బెంగాలీ ‘బౌల్‌’ గాయక కవుల ప్రసిద్ధి

ABN , First Publish Date - 2021-02-22T05:56:46+05:30 IST

‘బౌల్‌’లు గాయక కవులు. పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, బంగ్లాదేశ్‌లలో వారి నివాసం. హిందూ వైష్ణవులు, ముస్లిం సూఫీలు కలగలసిన సమాజం వారిది...

బెంగాలీ ‘బౌల్‌’ గాయక కవుల ప్రసిద్ధి

‘బౌల్‌’లు గాయక కవులు. పశ్చిమ బెంగాల్‌, త్రిపుర, బంగ్లాదేశ్‌లలో వారి నివాసం. హిందూ వైష్ణవులు, ముస్లిం సూఫీలు కలగలసిన సమాజం వారిది. భగవంతుడిని, తోటి మానవుడిని సమానంగా ప్రేమించే తత్వం కలవారు. వారి కీర్తనలు ఈ తత్వాన్నే చాటుతవి. ఈ గాయకులు బెంగాల్‌ జనాభాలో కొద్దిమందే అయినా, ఆ రాష్ట్ర సంస్కృతి మీద వీరి ప్రభావం చాలా ఎక్కువ. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ వీరి కవిత్వానికి, సంగీతానికి అమితంగా ఆకర్షితుడైనాడు. అలాగే అమెరికన్‌ జానపద కళాకారుడు, కవి బాబ్‌ డిలాన్‌, అమెరికన్‌ బీట్‌ కవుల్లో ఒకడైన అలెన్‌ గిన్స్‌బెర్గ్‌ వీరి ప్రభావానికి లోనయిన వారిలో ప్రముఖులు. బాబ్‌ డిలాన్‌ అయితే ‘ఎక్‌తార’ను తన వాద్యాల్లో ఒకటిగా చేసుకున్నాడు కూడా. బౌల్‌ జానపద కళాకారుల్లో 19వ శతాబ్దానికి చెందిన లాలన్‌ ఫకీర్‌ను అందరికంటే గొప్పవాడిగా పరిగణిస్తారు. ఈయన గౌరవార్థం భారత ప్రభుత్వం 2003లో తపాలా బిళ్ళను కూడా విడుదల చేసింది. నేటి కళాకారుల్లో పూర్ణదాస్‌ బౌల్‌, పబన్‌ దాస్‌ బౌల్‌, పార్వతి బౌల్‌ ఎన్నదగినవారు. దేబేన్‌ భట్టాచార్య బౌల్‌ గీతాల్ని ఇంగ్లీషులోకి అనువదించగా, యునెస్కో 1999లో ప్రచురించింది. ఈ తెలుగు అనువాదాలు వాటి అనుసరణలు. 

దీవి సుబ్బారావు,

96762 96184


1. జీవితమనే నది

ఉరవడిగా ప్రమాదభరితంగా ప్రవహిస్తోంది

హృదయమనే సరంగు

పెద్ద మోసగాడుగా మారాడు

రుసుము మొత్తం పుచ్చేసుకొని

పడవ నడపనని మొండికేశాడు.      జలధర్‌


2. అడవి దగ్ధమవుతున్నపుడు

అందరూ చూడగలరు

కాని, నా హృదయంలో రగిలే అగ్నిని

ఎవరూ కనిపెట్టలేరు     మియా జాన్‌ ఫకీర్‌


3. నీ హృదయం

ఒక కాగితం ముక్క

దాని మీద నీవు చిత్రించిన బొమ్మలు

ఆ హృదయానికి తప్ప

ఇంకొకరికి అర్థం కావు     నరహరి


4. నిన్ను జేర్చే దారికి

గుళ్ళు మసీదులు అడ్డుపడుతున్నవి

నీ పిలుపు వినవస్తున్నది గాని, ప్రభూ,

ముందుకు రాలేకపోతున్నాను.

