Abn logo
May 13 2021 @ 18:34PM

త్వరలో సమర్థవంతమైన వ్యాక్సిన్ : బెంగళూరు ఐఐఎస్‌సీ

బెంగళూరు : కోవిడ్-19ను నిరోధించేందుకు అత్యంత సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరచేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)  శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులోనే సమగ్ర వ్యాక్సిన్‌ను తయారు చేయగలమనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


కర్ణాటక ఆరోగ్య, వైద్య విద్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ గురువారం బెంగళూరులోని ఐఐఎస్‌సీ డైరెక్టర్ ప్రొఫెసర్ గోవిందన్ రంగరాజన్‌తో సమావేశమయ్యారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి సాయపడాలని గోవిందన్‌ను కోరారు. దీనిపై స్పందించిన ప్రొఫెసర్ గోవిందన్ మాట్లాడుతూ, తాము సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తీసుకురాబోతున్నామని చెప్పారు. ప్రస్తుత వ్యాక్సిన్ల కన్నా సమర్థవంతంగా పని చేస్తూ, సత్ఫలితాలను ఇవ్వగలిగే వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరుస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న తమ వ్యాక్సిన్ భరోసానివ్వగలిగే ఫలితాలను చూపిస్తోందన్నారు. 


ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా మానవులకు ఇచ్చి, పరీక్షించవలసి ఉందని చెప్పారు. దీనిని గది ఉష్ణోగ్రత అంటే దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసుకోవచ్చునని, ఇది చాలా ముఖ్యమైన విషయమని తెలిపారు. తాము ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్నవాటి కన్నా సమర్థవంతంగా పని చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల తయారీపై కూడా దృష్టి సారించామని చెప్పారు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఔట్‌పుట్ 40-50 శాతమని, తాము తయారు చేస్తున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఔట్‌పుట్ దాదాపు 90 శాతమని తెలిపారు. 


అనంతరం మంత్రి డాక్టర్ కే సుధాకర్ మాట్లాడుతూ, ఐఐఎస్‌సీ అభివృద్ధిపరుస్తున్న వ్యాక్సిన్లకు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు వచ్చే విధంగా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.