Abn logo
Jun 3 2021 @ 00:23AM

బెంగాల్‌ తుఫాను

ఆలాపన్‌ బందోపాధ్యాయ వివాదం ముగిసిపోయినట్టే, కేంద్రం ఇంకా సాగదీస్తే ఆయన పక్షాన రాష్ట్రం పోరాడుతుంది అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అధికారి కేంద్రంగా సాగుతున్న యుద్ధం నిజానికి ఆయా ప్రభుత్వాల విధులూ అధికారాలకు సంబంధించినది కాదని అందరికీ తెలుసు. ఎన్నికల యుద్ధం ముగిసి, మమత మూడోమారు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ రాజకీయరణం సాగుతూనే ఉంది.


మమత చెబుతున్నట్టుగా ఆలాపన్‌ది ముగిసిన అధ్యాయం కాదని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కేంద్రం ఆయనకు నోటీసులు జారీ చేయడం స్పష్టం చేస్తున్నది. ఈ రాజకీయ ఘర్షణలతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా దెబ్బతినిపోయి, ఉప్పెనలూ ఉత్పాతాల కాలంలోనూ పరిపాలనపై వ్యతిరేక ప్రభావం వేయడం సరికాదు. 


యాస్‌ తుఫానుమీద ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనకుండా, ముప్పై నిముషాలు ఆయనను నిరీక్షించేట్టు చేయడం ద్వారా మమతా బెనర్జీ ఆయనను ఉద్దేశపూర్వకంగా అవమానించారన్నది బీజేపీ నాయకుల విమర్శ. ప్రధాని పక్కన ఖాళీ కుర్చీ చిత్రాలు చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు. ముందుగానే ఖరారు చేసుకున్న ఇతర అత్యవసర సమావేశాలూ పర్యటనలూ ఉన్నందున, ప్రధానికి నివేదిక అందచేసి, ఆయన అనుమతి తీసుకొనే వెళ్ళానని మమత అంటున్నారు. పీఎం–సీఎం మాత్రమే ఉండాల్సిన ఆ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఎందుకు హాజరయ్యారని తృణమూల్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.


ఒడిశాలో ప్రధాని సమావేశానికి విపక్షనాయకులను పిలవలేదనీ గుర్తుచేస్తున్నారు. సువేందుని కూచోబెట్టదల్చుకుంటే తాను గైర్హాజరవుతానని మమత ముందే చెప్పినట్టు రాష్ట్ర గవర్నర్‌ వ్యాఖ్యానించారు. గత ఏడాదినాటి ఆంఫన్‌ తుఫాను సహాయకచర్యల్లో అవినీతి జరిగిందని ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన సువేందు ప్రధాని సమక్షంలో దానిని ప్రస్తావించి తనను అవమానించడానికి కుట్రపన్నినట్టు మమత అనుమానం. వీటన్నింటి బట్టి ఈ పరిణామాలేవీ అనూహ్యమైనవి కావని అర్థం. మమత వివరణతో కేంద్రం ఈ వివాదానికి స్వస్తిచెప్పినా బాగుండేది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనమేరకు ఆలాపన్‌ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రమే ఆయనను వెంటనే రిపోర్టుచేయవలసిందిగా ఆదేశించడం, ఇందుకు ప్రతిగా మమత ఆయనతో పదవీవిరమణ చేయించి సలహాదారుగా నియమించుకోవడం వరుస పరిణామాలు. రిటైరయ్యే చివరిఘడియల్లో డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌ చట్టం ఉల్లంఘన కింద ఆలాపన్‌కు నోటీసులు ఇచ్చి కేంద్రం తన అహాన్ని చల్లార్చుకుంది. ఇరుపక్షాలూ అర్థంలేని, అనవసర పట్టుదలలకు పోయి ఉన్నతస్థానాలకు తీవ్ర అప్రదిష్ట తెచ్చాయి. 


దీనికి కొద్దిరోజుల ముందే ఐదేళ్ళనాటి నారదా కుంభకోణం కేసులో మమత మంత్రులను, తృణమూల్‌ నేతలను సీబీఐ అరెస్టుచేయడం, ఆమె ఆరుగంటలపాటు సీబీఐ కార్యాలయంలో వీరంగం వేయడం తెలిసిందే. స్పీకర్‌ అనుమతి లేకుండా ఎమ్మెల్యేలు, మంత్రులను అరెస్టుచేయడం ఏమిటనీ, సువేందుని ఎందుకు వదిలేశారని తృణమూల్‌ ప్రశ్న. ఎన్నికల్లో ఓడిన బీజేపీ ఇలా అక్కసు తీర్చుకున్నదని టీఎంసి నేతలు అంటున్నారు. గతంలో రాజీవ్‌కుమార్‌, ఇప్పుడు ఆలాపన్‌, రేపు మరొకరు. ఏదో కారణంమీద కేంద్రంతో మమత ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. మోదీకి ఎదురొడ్డి గెలిచి నిలిచిన ధీరవనితగా, రేపు కేంద్రంలో చక్రం తిప్పగలిగే సమర్థత ఉన్న నేతగా అనిపించుకోడానికి ఆమె కృషి సాగుతూనే ఉంటుంది. ముమ్మారు విజయం తనపట్ల తనకే కాదు, చాలామందికి ఆమెపై నమ్మకాన్ని పెంచింది. బెంగాల్‌ తమదేనని గర్జించి, ఎన్నికల్లో పోరాడి ఓడినవారు ఆ తరువాత అయినా ఘర్షణలకు కొంతకాలం దూరంగా ఉంటే బాగుండేది. ఇందుకు ప్రతిగా, బీజేపీ నాయకులు వేసే ప్రతీ అడుగూ మమత ఆశిస్తున్న రీతిలో, ఆమెను మోదీకి సమానప్రత్యర్థిగా, రేపటి జాతీయస్థాయి నాయకురాలిగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తోంది.