బెంగళూరులో 1387 పడకలతో Covid కేర్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2022-01-20T17:41:14+05:30 IST

బెంగళూరు నగర పరిధిలో కొవిడ్‌ కేసులు రోజూ వేల సంఖ్యలో నమోదవుతుండడంతో పాలికె పరిధిలోని 8 డివిజన్ల వ్యాప్తంగా 1387 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. డివిజన్‌కు రెండు

బెంగళూరులో 1387 పడకలతో Covid కేర్‌ సెంటర్లు

                 - నగర వ్యాప్తంగా సేవల కోసం కంట్రోల్‌ రూం ఏర్పాటు


బెంగళూరు: బెంగళూరు నగర పరిధిలో కొవిడ్‌ కేసులు రోజూ వేల సంఖ్యలో నమోదవుతుండడంతో పాలికె పరిధిలోని 8 డివిజన్ల వ్యాప్తంగా 1387 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. డివిజన్‌కు రెండు చొప్పున 16 కేర్‌ సెంటర్‌లను సిద్ధం చేసినట్లు బెంగళూరు పాలికె కమిషనర్‌ గౌరవగుప్తా ప్రకటించారు. నగర వ్యాప్తంగా కొవిడ్‌కు సంబంధించి అన్ని సేవలు, సౌలభ్యాలు పొందేందుకు అనుకూలంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని బుధవారం ప్రకటించారు. ఇది 24/7గా పనిచేయనుందన్నారు. కొవిడ్‌ టెస్టింగ్‌లు, నగర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సమాచారంతో పాటు ట్రయాజింగ్‌ వంటి అన్ని సమస్యలకు కంట్రోల్‌ రూంను సందర్శించాలన్నారు. నగర వ్యాప్తంగా కేసులు తీవ్రమవుతుండడంతో కేర్‌ సెంటర్లు తెరిచామని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి డివిజన్‌లోను రెండు కేర్‌ సెంటర్లు ఉంటాయన్నారు. పశ్చిమ విభాగంలో గాంధీనగర్‌, మల్లేశ్వరంలలో రెండు కేంద్రాలు ఉండగా 100 జనరల్‌ బెడ్స్‌తో పాటు 100 ఆక్సిజన్‌ పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. దక్షిణ విభాగంలో జయనగర్‌, బీటీఎం లేఅవుట్‌, చిక్‌పేట, విజయనగర్‌, బసవనగుడి, సీవీ రామన్‌ నగర్‌లోను కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. యశ్వంతపుర, బొమ్మనహళ్లి, మహదేవపుర, కేఆర్‌పుర, యలహంక, బ్యాటరాయనపుర, దాసరహళ్లిలోనూ కేంద్రాలు ఉన్నాయన్నారు. అక్కడి కేంద్రాన్ని బట్టి పడకలు సమకూర్చామని, అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాలకు మార్పు చేస్తుంటామన్నారు. కొవిడ్‌ మూడోవిడతలో ఆసుపత్రులలో చేరేవారు తక్కువగా ఉన్నందున సమస్య తీవ్రం అనిపించలేదన్నారు. ఆక్సిజన్‌ పడకలు ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వారాంతానికి ఐదువేల పడకలు సిద్ధం చేస్తామన్నారు. కాగా ప్రస్తుతానికి నగర వ్యాప్తంగా ఉండే ఆసుపత్రులలోని 1836 పడకలకుగాను 1667 పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. 166 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నారన్నారు. 

Updated Date - 2022-01-20T17:41:14+05:30 IST