May 14 2021 @ 19:32PM

‘ఎన్‌4’ దర్శకుడికి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు

‘మై సన్‌ ఈజ్‌ కె’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కుమార్‌ తన మొదటి చిత్రంతోనే పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘ఎన్‌4’ అనే పేరుతో రెండో చిత్రాన్ని తెరకెక్కించారు. ధర్మరాజ్‌ ఫిలిమ్స్‌, బ్రియాండ్‌ ది లిమిట్‌ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఉత్తర చెన్నై ప్రజల జీవనపోరాటంలో ఎదుర్కొనే కష్టనష్టాలను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో హైఖేల్‌ తంగదురై, కేబ్రియలా, సెల్స్‌ అనుపమా కుమార్‌, వడివుక్కరసి, అభిషేక్‌ శంకర్‌, అళగు, అఫ్జల్‌, హమీదు, వినుషా దేవి, అక్షయ కమల్‌, తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలై ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. 


ఇదిలావుంటే, ఇటీవల జరిగిన కలకత్తా ఇంటర్నేషనల్‌ కల్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా, ఈ చిత్రాన్ని చూసిన న్యాయనిర్ణేతలు ‘ఎన్‌4’ దర్శకుడు లోకేష్‌ కుమార్‌కు ఉత్తమ దర్శక అవార్డును ప్రకటించారు. దీంతో చిత్ర యూనిట్‌ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అదేవిధంగా ఇటీవల జరిగిన ‘2021 దాదాసాహెబ్‌ ఫాల్కే చిత్రోత్సవం’లో ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో కూడా ఈ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. కాగా, ఈ చిత్రానికి జి. బాలసుబ్రమణియన్‌ సంగీతం సమకూర్చగా, ఎస్‌. దివ్యాంక్‌ డీవోపీగా పనిచేశారు.