కట్టెలు ఎత్తిన చేతులతో దేశ గౌరవాన్ని మోసి...

ABN , First Publish Date - 2021-07-27T05:30:00+05:30 IST

మణిపూర్‌లోని ఇంఫాల్‌ లోయకు తూర్పు దిక్కున ఉన్న నాంగ్‌బోక్‌ సెక్మాయ్‌ అనే గ్రామం మాది. మీరాబాయి బాల్యం నుంచీ తనకు అప్పగించిన ఏ ఒక్క పనినీ సాధించకుండా వదిలేది కాదు.

కట్టెలు ఎత్తిన చేతులతో దేశ గౌరవాన్ని మోసి...

వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను బరువులతో పాటు, ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకాన్ని తెచ్చిపెట్టే భారాన్ని కూడా తన భుజస్కంధాలపై వేసుకుంది. రజత పతకంతో చరిత్ర సృష్టించిన చాను విజయం వెనక కష్టాలు, కడగండ్లతో నిండిన బాల్యం, కఠోర క్రమశిక్షణలు దాగి ఉన్నాయి. కట్టెల మోపులు మోసిన బాల చాను, వెయిట్‌లిఫ్టర్‌గా ఎదిగిన ఆసక్తికర వైనాన్ని ఆమె తల్లి సాయిఖోం తోంబీ దేవి మీడియాతో పంచుకున్నారు.


‘‘ణిపూర్‌లోని ఇంఫాల్‌ లోయకు తూర్పు దిక్కున ఉన్న నాంగ్‌బోక్‌ సెక్మాయ్‌ అనే గ్రామం మాది. మీరాబాయి బాల్యం నుంచీ తనకు అప్పగించిన ఏ ఒక్క పనినీ సాధించకుండా వదిలేది కాదు. కాబట్టే ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకాన్ని గెలుచుకుంటుందని తన మీద నాకు పూర్తి నమ్మకం. నా మిగతా పిల్లలు అల్లికలు, చదువుల్లో మునిగిపోతే మీరాబాయి కట్టెల మోపులు తలకెత్తుకుని ఇంటి బాధ్యతలను నాతో కలిసి పంచుకుంది. ఒక్కోరోజు పొలంలో రెండు పూటలా మూడు నుంచి నాలుగు గంటల పని ఉండేది. అయినా చాను వెనక్కి తగ్గేది కాదు. నాకు పని భారం తగ్గించాలనే తపన తప్ప తనకు మరొక ధ్యాస ఉండేది కాదు. ఐదుగురు పిల్లల్లో అందరికంటే చిన్నదైనా ఇంటి బాధ్యతను పెద్ద బిడ్డలా భుజాల మీద వేసుకుంది. మా వారు మణిపూర్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌. ఆయనకొచ్చే అరకొర సంపాదనతో ఐదుగురు పిల్లలను పోషించడం కష్టంగా ఉండేది. కాబట్టి కుటుంబానికి ఆసరా కోసం గ్రామం ప్రధాన కూడలిలో ఓ టీ దుకాణం నడపడం మొదలుపెట్టాను. మా పూర్వీకులందరూ చిన్నపాటి రైతులు. మాకంటూ సొంత భూమి కూడా ఉండేది కాదు. మా వారి నెలసరి ఆదాయం రెండు నుంచి మూడు వేల రూపాయలు. దాంతో మిగతా పిల్లలతో పాటు మీరాబాయికి సరైన భోజనం కూడా పెట్టగలిగేదాన్ని కాదు. 


పోషకభరిత భోజనం!

యుక్తవయసులో మీరాబాయి ఆర్చర్‌ కావాలనుకుంది. అయితే వెయిట్‌లిఫ్టింగ్‌ గురించి తెలిసిన తర్వాత ఆ క్రీడ మీద తనకు ఆసక్తి ఏర్పడింది. అలా ఓ రోజు వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ గురించి తెలుసుకోవడం కోసం తండ్రితో కలిసి ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుమాన్‌ లంపాక్‌ స్టేడియానికి వెళ్లింది. అప్పట్లో అనితా చాను వెయిట్‌ లిఫ్టింగ్‌ కోచ్‌గా శిక్షణ ఇస్తూ ఉండేది. అక్కడ వెయిట్‌లిఫ్టింగ్‌ ట్రయల్స్‌లో మీరాబాయి ఎంపికై, శిక్షణకు అర్హత పొందింది. చానుకు కండ బలం ఎక్కువ. శిక్షణ తీసుకుంటున్న సమయంలో చానును చూసి తను మెరుగైన వెయిట్‌ లిఫ్టర్‌ అవుతుందని గ్రహించాను. ఆ అకాడమీలో రోజుకు రెండు సార్లు శిక్షణ సాగేది. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లే అవసరం లేకుండా మీరాబాయి ఇంటి భోజనాన్ని వెంట తీసుకువెళ్లేది. ఉడికించిన కూరగాయలు, పిండిపదార్థాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండే నలుపు, తెలుపు అన్నం చాను ప్రధాన భోజనం. మిగతా పిల్లల్లా మధ్యాహ్నం ఇంటికి  వెళ్లకుండా శిక్షణ ముగించుకుని సాయంత్రానికే ఇల్లు చేరేది. శిక్షణలో భాగంగా, ప్రారంభంలో కలప ముక్కలతో బరువులు ఎత్తడం మొదలుపెట్టిన చాను రోజుల వ్యవధిలోనే 70 కిలోల బరువులు ఎత్తడం మొదలుపెట్టింది. అది దాదాపు ఆమె శరీర బరువుకు రెండింతలు.


