Abn logo
Sep 25 2021 @ 10:18AM

బెంగళూరులో.. విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

- కేంద్ర నిఘావర్గాల హెచ్చరిక 

- రాష్ట్రమంతా అప్రమత్తం


బెంగళూరు: ప్రశాంతంగా ఉన్న కర్ణాటకపై ఉగ్రవాదులు కుట్రపన్నారని, ప్రత్యేకించి పండుగల వేళ విధ్వంసం సృష్టించేందుకు పథకం వేశారంటూ కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి మరింత అప్రమత్తం చేశారు. ప్లాస్టిక్‌ లంచ్‌ బాక్స్‌ లాంటి ఆకారంలో ఐఈడీ నింపి పేల్చేందుకు ఉగ్రవాదుల వ్యూహాలు చేస్తున్నట్లు కేంద్ర నిఘావర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం. పండుగల వేళ జనకూడళ్లలో బాంబుల దాడులు జరిపేందుకు ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ సిద్ధమైనట్లు హెచ్చరించారు. రాష్ట్రంలోని తీరప్రాంతాలు ఉగ్రవాదుల దాడులకు హాట్‌స్పాట్‌గా ఉంటాయని సూచించినట్లు సమాచారం. దీంతో తీరప్రాంత జిల్లాలైన దక్షిణకన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేకించి దక్షిణకన్నడ జిల్లాలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, హార్బర్‌తో పాటు ఉత్తరకన్నడ జిల్లా కేంద్రం కారవారలో నౌకాకేంద్రం, ఉడుపి జిల్లాలో చారిత్రాత్మకమైన ఆలయాలు ఉన్నాయి. గడిచిన 20 రోజులుగా దక్షిణకన్నడ, చిక్కమగళూరు ప్రాంతాలలోని పశ్చిమకనుమల అటవీ ప్రాంతాల నుంచి శాటిలైట్‌ ఫోన్లు వాడుతున్నట్లు స్వయంగా హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర శాసనసభలో వివరించారు. ఇదే తరుణంలో కేంద్ర నిఘావర్గాలు అప్రమత్తం చేయడం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. నిఘావర్గాలు అప్రమత్తమై రాజధాని బెంగళూరుతో పాటు తీరప్రాంత జిల్లాలపై డేగకన్ను పెట్టినట్లు సమాచారం.