Abn logo
Dec 4 2020 @ 23:57PM

బలికోరుతున్న బెట్టింగ్‌

ఆన్‌లైన్‌ యాప్‌లతో విష సంస్కృతి

పందెం మోజులో యువత తప్పటడుగు

డబ్బులు పోగొట్టుకుని అప్పుల ఊబిలోకి

భయాందోళనలతో అఘాయిత్యాలు

జిల్లాలో పెరుగుతున్న సంఘటనలు‘మెదక్‌ మండలం మక్తభూపతిపూర్‌ గ్రామానికి చెందిన మహేష్‌(22) ఐపీఎల్‌ సందర్భంగా బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయాడు. విషయం ఇంట్లో తెలిసి తండ్రి కొడుకుని మందలించాడు. పందేల కోసం చేసిన అప్పులు పెరగడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనతో మహేష్‌ గత నెల 23న గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు’. 


‘నర్సాపూర్‌ పట్టణానికి చెందిన శ్రావణ్‌(24) బె ట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఎలాగైనా గెలవాలని ఆన్‌లైన్‌లో రుణాలు ఇచ్చే యాప్‌లో రూ.16 వేలు అప్పు చేసి మరోసారి పందేలు వేశాడు. అది కూడా పోవడంతో అప్పు చెల్లించలేదు. తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించాలని సదరు సంస్థ ప్రతినిధి వేధించడంతో ఆందోళనతో శ్రావణ్‌ బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు’. ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, డిసెంబరు 4: బెట్టింగ్‌ భూతం ప్రాణాలను హరిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో యువత ఈ విషవలయంలో చిక్కుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.  బెట్టింగ్‌ల జోరు ఏటికేడు పెరుగుతుండటం కలవరపరుస్తున్నది. బెట్టింగ్‌ డీల్స్‌ అన్నీ ఫోన్‌ సంభాషణలు, వాట్సా్‌పలో జరుగుతున్నాయి. మ్యాచ్‌లో బాల్‌ బాల్‌కు... పరుగు పరుగుకీ... బెట్టింగ్‌ కాస్తున్నారు. విజేత ఎవరనే విషయంలో పందెం కాస్తారు. మ్యాచ్‌ను బట్టి అప్పటికప్పుడు బెట్టింగ్‌ ధర నిర్ణయిస్తారు. ఆ వివరాలను బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారికి ఫోన్‌ ద్వారా చేరవేస్తారు. నగదు లావాదేవీలన్నీ ఎక్కువగా గూగుల్‌పే, ఫోన్‌ పేల ద్వారా జరుగుతోంది. బుకీల ద్వారా సాగే బెట్టింగ్‌ కంటే యాప్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా సాగేవే ఎక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో బుకీల ద్వారా ఈ తంతు నడుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురు లేదా అంతకుమించి ఎక్కువ మంది గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌ కాస్తున్నారు. బుకీల ద్వారా పందేలు కాస్తే పోలీసులు నిఘా వేసి పట్టుకుని అరెస్టులు చేసేవారు. అయితే ఎక్కువగా ఆన్‌లైన్‌లో జరుగుతుండటంతో అడ్డుకట్ట వేయడం వారికి సవాల్‌గా మారింది. బెట్టింగ్‌ మోజులో యువత అప్పుచేసి మరీ పందేలు కాస్తున్నారు. డబ్బులు పోవడంతో అప్పు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్‌లకు తోడు ఎలాంటి పత్రాలు, హామీ లేకుండానే అప్పులు కూడా ఆన్‌లైన్‌లోనే లభ్యం అవుతుండటంతో యువకులు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో అప్పుల విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు మందలించడం, అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలనే తీసుకుంటూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. 


యువత, విద్యార్థులే అధికం

ఐపీఎల్‌ బెట్టింగ్‌ కాస్తున్న వారిలో 90 శాతం మంది యువత, విద్యార్థులే ఉంటున్నారు. స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండటంతో అడ్డూ ఆపు లేకుండా పందేలు కడుతున్నారు. రూ.లక్షలు నష్టపోయిన ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు, ఊరు వదిలి వెళ్లిపోయిన సంఘటనలు జిల్లాలో ఏటా జరుగుతూనే ఉన్నాయి. కొందరు సరదాగా, మరికొందరు సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఊబిలోకి దిగి ఆర్థికంగా చితికిపోతున్నారు. చేసిన అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డవారెందరో ఉన్నారు. ఇటువంటి సంఘటనలు గతంలోనూ మెదక్‌ పట్టణంలో చోటుచేసుకున్నాయి.

Advertisement
Advertisement