కేయూ ఉద్యమ నేత మహేశ్‌కు మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2021-12-02T09:27:55+05:30 IST

కాకతీయ యూనివర్సిటీ ఉద్యమనేత, పార్ట్‌టైం అధ్యాపకుడు డాక్టర్‌ దబ్బెట మహేశ్‌కు మెరుగైన వైద్య సాయం కోసం హైదరాబాద్‌లోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించాలని వైద్య సిబ్బందిని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

కేయూ ఉద్యమ నేత మహేశ్‌కు మెరుగైన వైద్యం

టిమ్స్‌కు తరలించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు

కేయూ క్యాంపస్‌, డిసెంబరు 1: కాకతీయ యూనివర్సిటీ ఉద్యమనేత, పార్ట్‌టైం అధ్యాపకుడు డాక్టర్‌ దబ్బెట మహేశ్‌కు మెరుగైన వైద్య సాయం కోసం హైదరాబాద్‌లోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించాలని వైద్య సిబ్బందిని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ‘అంపశయ్యపై విద్యార్థి ఉద్యమనేత’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం వచ్చిన కథనానికి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలు, విద్యార్థులు, దాతలు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ రూ.50 వేలు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. వినయ్‌భాస్కర్‌, కేయూ వీసీ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ బుధవారం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కొవిడ్‌తో అనారోగ్యంపాలై వెంటిలేటర్‌పై చికి త్స పొందుతున్న ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులతో పాటు మహేశ్‌ భార్యకు ధైర్యం చెప్పారు. కాకతీయ యూనివర్సిటీ పార్టుటైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ వై.రాంబాబు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నరేందర్‌నాయక్‌ నేతృత్వంలో రూ.29,300 మహేశ్‌ భార్యకు అందజేశారు. 

Updated Date - 2021-12-02T09:27:55+05:30 IST