ఇంటి కల కల్లేనా?

ABN , First Publish Date - 2020-09-25T06:52:58+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రభుత్వం మొత్తం 5,221 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేసింది

ఇంటి కల కల్లేనా?

అర్బన్‌ జిల్లాలో నత్తనడకన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం

11సార్లు టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు

రెండింతలు పెరిగిన నిర్మాణ వ్యయం

రూ.6.29 లక్షలకు ఇల్లెలా కట్టేదంటున్న గుత్తేదార్లు

5,221 ఇళ్లకు 860 పూర్తి.. అయినా పంపిణీ కాని వైనం

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లబ్ధిదారులు


వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఓ ప్రహసనంలా మారింది. ఈ ఇళ్లు ఇప్పట్లో పూర్తయ్యేట్టు కనిపించడం లేదు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామని ఊరించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయింది. మంజూరైన వాటిలో 90శాతం ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు. పూర్తయినట్టు చెబుతున్న 10శాతం ఇళ్లనయినా పేదలకు ఇవ్వడం లేదు. బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం లబ్ధిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని పెంచితే తప్ప ఇళ్లు కట్టడం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. రూ.6.29 లక్షలకు రెండు గదుల ఇల్లు కట్టేదెలా అని వాపోతున్నారు. 


హన్మకొండ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రభుత్వం మొత్తం 5,221 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో 5,152 ఇళ్లకు పరిపాలనపరమైన అనుమతి లభించింది. వీటి నిర్మాణానికి టెండర్లు పిలవగా 3,657 ఇళ్లకే ఖరారయ్యాయి. మిగిలిన 1,495 ఇళ్లకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. 3,044 ఇళ్ల నిర్మాణ పనులు మొదలు కాగా, వీటిలో ఇప్పటివరకు పూర్తయినవి కేవలం 860 ఇళ్లు మాత్రమే. 613 ఇళ్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 2,184 ఇళ్లు పునాదుల వద్దే నిలిచిపోయాయి. కొన్నిచోట్ల టెండర్‌ కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు ఇళ్ల పనులను మొదలు పెట్టడం లేదు. వారికి నోటీసులు ఇస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇంకొన్నిచోట్ల రెవెన్యూ శాఖ స్థలాలనే అప్పగించలేదు. మరికొన్ని చోట్ల ఎంపిక చేసిన స్థలం అనుకూలంగా లేక పనులు మొదలు కాలేదు. కోర్టు కేసుల వల్ల కొన్నిచోట్ల పనులకు బ్రేక్‌ పడింది. 


డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకం మొదటి దశలో ఒక్కో ఇంటికి రూ.5.04లక్షల చొప్పున కేటాయించారు. విద్యుత్‌, తాగునీరు, పైపులైన్‌, మరుగుదొడ్డి, వీధిలైట్లు, రహదారుల కోసం అదనంగా రూ.1.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ప్రారంభంలో నిర్మాణాలు జోరుగానే సాగినా.. ఆ తర్వాత ధరల పెరుగుదలతో మందగించాయి. మరోవైపు బిల్లులు రాక గుత్తేదార్లు నిర్మాణాలపై అంతగా శ్రద్ధ చూపలేదు. మొదటి దశలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో చాలావరకు తుదిదశలో ఉన్నాయి. రెండో దశలో అత్యధికంగా నిలిచిపోయాయి. కొన్ని ఇళ్ల పనులు అసలు ప్రారంభించనేలేదు. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ఎవరూ పనులు తీసుకోవడానికి  ముందుకు రావడం లేదు. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆమేరకు నిధులను పెంచాల్సి ఉండగా రెండు విడతల్లోనూ ఒకే రీతిలో కేటాయించారు.


పెరిగిన ధరలతో..

గతంలో వ్యాట్‌ పన్ను 5శాతం ఉండగా, అది జీఎస్టీ పేరుతో 12శాతానికి పెరిగింది. దీంతో జీఎస్టీ రూపంలో రూ.35వేలు అదనంగా భారం పడుతోంది. గతంలో సిమెంట్‌ బస్తా ధర రూ.225 ఉండగా అదికాస్తా రూ.359 పెరిగింది. అలాగే ఇనుము టన్ను ధర రూ.42వేలుంటే.. ప్రస్తుతం ఇది రూ.52వేలు అయింది. గతంలో వెయ్యి ఇటుకకు రూ.3వేలు ఉండగా, ప్రస్తుతం రూ.6వేలు పలుకుతోంది. ఇసుక మొదటి దశలో ట్రక్కు రూ.1,200 ఉంటే.. ఇప్పుడు రూ.4,500 పెరిగింది. తాపీమేస్త్రీల ఖర్చులు అదనం. విద్యుత్‌, మరుగుదొడ్డి నిర్మాణ సామగ్రి ధరలు రెండింతలు పెరిగాయి. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మొదటి దశలో మౌలిక వసతుల కల్పనకు ఇచ్చిన రూ.1.25లక్షలు కూడా రెండో దశలో మంజూరైన ఇళ్లకు ఇవ్వడం లేదు.


