బెంజ్‌-2 ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-23T15:34:25+05:30 IST

బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ పనులు ప్రారంభమయ్యాయి. సాయిల్‌ టెస్ట్‌ పనులను..

బెంజ్‌-2 ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభం

సాయిల్‌ టెస్ట్‌ పనులకు సమాంతరంగా పిల్లర్ల నిర్మాణం కోసం గోతుల తవ్వకం

జ్యోతి కన్వెన్షన్‌ సమీపంలో మొదలైన పనులు

ఫ్లై ఓవర్‌ అత్యధిక భాగం గ్రీన్‌ బెల్ట్‌ పరిధిలోనే 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ పనులు ప్రారంభమయ్యాయి. సాయిల్‌ టెస్ట్‌ పనులను ఒకవైపు కొనసాగిస్తూనే మరోవైపు జ్యోతి కన్వెన్షన్‌ నుంచి పిల్లర్ల పనులను కూడా కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా ప్రారంభించింది. పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డు దాటి, పాత ఉపాధి కల్పనా కార్యాలయం (ఐదవ నెంబర్‌ రోడ్డు-ఇన్‌) వరకు గ్రీన్‌ బెల్ట్‌ పరిధిలో బారికేడ్లతో పూర్తిగా మూసివేసి మధ్యలో పనులు చేస్తున్నారు. 


మొదటి వంతెన మాదిరిగా సర్వీసు రోడ్డు వైపు కాకుండా మూడింతలు గ్రీన్‌బెల్డ్‌ పరిధిలోకి ఈ వంతెన డైరెక్షన్‌ను మార్చారు. మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశలో పాత ఉపాధి కల్పన కార్యాలయం ప్రాంతం నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ మీదుగా వినాయక్‌ థియేటర్‌ వరకు సాయిల్‌ టెస్ట్‌ పనులు, సమాంతరంగా పిల్లర్ల కోసం గోతులను తవ్వుతారు. సాయిల్‌ టెస్ట్‌ రిపోర్టు వచ్చిన వెంటనే తవ్విన గోతుల్లో కాంక్రీటింగ్‌ చేసి, పిల్లర్ల నిర్మాణం చేపడతారు. ఈ పనులను రెండు భాగాలుగా చేపట్టడం ద్వారా ఏకకాలంలో జ్యోతి కన్వెన్షన్‌ నుంచి రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ దాటే వరకు  పిల్లర్ల పనులు, దాని మీద తలల నిర్మాణం చేపట్టవచ్చు.


జ్యోతి కన్వెన్షన్‌ వద్ద, రమేష్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వద్ద, మొదటి వరస ఫ్లై ఓవర్‌లోని అప్రోచ్‌ల మాదిరిగా పొడవాటి వాల్‌ నిర్మాణం కాకుండా నిడివిని చాలా వరకు తగ్గిస్తున్నారు. దీని కారణంగా పిల్లర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొదటి వరస ఫ్లై ఓవర్‌కు 47 పిల్లర్లుండగా.. రెండో వరసకు రెండు వైపులా కలిపి పది పిల్లర్ల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. 

Updated Date - 2020-09-23T15:34:25+05:30 IST