మెట్ట రైతు ఆశలు ఆవిరి

ABN , First Publish Date - 2021-03-02T06:00:35+05:30 IST

వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న మెట్టరైతు ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్నటి వరకు పుష్కలంగా నీరు పోసిన బోర్లు ఒక్కసారిగా ఎండిపోతున్నాయి.

మెట్ట రైతు ఆశలు ఆవిరి
రేగొండలో ఎండిన వరి పొలం

అడుగంటుతున్న భూగర్భ జలాలు

ఎండుతున్న పంటలు


అక్కన్నపేట, మార్చి 1 : వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న మెట్టరైతు ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్నటి వరకు పుష్కలంగా నీరు పోసిన బోర్లు ఒక్కసారిగా ఎండిపోతున్నాయి. బావులు చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. ఈసారి ఆలస్యంగానైనా పుష్కలంగా వర్షాలు కురియడంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. దీంతో రైతులు బోర్లు, బావుల కింద వరి ఎక్కువగా సాగు చేశారు. వానాకాలం అదను దాటిపోవడంతో నాట్లు వేయలేని వారు కూడా యాసంగిలో వరి వేసుకున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. నాట్ల సమయంలో పుష్కలంగా నీరు పోసిన బోర్లు, బావులు ఇటీవల ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి.దీంతో పొలాలు నీటి కోసం నోళ్లు తెరుస్తున్నాయి. కళ్లెదుటే పంట ఎండిపోతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంటను కాపాడుకోవడానికి రైతులు శక్తికి మించి అప్పులు చేసి బోర్లు వేస్తున్నా నీరు మాత్రం రావడం లేదు.

యాసంగి సీజన్‌లో హుస్నాబాద్‌ డివిజన్‌ పరిధిలోని అక్కన్నపేట, హుస్నాబాద్‌, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాల్లో 74 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1000 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలను సాగు చేశారు. వానాకాలంలో చెరువులు, కుంటలు పొంగిపొర్లడం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుండటంతో మెట్టప్రాంత రైతులు బావులు, బోర్ల కింద వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు రూ. 20 వేల వరకు ఖర్చు చేశారు. నాట్ల సమయంలో బోర్లలో పుష్కలంగా నీరు వచ్చింది. పంట ఏపుగా పెరుగుతుండడంతో ఈసారి దిగుబడి పుష్కలంగా వస్తుందని సంతోషపడుతున్న సమయంలో ఒక్కసారిగా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. పంట పొట్టకు వస్తున్న దశలో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. నిన్నటి వరకు పుష్కలంగా నీరు పోసిన బోర్లు ఆగిపోతున్నాయి. ఖర్చు ఎక్కువైనా వెనకడుగు వేయకుండా వరి సాగుచేస్తే మధ్యలోనే ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని అప్పులు చేసి ఒక్కొకరు మూడు, నాలుగు బోర్లు వేస్తున్నారు.


పాతాళానికి గంగమ్మ

 అక్కన్నపేట, హుస్నాబాద్‌ మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయికి పడిపోతున్నాయి. తాజాగా కొందరు రైతులు 500 ఫీట్ల వరకు బోరు వేసినా నీటి చుక్క రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పంటలను కాపాడుకోలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ముదరక ముందే పరిస్థితి ఇలా ఉంటే పంటలు చేతికి ఎలా అందుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి తిరిగి వచ్చినా గొప్పేనని వాపోతున్నారు. పంటలు నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-03-02T06:00:35+05:30 IST