పంతం నెరవేర్చుకున్న వైసీపీ!

ABN , First Publish Date - 2021-10-06T07:06:59+05:30 IST

కాకినాడ మేయర్‌ మార్పుపై అధికార వైసీపీ పంతం నెరవేర్చుకుంది. చేతిలో అధికారం, ప్రలోభాలు, రహస్య క్యాంపులతో అనుకున్నట్టుగానే పైచేయి సాధించింది. టీడీపీ అసమ్మతి కార్పొరేటర్ల సాయంతో టీడీపీ మేయర్‌ పావనిని గద్దెదించడంలో సఫలమైంది. దీంతో మేయర్‌ మార్పు ఖాయం అయింది.

పంతం నెరవేర్చుకున్న వైసీపీ!
కాకినాడ కార్పొరేషన్‌లో మేయర్‌పై అవిశ్వాస సమావేశంలో చేతులెత్తి వ్యతిరేకతను తెలియజేస్తున్న కార్పొరేటర్లు

  • కాకినాడ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం
  • మేయర్‌ను దించాలంటూ చేతులెత్తిన 33 మంది కార్పొరేటర్లు
  • ఇందులో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు పార్టీ జారీ చేసిన విప్‌ ధిక్కరింపు
  • చేతులెత్తి అభిప్రాయం చెప్పిన మంత్రి కన్నబాబు, ఎంపీ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి 
  • మేయర్‌ పావనికి అనుకూలంగా ఒక్క ఓటు కూడా పడని వైనం
  • హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫలితాలు గోప్యంగా ఉంచిన అధికారులు
  • డిప్యూటీ మేయర్‌-1పై అవిశ్వాసానికి మద్దతుగా 26, వ్యతిరేకంగా పది ఓట్లు 
  • అవిశ్వాస తీర్మాన ఫలితం నేపథ్యంలో ఇకపై మొక్కుబడిగానే మేయర్‌ పావని పాత్ర
  • విప్‌ ధిక్కరణ నేపథ్యంలో పదవులు రద్దవకుండా టీడీపీ రెబల్‌ కార్పొరేటర్ల ఎత్తుగడలు

కాకినాడ మేయర్‌ మార్పుపై అధికార వైసీపీ పంతం నెరవేర్చుకుంది. చేతిలో అధికారం, ప్రలోభాలు, రహస్య క్యాంపులతో అనుకున్నట్టుగానే పైచేయి సాధించింది. టీడీపీ అసమ్మతి కార్పొరేటర్ల సాయంతో టీడీపీ మేయర్‌ పావనిని గద్దెదించడంలో సఫలమైంది. దీంతో మేయర్‌ మార్పు ఖాయం అయింది. అయితే కొత్త మేయర్‌ ఎవరనేదానిపై కొన్ని రోజులు సస్పెన్స్‌ కొనసాగనుంది. తనను మేయర్‌ పదవి నుంచి దించడానికి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలపై ఇటీవల పావని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అవిశ్వాస తీర్మాన సమావేశం మాత్రమే నిర్వహించి ఫలితాలు ఈనెల 22 వరకు వెల్లడించవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో మంగళ వారం నిర్వహించిన అవిశ్వాస తీర్మాన ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. మంగళవారం నాటి పరిణామాల  నేపథ్యంలో నేటి నుంచి మేయర్‌ పాత్ర నామమాత్రం కానుంది. అటు పార్టీ జారీ చేసిన విప్‌ ధిక్కరించి అధికార పార్టీ వ్యూహాలకు అనుగుణంగా మేయర్‌కు వ్యతిరేకంగా ఓట్లేసిన టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు తమ పదవి కోల్పోయే ప్రమాదం లేకుండా పావులు కదుపుతున్నారు. 


కాకినాడ (ఆంధ్రజ్యోతి)/ కార్పొరేషన్‌, అక్టోబరు 5: కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు మేయర్‌పై అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశం మంగళవారం జరిగింది. దీనికి ఎన్నికల అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ వ్యవహరించారు. సమావేశం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు.. రెండు రోజులపాటు రహస్య క్యాంపునకు తరలివెళ్లిన టీడీపీ అసమ్మతి, వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే ద్వారంపూడికి చెందిన డి-కన్వెన ్షన్‌కు చేరుకున్నారు. అక్కడ సమావేశమై మరొకసారి వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించుకున్నారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మాన సమావేశంలో ఎలా వ్వహరించాలి? టీడీపీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించి ఓటేయడం ఎలా? అనే దానిపై చర్చించుకున్నారు. అనంతరం నేరుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ హాల్‌కు చేరుకున్నారు. అటు ఎక్స్‌అఫిషియో సభ్యులు అయిన కాకినాడ ఎంపీ వంగా గీత, మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. తర్వాత మేయర్‌ పావని మాత్రం ఒక్కరే సమావేశానికి వచ్చారు.


