నమ్మక ద్రోహం చేశారు

ABN , First Publish Date - 2021-01-17T09:07:23+05:30 IST

నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగించినందుకు, ముఖ్యమంత్రి జగన్‌ తమకు సరైన గుణపాఠం నేర్పారంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నమ్మక ద్రోహం చేశారు

  • సీఎం జగన్‌పై అమరావతి రైతుల ఆగ్రహం
  • 396వ రోజు కొనసాగిన ఆందోళనలు
  • రేపటి నుంచి శివస్వామి మహాయాగం: జేఏసీ

గుంటూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): నమ్మి ఓట్లు వేసి అధికారం అప్పగించినందుకు, ముఖ్యమంత్రి జగన్‌ తమకు సరైన గుణపాఠం నేర్పారంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తోన్న ఆందోళనలు శనివారం 396వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, బోరుపాలెం, దొండపాడు, నీరుకొండ, పెదపరిమి తదితర 29 గ్రామాల రైతులు, మహిళలు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు.


ఉద్దండరాయునిపాలెంలో నిరసనలకు విజయవాడ మహీంద్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ విజయకుమార్‌ నేతృత్వంలో బ్యాంకు ఉద్యోగులు మద్దతు పలికారు. మహిళలు అమరావతి వెలుగు కార్యక్రమం కింద సామూహికంగా దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి నినాదాలు చేశారు. కాగా, అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగేందుకు ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు శివస్వామి నేతృత్వంలో ఉద్దండరాయునిపాలెంలో శ్రీవిద్యా మహాయాగం నిర్వహిస్తున్నట్లు అమరావతి జేఏసీ నేతలు తెలిపారు.  

Updated Date - 2021-01-17T09:07:23+05:30 IST