బెంగాల్‌ మంత్రి.. ఈడీ అదుపులో

ABN , First Publish Date - 2022-07-24T08:40:23+05:30 IST

పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీ అరెస్టయ్యారు.

బెంగాల్‌ మంత్రి.. ఈడీ అదుపులో

స్కూల్‌ ఉద్యోగాల కుంభకోణంలో పార్థా అరెస్ట్‌ 

సమాచారం ఇవ్వకుండా అరెస్టా?: స్పీకర్‌ 

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం

సరైన సమయంలో స్పందిస్తామన్న టీఎంసీ 

పార్థా సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ అరెస్ట్‌

ఆమె ఇంట్లో రూ.21 కోట్లు

మమతతో అర్పిత.. వీడియో రిలీజ్‌ చేసిన బీజేపీ


కోల్‌కతా, జూలై 23: పశ్చిమబెంగాల్‌ పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థా చటర్జీ అరెస్టయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆయన్ను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. 2014-2021 వరకు పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే విద్యాశాఖలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన్ను ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి 26 గంటలపాటు ప్రశ్నించారు. అరెస్టు తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చేయించారు. త్వరలోనే కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. తాను సీఎం మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చటర్జీ చెప్పా రు. కాగా పార్థా చటర్జీకి సన్నిహితురాలైన ఆర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదు దొరకడంతో ఆమెనూ ఈడీ అదుపులోకి తీసుకుంది. పార్థా చటర్జీ అరెస్టుపై అధికార టీఎంసీ ఆచితూచి స్పందించింది. పరిస్థితిని గమనిస్తున్నామని, సరైన సమయంలో ఓ ప్రకటన చేస్తామని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ చెప్పారు. కాగా పార్థా చటర్జీని అరెస్టు చేసిన తీరును అసెంబ్లీ స్పీకర్‌ బిమాన్‌ బెనర్జీ తప్పుబట్టారు. చటర్జీ అరెస్టు చేసే ముందు తనకు ఈడీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. 

Updated Date - 2022-07-24T08:40:23+05:30 IST