తన కష్టం ఫలించింది

ప్రతి రోజూ సాయంత్రం చాను రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేదాన్ని. అకాడమీకి కొన్నిసార్లు ఇసుక ట్రక్కు లేదా సైకిల్‌ మీద ప్రయాణించేది. కొన్ని రోజుల్లో కేవలం ఒక వైపు ప్రయాణానికి సరిపడా డబ్బులు మాత్రమే ఉండేవి. దాంతో సాయంత్రం కాలినడకనే ఇల్లు చేరేది. చాను అక్కలు అల్లికలతో సంపాదించిన సొమ్ములో కొంత పొదుపు చేసి శిక్షణ, ప్రయాణ ఖర్చుల కోసం అందించేవాళ్లు. నా పిల్లల సమిష్టి కృషి, మీరాబాయి శ్రమ వృఽథా పోలేదు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన విషయాన్ని మీరాబాయి ఫోన్‌ చేసి చెప్పినప్పుడు నేను స్పృహ తప్పి పడిపోయాను. కుటుంబం మొత్తం ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించడానికి మీరాబాయి ఎంత కష్టపడిందో నేను ప్రత్యక్షంగా చూశాను. ఒత్తిడి తట్టుకోలేక చాలాసార్లు మధ్యలోనే క్రీడ నుంచి తప్పుకోవాలనీ అనుకుంది. కానీ మా కుటుంబం మొత్తం ఆమెకు ఆసరా అందించాం. ఆత్మ నిబ్బరం కోల్పోకుండా చానును ప్రోత్సహించాం. క్రీడను ఓ కష్టంలా భావించాలనీ, కష్టాల నుంచి మధ్యలోనే తప్పుకోవడం సరైన పని కాదనీ నచ్చచెప్పేవాళ్లం. శిక్షణలో భాగంగా కొన్నిసార్లు చానుకు గాయాలు కూడా అయ్యేవి. ఆ సమయంలో దేవుడిని ప్రార్థిస్తూ, నిద్రలేని రాత్రుళ్లు గడిపేదాన్ని. అయితే ఇది కన్నీళ్లతో నిండిన గతాన్ని గుర్తు చేసుకునే సమయం కాదు. మీరాబాయి సాధించిన దేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటి చెప్పింది. చాను తల్లిగా నేనెంతో గర్వపడుతున్నాను’’.



పోటీకి ముందు కాళరాత్రి!

పోటీ కోసం నెలల తరబడి తీసుకున్న శిక్షణ, కఠోర సాధన మట్టిలో కలిసే దుస్థితి అది. పోటీకి ముందు రోజు రాత్రి మీరాబాయి చాను కడుపు నొప్పితో అల్లాడిపోయింది. అది నెలసరి నొప్పి. అంతకుముందు అంతలా ఆ నొప్పి బాధించేది కాదు. కానీ కీలక సమయంలో పోటీకి ముందు రాత్రి ఆ నొప్పి చానును విపరీతంగా ఇబ్బంది పెట్టింది. దాంతో చాను కంగారు పడుతూ విషయాన్ని కోచ్‌కు చెప్పింది. ఆ సందర్భం గురించి వివరిస్తూ... ‘‘ఆందోళనపడుతూ కోచ్‌కు నా పరిస్థితి గురించి చెప్పాను. సరిగ్గా మెడల్‌ సాధించే మ్యాచ్‌కు ముందు రోజే నెలసరి నొప్పి ఇలా వేధించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మన ఆలోచనలను బట్టే శరీరం స్పందిస్తుంది. అంటే మెడల్‌ గురించి నాకెక్కడో చిన్న అనుమానం ఉందని అనిపించింది. దాంతో నా ఆలోచనలను నొప్పి నుంచి మెడల్‌ వైపు మళ్లించాను. మహిళా క్రీడాకారులందరం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని ఎలా అధిగమించాలో మాకు తెలుసు. తీవ్రమైన శిక్షణ, ఒత్తిడి, వర్క్‌లోడ్‌ మూలంగా మహిళా క్రీడాకారుల నెలసరి క్రమం తప్పడం సహజం. ఇది కూడా ఆటల్లో భాగమే!’’ అంటూ తన అనుభవాన్ని మీడియాతో పంచుకుంది మీరాబాయి చాను.

Updated Date - 2021-07-27T05:30:00+05:30 IST