‘మహా యాగం’ నడుస్తోంది... మమతకు నిద్రలేని రాత్రులే ఇక : మోదీ

ABN , First Publish Date - 2021-04-10T22:41:33+05:30 IST

బెంగాల్‌లో ‘మహా యాగం’ నడుస్తోందని, ఇక మమతకు నిద్రలేని రాత్రులేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

‘మహా యాగం’ నడుస్తోంది... మమతకు నిద్రలేని రాత్రులే ఇక : మోదీ

కోల్‌కతా : బెంగాల్‌లో ‘మహా యాగం’ నడుస్తోందని, ఇక మమతకు నిద్రలేని రాత్రులేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. చాలా దశాబ్దాలుగా బెంగాల్ మార్పుకోసం ఎదురుచూశామని, ఇప్పుడు ఆ ‘మహాయాగం’ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ మహాయాగం కచ్చితంగా ఓ గుణపాఠం చెప్పితీరుతుందని మోదీ నొక్కివక్కానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  బెంగాల్ త్వరలోనే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న మంత్రాన్ని చవిచూస్తుందని, త్వరలోనే బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడనుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి నుంచి, అక్రమ చొరబాటుదార్ల నుంచి బెంగాల్ త్వరలోనే విముక్తం కానుందన్నారు.  సీఎం మమతా బెనర్జీ తన సొంత పార్టీ కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లపైనే విరుచుకుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. 


ఇంతకు పూర్వం ఎన్నికల కమిషన్, కేంద్రబలగాలు, ఈవీఎంలపై నిత్యం విమర్శలు చేసేవారని, ఇప్పుడు మాత్రం సొంత పార్టీ కార్యకర్తలపైనే విమర్శలు చేస్తున్నారని మోదీ పేర్కొన్నారు. దీదీ చాలా నిరాశలో ఉందని, అందుకే బెంగాల్ ఓటర్ల పరువు తీస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘దీదీ... ఓ దీదీ... ఇకపై మీరు సున్నితంగా ఉంటారని బెంగాల్ ప్రజలెవ్వరూ నమ్మరు’’ అంటూ మోదీ చురకలంటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే పోరాడటం లేదని, ఈ ఎన్నికలతో బెంగాల్ ప్రజలు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారని మోదీ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-04-10T22:41:33+05:30 IST