అనంతరం ఎన్నికల అధికారి లక్ష్మీశ.. మేయర్‌ పావనిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సభ్యులు చేతులు పైకెత్తి ఓటు వేయాలని సూచించారు. దీంతో మేయర్‌కు వ్యతిరేకంగా 36 మంది చేతులు ఎత్తారు. వారిలో ముగ్గురు ఎక్స్‌ అఫిషియో మెంబర్లు, 8 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఇద్దరు ఇండిపెండెంట్లు, 2 బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. మిగిలిన వారు 21 మంది టీడీపీకి చెందిన అసమ్మతి కార్పొరేటర్లు కావడం విశేషం. కాగా అవిశ్వాస తీర్మానం సందర్భంగా మేయర్‌కు అనుకూలంగా ఓటు వేసేలా టీడీపీ తన సభ్యులకు విప్‌ జారీ చేసింది. కానీ దాన్ని ధిక్కరించి 21 మంది కార్పొరేటర్లు వైసీపీ వ్యూహానికి తగ్గట్టుగా మేయర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అనంతరం మేయర్‌కు అను కూలంగా ఓటింగ్‌ నిర్వహించగా ఒక్కరు కూడా ఓటు వేయకుండా మేయర్‌పై కార్పొరేటర్లు తమ అసమ్మతిని వ్యక్తం చేశారు. దీంతో కనీసం ఒక మహిళా కార్పొరేటర్‌ను సైతం కూడగట్టుకోలేక మేయర్‌ నిస్సహాయురాలిగా మారారు. అటు టీడీపీకి చెందిన మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు. అనంతరం మధ్యా హ్నం 12 గంటలకు డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబుపై కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈయనకు వ్యతిరేకంగా 36 మంది ఓటు వేశారు. మేయర్‌పై అవిశ్వాసం సందర్భంగా తటస్థంగా ఉన్న తొమ్మిది మంది కార్పొరేటర్లు, మేయర్‌ పావని కలిపి మొత్తం పది మంది డిప్యూటీ మేయర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.


కాగా అవిశ్వాస ఫలితాల్లో మేయర్‌కు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు రావడంతో ఆమెకు పదవీ గండం ఏర్పడింది. ఒకరకంగా చెప్పాలంటే పదవి కోల్పోయినట్టు అయింది. కాకపోతే ఈ ఎన్నికకు వ్యతిరేకంగా పావని హైకోర్టును ఇదివరకే ఆశ్ర యించడంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించలేదు. కేసు ఈనెల 22న తేలనున్న నేపథ్యంలో అప్పటివరకు ఫలితాలను గోప్యంగా ఉంచాలని నిర్ణయించారు. కాగా మంగళవారం నాటి అవి శ్వాస తీర్మాన సమావేశ ఫలితాలను కలెక్టర్‌ తన నివేదికను ఎన్నికల కమిషన్‌కు పంపనున్నారు. ఆ తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికు షెడ్యూల్‌ విడుదల కానుంది. కాగా టీడీపీ కార్పొరేటర్లకు పార్టీ అధిష్ఠానం విప్‌ జారీ చేసినప్పటికీ వైసీపీ అనుకూల టీడీపీ కార్పొరేటర్లు విప్‌ ధిక్కరించి వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ అధిష్ఠానం కూడా వారి ముగ్గురు కార్పొరేటర్లకు కూడా విప్‌ జారీ చేసింది. ముగ్గురిలో ఒకరు సాలిగ్రామ లక్ష్మీప్రసన్న పార్టీ అధిష్ఠానానికి కట్టుబడి అవిశ్వాస తీర్మాన సమావేశానికి హాజరుకాలేదు.


అయితే విప్‌ ధిక్కారం కింద ఆయా పార్టీలు కార్పొరేటర్లపై ఎటువంటి చర్యలకు పాల్పడతాయనేది వేచిచూడాల్సి ఉంది. టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు కూడా తమపై వేటు పడుతుందా? లేదా? అనేదానిపై కొంత ఆందోళనకు గురవుతున్నారు. కాకపోతే అధిష్ఠానంతో చర్చలు జరిపి వేటు నుంచి తప్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. మరోపక్క అవిశ్వాస తీర్మాన సమావేశం అనంతరం మేయర్‌ పావని మీడియాతో మాట్లాడారు. నగరానికి తాను చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసిందేమీలేదన్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నందునే అవిశ్వాసం ప్రవేశపెట్టారని చెప్పారు. మహిళ అయిన తనను గద్దె దించేందుకు ఎమ్మెల్యే ద్వారంపూడి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. న్యాయపరంగా గెలుపు తనదేనని, కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా అవిశ్వాసం పెట్టారని డిప్యూటీ మేయర్‌ కాల సత్తిబాబు పేర్కొన్నారు.


మేయర్‌ రేసులో శివప్రసన్న

కార్పొరేషన్‌(కాకినాడ): కాకినాడ నగర్‌ మేయర్‌పై అవి శ్వాస తీర్మానం నెగ్గడంతో అందరి చూపూ కొత్త మేయర్‌పై పడింది. అయి తే మేయర్‌ సుంకర పావని న్యాయపోరాటం సాగిస్తున్నారు. తనను పదవి నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుట్ర పన్నారన్నది ఆమె ఆరోపణ. తనపై అవిశ్వాసం కూడా అనైతికమని ఆమె కోర్టు ను ఆశ్రయించారు. దీంతో అవిశ్వాసంలో ఆమె ప్రత్యర్థులు నెగ్గినా, ఫలితం వెల్లడించకూడదని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కొత్త మేయర్‌ రేసులో ఎవరున్నారనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం మేయర్‌ పదవి రేసులో సుంకర శివప్రసన్న ఉన్నట్టు ప్రచారంలో ఉంది. టీడీపీ, వైసీపీలతో సత్సంబంధాలు కలిగిన సుంకర విద్యాసాగర్‌ సతీమణి అయిన శివప్రసన్న పేరు ప్రధానంగా రేసులో ఉన్నట్టు సమాచారం. కానీ కోర్టు తీర్పు లేదా మేయర్‌ ఎన్నిక జరిగే వరకు ఈ ఉత్కంఠ వీడదు.

Updated Date - 2021-10-06T07:06:59+05:30 IST