నిద్రలేమితో అనవసర భయాలు!

ABN , First Publish Date - 2020-10-28T05:32:51+05:30 IST

అనవసరపు ఆలోచనలను అదుపుచేసే సామర్థ్యం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అయితే ఆ కారకం ఏంటనేది ఇప్పటికీ అంతుచిక్కనిదే...

నిద్రలేమితో అనవసర భయాలు!

కంటి నిండా నిద్రలేకపోతే మానసిక ఒత్తిడి, వాస్తవాలను అతిగా ఊహించుకోవడం, ఆందోళన వంటి  లక్షణాలు కనిపిస్తాయని తాజా అధ్యయనం చెబుతోంది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ యోర్క్‌ పరిశోధకులు... అధ్యయనానికి ఎంచుకున్న 60మందిలో నిద్రలేమి సమస్యతో ఉన్నవారు లేదా చక్కగా నిద్రపోయిన వారిలో మానసిక ఒత్తిడిని జయించే సామర్థ్యం ఎంత వరకు ఉందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. రాత్రిపూట చాలినంత నిద్రపోయిన వారితో పోల్చితే నిద్రపట్టని వారిలో అనవసర ఆలోచనలతో యాభై శాతం ఎక్కువగా బాధపడ్డారని కనుగొన్నారు.


‘‘రోజూవారి జీవితంలో ఎదురయ్యే కొన్ని చిన్నచిన్న సందర్భాలు మనలో భయం పుట్టించే కొన్ని అనుభవాలను గుర్తుకు తెస్తాయి. ఉదాహరణకు... రోడ్డు మీద వేగంగా దూసుకెళుతున్న కారును చూడగానే మనకు గతంలో జరిగిన కారు ప్రమాదం గుర్తుకు వస్తుంది. అయితే కొందరు తొందరగా ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడతారు. కానీ భయంకర సంఘటనలను మరచిపోలేని వారి ఆలోచల్లో పదే పదే ఆ సంఘటన మెదులుతూనే ఉంటుంది’’ అని చెబుతున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సైకాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ మార్కస్‌ హారింగ్‌టన్‌. 


అనవసరపు ఆలోచనలను అదుపుచేసే సామర్థ్యం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అయితే ఆ కారకం ఏంటనేది ఇప్పటికీ అంతుచిక్కనిదే. అనవసరపు ఆలోచనలను మన మెదడు నుంచి దూరంగా పెట్టడంలో నిద్రలేమి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మా అధ్యయనంలో కనుక్కొన్నాం. అధ్యయనంలో పాల్గొన్న 60 మంది ఆరోగ్యవంతులకు నెగటివ్‌ ఎమోషన్స్‌ ఉన్న ఫొటోలు (యుద్ధం జరుగుతున్న దృశ్యం, పెద్దపెద్ద భవంతులున్న పట్టణం) చూపించారు. ఆ మరుసటి ఉదయాన్నే వారిని ఆ ఫొటోలకు సంబంధించిన ప్రతికూల ఆలోచనలను మరచిపోవాల్సిందిగా కోరారు. రాత్రి చక్కగా నిద్రపోయిన వారు సులభంగా మరచిపోయారు. నెగటివ్‌ విషయాలను పాజిటివ్‌గా చూడడం వీరిలో కనిపించింది. 

Updated Date - 2020-10-28T05:32:51+05:30 IST