జరజాగ్రత్త..

ABN , First Publish Date - 2021-06-15T05:44:45+05:30 IST

జరజాగ్రత్త..

జరజాగ్రత్త..

అటు కరోనా.. ఇటు సీజనల్‌ వ్యాధులు

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు


వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, జూన్‌ 14 : వర్షాకాలం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. దీంతో సీజనల్‌ వ్యాధులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రుతుపవనాలు రాకతో వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులైన చికున్‌గున్యా, డెంగీ, మలేరియా వంటివి సోకే అవకాశాలు ఉంటాయి. ప్రజలు ముందస్తుగా తగు జాగ్రత్తలు పాటించి వ్యాధులకు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్కరు స్వీయ రక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. లాక్‌డౌన్‌ సమయాన్ని సడలించడంతో జనసంచారం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తలు పాటించాలి.


మలేరియా ఇలా.. 

మలేరియా సోకతే తీవ్రమైన తలనొప్పి, జ్వరం, చలి వణుకుతో కూడిన విపరీతమైన జ్వరం రోజు విడిచి రోజు జ్వరం వస్తుంది. తీవ్రమైన చమటలు వచ్చి జ్వరం తగ్గిపోవడం జరుగుతుంది. జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. 


దోమలు బెడద అరికట్టాలి.. 

దోమల బెడదను అరికట్టాలి. వారం రోజులు నీరు  నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయి. ప్రతీ ఒక్కరు తమ ఇంటి చుట్టు పక్కల ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా  చూడాలి. నిల్వ ఉన్న నీటిలో కిరసనాయిల్‌, వాడిన ఆయిల్‌ (వేస్ట్‌ ఆయిల్‌) గానీ చల్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మురుగు నీరు ఎప్పటికప్పుడు వెళ్లే విధంగా చూసుకోవాలని, నల్లా, బోరింగ్‌ ఉన్న ప్రాంతాల్లో నీరు నిల్వ కుండా చూడాల్సిన అవసరం సంబంధిత అధికారులపై ఉంది.  దోమల నివారణకు బేటెక్స్‌, టోమోపాస్‌ను కాలువల్లో  పిచికారి చేయించాలి. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌ బాల్స్‌ గంబూషియా చేపలను వేయాలి. 


ఫైలేరియా వ్యాధి లక్షణాలు..

క్యూలెక్స్‌ ఆడ దోమ కుట్టడం ద్వారా ఫైలేరియా వ్యాధి వ్యాపించి బోధకాలు ఏర్పడుతుంది. ఈ దోమ మురుగు నీరు నిల్వలో పెరుగుతుంది. వ్యాధి సోకుండా ఉండటానికి మురుగు నీరులో తిరగకుండా జాగ్రత్తపడాలి. 


మూడేళ్లలో కేసుల వివరాలు..

గడిచినమూడేళ్లలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 2019లో జిల్లాలో మలేరియా 16 కేసులు, డెంగీ 103 కేసులు, చికున్‌గున్యా 3 కేసులు నమోదు కాగా 2020లో మలేరియా 20, డెంగీ 11 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2021లో ఇప్పటి వరకు కేవలం మలేరియా 9 కేసులు నమోదయ్యాయి. 


వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి :  కె.క్రాంతికుమార్‌, జిల్లా మలేరియా అధికారి 

జిల్లాలో 7.50లక్షల జనాభా ఉంది. జూన్‌ నుంచి అక్టోబరు వరకు వర్షాకాలం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండేలా ప్రజలను అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని వ్యాధి నియంత్రణ చికిత్స  అందిసున్నాం. ప్రతీ శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

Updated Date - 2021-06-15T05:44:45+05:30 IST