ప్రవక్తలు ప్రవచనకారులు 

అడ్డుగా నిలుస్తున్నారు.


ప్రేమవాకిళ్ళు తెరుచుకోకుండా

అనేక తాళం కప్పలు:

మతగ్రంథాలు, రుద్రాక్షలు.

మదన్‌ కనీళ్ళు నింపుకొని

పశ్చాత్తాపంతో బాధతో మరణిస్తున్నాడు.    మదన్‌


5. ఇంద్రియవాంఛలనే నదీ ప్రవాహంలో

ఎప్పటికీ దుముకకు,

గట్టు జేరుకోలేవు.

తీవ్ర తుఫానులు చెలరేగే

దరీదాపులేని నది అది     ద్విజకైలాస్‌ చంద్ర


6. చెవిటివానికి

మూగవాడు పాడుతుండగా

తలలేనివాడు వేణువు వూదుతున్నాడు

కుంటివాడు నాట్యం చేస్తున్నాడు.

ప్రదర్శనలో లీనమయి

గుడ్డివాడు తిలకిస్తున్నాడు.

ఎంత వింత ప్రపంచం ఇది!     గురుచంద్‌


7. శ్రోతలెలాంటివారో తెలుసుకొన్నాకనే

ఏం చెప్పాలో నిర్ణయించుకో.

నిజం చెప్పావో

ఒంటి మీద కర్ర విరుగుతుంది.

అబద్ధాలు ఆడావో

ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుంది.     గోవిందదాస్‌


8. నీ జీవితం

ఆలోచన

చూపు

ఒకటిగా వుంటే

లక్ష్యం

నీ చేరువలో వుంటుంది.

నిరాకార బ్రహ్మంను సైతం

ఆచ్ఛాదన లేని కళ్ళతో

దర్శించగలవు     హౌదే గోసాయి


9. ఈ లోకం నాకు

నిలకడ లేని సంతోషాల్ని మాత్రమే ఇచ్చింది.

ఇక్కడ కాదని

ఇంకెక్కడకు వెళ్ళగలను?

చిల్లులు పడ్డ పడవలో కూర్చొని

నీరు తోడి పొయ్యటం తోటే

నా బ్రతుకు తెల్లారిపోతోంది.     లాలన్‌ ఫకీర్‌


10. నా ఇంటి తాళం చెవి

ముక్కు మొహం

తెలీనివాడి చేతుల్లో వుండిపోయింది.

నా సంపదను కళ్ళార చూసుకొనేటందుకు

లోనికి వెళ్ళే మార్గమేది?

నా ఇంటినిండా బంగారం పోగుపడి వుందిగాని

అది పుట్టుగుడ్డి ఐన పరాయివాడి అధీనంలోకి వెళ్ళింది.

ప్రవేశ రుసుము చెల్లిస్తేనే 

వాడు నన్ను లోనికి రానిస్తాడు.

వాడెవడో నాకు 

తెలీదు కాబట్టి

తప్పుదారుల్లోపడి

తిరుగుతున్నాను.     లాలన్‌ ఫకీర్‌


11. అపరిచితుడు, నేను

ఇద్దరం కలిసి జీవిస్తున్నాము,

శూన్యంలో.

వేలమైళ్ళు ఎడం

ఇద్దరికీ. 

ప్రాపంచిక స్వప్నాల మేలిముసుగు

నా కళ్ళను కప్పివేసింది.

అతగాణ్ణి నేను గుర్తించలేను,

అర్థం చేసుకోలేను.     లాలన్‌ ఫకీర్‌


12. ప్రేమను అర్థించే ప్రార్థన ఏదో

ఏ మతగ్రంథమూ బోధించదు.

ప్రేమ పత్రాలన్నీ

ఋషుల చేవ్రాలు లేకుండానే

కాలగర్భంలో కలిసిపోయినవి.     లాలన్‌ ఫకీర్‌

Updated Date - 2021-02-22T05:56:46+05:30 IST