ఖిలా వరంగల్‌ మండలం దూపకుంటలో 400ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇదే గ్రామంలో మరోచోట కడుతున్న వెయ్యి ఇళ్ల పరిస్థితి పిల్లర్లకే పరిమితమయ్యాయి. ఎస్‌ఆర్‌నగర్‌లో 208 ఇళ్లు పూర్తయి.. లబ్ధిదారులకు  కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. తిమ్మాపూర్‌లో 514ఇళ్లకు ఇటీవలే టెండర్లు ఖరారయ్యాయి. కానీ పనులు ప్రారంభం కాలేదు. 


హన్మకొండ మండలంలోని అంబేద్కర్‌నగర్‌లో మాత్రం 592ఇళ్లు పూర్తయి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. లష్కర్‌సింగారంలో 208 ఇళ్లకు టెండర్‌ ఖరారైంది. కానీ ఇళ్ల కోసం కేటాయించిన భూమి అనుకూలంగా లేకపోవడంతో టెండర్‌ రద్దయింది. మరో స్థలం కోసం అన్వేషిస్తున్నారు. 


కాజీపేట మండలం శాయంపేటలో 608ఇళ్లు అసంపూర్తిగా మిగిలాయి. కోర్టు కేసుతో నిర్మాణ పనులను సగంలోనే నిలిపేశారు. కాజీపేటలో 97 ఇళ్లకు టెండర్‌ ఫైనల్‌ అయింది. రెవెన్యూశాఖ కాంట్రాక్టర్‌కు భూమిని కూడా అప్పగించింది. కానీ కోర్టు కేసుతో పనులకు బ్రేక్‌ పడింది. 


వరంగల్‌ మండలం పైడిపల్లిలో 70ఇళ్లకు పనులు ప్రారంభం కాలేదు. 


హసన్‌పర్తి మండలం సిద్దాపూర్‌లో 20, అర్వపల్లిలో 20ఇళ్లు పూర్తయ్యాయి కానీ కరెంట్‌, ఇతర పనులు కాలేదు. సిద్దాపూర్‌లో 12ఇళ్లు స్లాబ్‌ వరకు వచ్చి ఆగిపోయాయి. 


ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో 20 ఇళ్లు పూర్తయి రెండేళ్లవుతున్నా లబ్ధిదారులకు ఇప్పటికీపంపిణీ చేయలేదు. ఆలనాపాలన లేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి. కిటికీలు, దర్వాజలు ఊడిపోతున్నాయి. ఇదే గ్రామంలో అదనంగా మరో 20ఇళ్లు మంజూరు కాగా.. వీటి నిర్మాణానికి 11సార్లు టెండర్లు పిలిచారు. కానీ ఒక్క కాంట్రాక్టర్‌ కూడా ముందుకు రాలేదు. వనమాలకనపర్తి, కొండపర్తిలోనూ 11సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. నర్సింహులగూడెం, ఒంటిమామిడిపల్లిలో కూడా కాంట్రాక్టర్లు రాలేదు. నందనంలో 20ఇళ్లు పూర్తయినా ఇంకా మౌలిక వసతులు కల్పించలేదు. 


ధర్మసాగర్‌ మండలంలోని పెద్దపెండ్యాల, నారాయణగిరి, దేవనూరు వడ్డెరకాలనీ, ముప్పారం, వేలేరు మండలంలోని వేలేరు, పీచర గ్రామాల్లో 225ఇళ్లలో ఒక్క ఇంటి పని కూడా మొదలు కాలేదు. ఇప్పటి వరకు నాలుగుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. 


కమలాపూర్‌ మండలం మర్రిపెల్లిగూడెంలో 100ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ల నుంచి స్పందన కరువైంది. గూడూరులో 50ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్‌ ఒప్పుకున్నా ఇంకా పనులు మొదలు పెట్టకపోవడంతో నోటీసులు ఇచ్చారు. శంభునిపల్లి, కన్నూరులో టెండర్లు పిలిచినా స్పందన లేదు. వంగపల్లిలో పరిస్థితీ ఇంతే. 


 భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్‌, దండెపల్లి, జీలుగుల, దామెర, ఎల్కతుర్తి గ్రామాల్లోనూ డబుల్‌ ఇళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ఎవరూ రావడం లేదు.

Updated Date - 2020-09-25T06:52:58+05:30 IST