాపారాలు మూసేసుకున్నారు. తమ అత్తరుల వాసన స్మశానం దుర్వాసనలో తెలియడం లేదని ఆరోపణలు చేశారు. కానీ పాలకులకు దీన్ని పట్టించుకునే ధైర్యం లేదు. అయితే 1780లో ప్యారిస్ నగరాన్ని వర్షం తడిపి ముద్దచేసింది. భారీ వర్షంతో లెస్ ఇన్నొసెంట్స్‌ చుట్టూ ఉన్న ఒక గోడ కూలిపోయింది. దానిలోని కుళ్లిపోయిన శవాలు నగరంలో రోడ్లపైకి కొట్టుకొచ్చాయి. దీంతో వాటిని మరో చోటకు మార్చక తప్పని పరిస్థితి. అప్పుడే అప్పటి రాజు దృష్టి నగరం కింద ఉన్న సొరంగాలపై పడింది. నగర నిర్మాణం కోసం సున్నపు రాయి తీసుకురావడానికి వీటిని తవ్వారు.

ఈ సొరంగాలు కూలిపోయే లక్షణాలు కనిపించడంతో వీటికి మరమ్మతులు చేయించిన రాజు.. స్మశానాల్లోని మృతదేహాలను ఈ సొరంగాల్లోకి మార్పించారు. దీనికోసం ప్రతి రోజూ రాత్రిపూట స్మశానాల్లో సమాధులు తవ్వి, మృతదేహాలను ఈ సొరంగాల్లోకి తీసుకొచ్చేవారు. వీరి వెంటన ఒక మతపెద్ద ఉండి ప్రార్థనలు చేసేవారు. ఇలా 12ఏళ్లు కష్టపడి ప్యారిస్‌లోని స్మశానాలన్నింటినీ ఖాళీ చేసేశారు. వీటిలో అతిపురాతనమైన అస్థిపంజరాలు 1200 ఏళ్ల నాటివని అంచనా. ఆ సమయంలో జరిగిన ఫ్రెంచి విప్లవంలో మరణించిన వారిని కూడా ఈ సొరంగాల్లోనే సమాధి చేశారు. 1860లో ఈ సొరంగాల్లోకి మృతదేహాలను తరలించడం ఆపేశారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌ను పాలించిన నెపోలియన్.. ఈ సొరంగాలను టూరిస్టు స్పాట్లుగా మార్చాలని నిర్ణయించుకున్నాడు.


నెపోలియన్ హయాంలోనే చాలా మంది పనివాళ్లు సొరంగాల్లోకి వెళ్లి కుప్పలు తెప్పలుగా ఉన్న ఎముకలను రకరకాల ఆకృతుల్లో అమర్చారు. ఇప్పుడు ఈ కాటకోంబ్స్ సందర్శకులకు ఇవి ప్రత్యేక ఆకర్షణలు. అయితే ఈ సొరంగాల్లో కేవలం కాస్త అటూఇటుగా 1 మైలు మాత్రమే సందర్శించడానికి వీలుంటుంది. దీని ప్రవేశ మార్గం తలుపు మీద ‘‘ఆగండి! ఇది మరణ సామ్రాజ్యం’’ (Stop! This is the Empire of Death!) అని రాసి ఉంటుంది. సందర్శకులకు అనుమతి ఉన్న ఈ కంకాళాల మ్యూజియం మొత్తం నడవడానికి ఓ 45 నిమిషాలు పడుతుంది. ఆ టైం మొత్తం టూరిస్టులకు ముచ్చెమటలు పడుతూనే ఉంటాయి. ఊరి చివర ఉన్న స్మశానం ఛాయలకు వెళ్లాలంటేనే కొంచెం బెరుగ్గా ఉంటుంది. అలాంటిది 70 లక్షల మృతదేహాలున్న స్మశానంలో అలా చక్కర్లు కొడుతుంటే ఇంకెలా  ఉంటుందో ఊహించుకోవచ్చు.  అయితే ఇక్కడ కేవలం పుర్రెలు, ఎముకలే కాదు కొన్ని అద్భుతమైన కళాకృతులు కూడా ఉన్నాయి. వీటిని సొరంగాల మరమ్మతుల సమయంలో ఒక పనివాడు చెక్కినట్లు చెప్తారు. వీటికీ ఈ స్మశానానికి ఎటువంటి సంబంధమూ లేదు. అతను చెక్కినవన్నీ బ్రిటీష్ నుంచి ఫ్రాన్స్ స్వాధీనం చేసుకున్న ఒక దీవిలోని కట్టడాల ప్రతిరూపాలు. అతను ఆ దీవికి చెందిన వాడే అయ్యుండొచ్చు. ఎంతైనా ఎటు చూసినా కంకాళాలే కనిపించే ఈ సొరంగంలో ఈ కళాకృతులు కొంత ఊరట. కానీ ఈ కాటకోంబ్స్ సందర్శన మాత్రం భలే థ్రిల్ అని టూరిస్టుల స్పందన.


ప్రత్యేకంమరిన్ని...