బెంగాల్‌ దంగల్‌

ABN , First Publish Date - 2021-03-12T06:22:45+05:30 IST

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్పత్రిలో చేరారు. కాలికి పెద్ద కట్టుతో, తలమీద చిన్న ప్లాస్టర్‌తో ఆమె పడుకొని ఉన్న దృశ్యం దేశమంతా...

బెంగాల్‌ దంగల్‌

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్పత్రిలో చేరారు. కాలికి పెద్ద కట్టుతో, తలమీద చిన్న ప్లాస్టర్‌తో ఆమె పడుకొని ఉన్న దృశ్యం దేశమంతా చూస్తున్నది. కాలికే కాదు, మోకాలు, నుదురు, మెడవంటిచోట్ల కూడా ఆమెకు గాయాలయ్యాయని అంటున్నారు. భారీ భద్రతలో ఉన్న ఒక ముఖ్యమంత్రి కీలకమైన ఎన్నికల ప్రచార కాలంలో ఇలా గాయపడి, ఆస్పత్రిలో చేరాల్సిరావడం ఆశ్చర్యపరచేదే. ఆమె గాయపడినమాట నిజమే కానీ, అది ఎంత, ఎలా జరిగిందన్న విషయంలోనే వివాదం అంతా. నలుగురైదుగురు దాడిచేసి, తనను బలంగా నెట్టివేసి, కారు తలుపు దభాల్న వేశారని ఆమె అంటున్నారు. ఇందులో భయంకరమైన కుట్ర, ప్రణాళిక ఉన్నాయని ఆమె ఆరోపణ. ఈ పరిణామంతో ఖంగుతిన్న భారతీయ జనతాపార్టీ దీనిని జగన్నాటకంగా అభివర్ణిస్తూ ఏకంగా సీబీఐ విచారణనే డిమాండ్‌ చేసింది. జడ్‌ప్లస్‌ భద్రతలో ఉన్న మనిషి ఇలా అబద్ధాలాడటమేమిటని ఆ పార్టీ అడుగుతోంది. ప్రస్తుతం విచారణకు ఆదేశించే అధికారాలున్న ఎన్నికల సంఘం క్షేత్రస్థాయి నుంచి నివేదిక కూడా తెప్పించుకున్నది. ఆ రిపోర్టులో ఏమున్నప్పటికీ, ఎన్నికల ముందు కోడి కత్తి ఆలోచనలు అద్భుతంగా చేయగల ఆమె రాజకీయ సలహాదారుడి చిట్కాలు కచ్చితంగా ఫలితాన్నిస్తాయని కొందరు అంటున్నారు. 


తమిళనాడులో జైలునుంచి తిరిగిరాగానే శత్రుసంహారం చేస్తానంటూ జయలలిత సమాధిమీద ముమ్మారు తట్టి భీషణ ప్రతిజ్ఞ చేసిన శశికళ సరిగ్గా ఎన్నికల ముందు రాజకీయాలనుంచి తప్పుకున్నారు. తాను అంతవరకూ ద్వేషించిన పళని పన్నీరు ద్వయానికి అమ్మ ఆశీర్వాదం ఉన్నదని తేల్చేసి తెరవెనక్కుపోయారు. ఆ సందర్భంలో అనేకులకు మమతా బెనర్జీ గుర్తుకొచ్చారు. కాంగ్రెస్‌ విద్యార్థిసంఘం కార్యకర్తగా వీధిపోరాటాలు చేసినకాలంనుంచి కమ్యూనిస్టు కంచుకోటను బద్దలుకొట్టి తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూచొనేవరకూ ఆమె ప్రదర్శించిన దూకుడూ ధైర్యం గుర్తుకొచ్చాయి. కాంగ్రెస్‌నుంచి వేరుపడ్డాక మరో పదేళ్లు పోరాడి సరిగ్గా పదేళ్ళక్రితం ఆమె తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఇప్పటికీ అంతే వీరావేశంతో బీజేపీతో యుద్ధంచేస్తున్నారు. మొన్నటివరకూ అత్యంత సన్నిహితుడుగా ఉన్న సువేందు అధికారి ఎన్నికల ముందు బీజేపీలో చేరితే, చావో రేవో తేల్చుకోవడానికి ఆయన కంచుకోట నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగారామె. నందిగ్రామ్‌లో నామినేషన్‌ వేసి పాదయాత్ర చేసిన మమత అంతలోనే కాలికట్టుతో కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే యుద్ధక్షేత్రంలోకి అడుగుపెడతాననీ, అవసరమైతే వీల్‌చైర్‌మీద నుంచే ప్రచారం చేస్తాననీ అంటున్నారామె. దాడులు, గాయాలు ఆమెకు కొత్తేమీ కాదు. 


కాలికి గుడ్డచుట్టివున్న ఆమెను భద్రతాసిబ్బంది కారులోనుంచి దించి ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలను మాత్రమే అందరూ చూశారు. ఆమెను ఎవరూ తోసేయ్యలేదని అది ప్రమాదమే తప్ప కుట్రకాదని కొందరు అంటున్నారు. తృణమూల్‌ అభిమానులే అత్యధికంగా గుమిగూడివున్న ఒక చిన్నదారిలో, డోరు కొద్దిగా తెరిచి ఉంచిన కారులో ఆమె పోతూవుండగా, కారుడోర్‌ ఒక పోల్‌కు తగిలి మూసుకుపోవడంతో ఇది జరిగిందని పోలీసులు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారట. నిజం ఏదైనప్పటికీ, ఎన్నికల సంఘం కొత్త డీజీపీని నియమిస్తే, ఆయన బాధ్యతలు స్వీకరించిన కొద్దిగంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రత కల్పించాల్సిన పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయారనీ, ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిందని మమత అంటున్నారు. మమతను మాయం చేయాలన్న ఆలోచనలో కొందరు ఉన్నారంటూ తృణమూల్‌ మండిపడుతోంది. బెంగాల్‌లో అన్ని హద్దులూ దాటిన ఎన్నికల యుద్ధానికి ప్రతీక ఈ ఘటన. గతంలో బీజేపీ అధ్యక్షుడిపై బెంగాల్‌లో జరిగిన దాడిని ఆ పార్టీ ఎంత ఎక్కువ రాజకీయం చేసిందో, ఇప్పుడు మమత ఘటనను తృణమూల్‌ అంత ఎక్కువ చేస్తున్నదని కొందరి సమర్థన. ఆరోపణలు చేస్తే సరిపోదు, సీసీటీవీ దృశ్యాలను విడుదలచేయండి, దర్యాప్తు చేయించండి, ప్రమాదమో, కుట్రో తేల్చండి అని కొందరు అంటున్నారు కానీ, రాజకీయ నాయకులకు కావాల్సింది అంతిమంగా ఎన్నికల్లో నెగ్గడమే కానీ, నిజాలతో నిమిత్తంలేదు.

Updated Date - 2021-03-12T06:22:45+05:30 IST