నింగి అంచులు దాటి..

ABN , First Publish Date - 2021-07-21T07:26:15+05:30 IST

కుబేరుల రోదసి యాత్రల పోటీలో రెండో అడుగు దిగ్విజయంగా పడింది! భవిష్యత్తు అంతరిక్ష పర్యాటకానికి ఆకాశం కూడా హద్దు కాదు అని సూచించేలా..

నింగి అంచులు దాటి..

  • అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ రోదసియాత్ర సక్సెస్‌
  • 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన బెజోస్‌ బృందం
  • నాలుగు నిమిషాలపాటు భార రహిత స్థితిలో!
  • టేకాఫ్‌ నుంచి ల్యాండింగ్‌ దాకా.. పది నిమిషాల్లో పూర్తి
  • నా భవిష్యత్తు మాస్టర్‌ ప్లాన్‌కు ఇది చిన్న అడుగు: బెజోస్‌
  • ఈ యాత్రకు అయిన ఖర్చు.. నిమిషానికి 4100 కోట్లు


కుబేరుల రోదసి యాత్రల పోటీలో రెండో అడుగు దిగ్విజయంగా పడింది! భవిష్యత్తు అంతరిక్ష పర్యాటకానికి ఆకాశం కూడా హద్దు కాదు అని సూచించేలా.. అమెరికా కుబేరుడు, అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ మరో ముగ్గురితో కలిసి చేసిన రోదసియాత్ర అద్భుతంగా జరిగింది. పదంటే పది నిమిషాల్లో..  భూమి నుంచి మూడున్నర లక్షల అడుగుల ఎత్తుకు వెళ్లి, 106 కిలోమీటర్ల ఎత్తున విహరించి.. అపురూపమైన జ్ఞాపకాలను మూటగట్టుకుని బెజోస్‌ బృందం సురక్షితంగా భూమ్మీద ల్యాండయ్యింది.


స్థలం: అది.. కనుచూపుమేరలో నరమానవుడు కనిపించని ఎడారి ప్రాంతం! ఆ ఎడారి మధ్యలో.. రొమ్ము విరుచుకు నిలబడిన బాహుబలిలా ‘న్యూ షెపర్డ్‌’ రాకెట్‌! 60 అడుగుల ఎత్తైన ఆ రాకెట్‌పై భాగంలో ఆరుగురు వ్యోమగాములను మోసుకెళ్లగలిగే చిన్నపాటి గుడిసెలాంటి క్యాప్సూల్‌. 


సమయం: భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.41 గంటలు


దృశ్యం: రాకెట్‌పై ఉన్న స్పేస్‌ క్యాప్సూల్‌లో.. రోదసియాత్రకు సిద్ధంగా ఉన్న అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ (57), ఆయన సోదరుడు మార్క్‌ బెజోస్‌(53), అతి పెద్ద వయస్కురాలైన మహిళా వ్యోమగామి వాలీ ఫంక్‌ (82),  డచ్‌ కుర్రాడు అలివర్‌ డేమెన్‌ (18). అంతరిక్ష పర్యాటకం దిశగా మలి అడుగు వేసేందుకు ఆ నలుగురూ సిద్ధంగా ఉన్నారు. చూస్తుండగానే మరొక్క నిమిషం గడిచింది. నిర్ణీత షెడ్యూలుకు 12 నిమిషాలు ఆలస్యంగా.. ప్రపంచమంతా నిబిడాశ్చర్యంతో చూస్తుండగా.. నిప్పులు చిమ్ముకుంటూ నిట్టనిలువునా ఆకాశంలోకి దూసుకుపోయింది న్యూషెపర్డ్‌ రాకెట్‌!!


అద్భుతం: చూస్తూచూస్తూండగానే.. వేగాన్ని పెంచుకుంటూ.. గంటకు రెండు వేల మైళ్ల వేగాన్ని అందుకుంది. గరిష్ఠంగా 2,231 మైళ్ల వేగానికి (గంటకు దాదాపు 3,590 కిలోమీటర్లు) చేరుకున్న తర్వాత దాని వేగం తగ్గడం మొదలైంది. దాని పయనం మాత్రం నింగి అంచులు దాటే దిశగా సాగుతూనే ఉంది. కర్మన్‌ రేఖను అధిగమించేటప్పటికి దానివేగం గంటకు 804 మైళ్లు. నాలుగు నిమిషాలకు.. మూడున్నర లక్షల అడుగుల ఎత్తులో.. రాకెట్‌ నుంచి బెజోస్‌ బృందం ఉన్న క్యాప్సూల్‌ విడివడింది. నిర్ణీత ప్రణాళిక ప్రకారం బూస్టర్‌ వేగం క్రమంగా తగ్గిపోతుండగా..  భూమ్యాకర్షణ శక్తి ఆధారంగా కిందికి జారిపోవడం ప్రారంభించింది. మరోవైపు.. కర్మన్‌ రేఖ దాటి రోదసిలోకి వెళ్లిన బెజోస్‌ బృందం వారు ప్రయాణిస్తున్న క్యాప్సూల్‌కున్న పెద్ద పెద్ద అద్దాల గుండా భూమి అందాలను వీక్షించారు. నాలుగు నిమిషాలపాటు భార రహిత స్థితిని ఆస్వాదించారు. 


అంతరిక్షంలో ఆటలు..

అంత పెద్ద కుబేరుడు అయి ఉండీ.. చిన్నపిల్లాడిలా బెజోస్‌ తన సోదరుడితో అంతరిక్షంలో భార రహిత స్థితిలో ఆటలు ఆడుకున్నారు. ఇద్దరూ గాలిలో ఈదుతూ.. ఒకరి నోట్లోకి మరొకరు స్కిటిల్స్‌ (తియ్యటి రంగురంగుల బిళ్లలు) విసురుకున్నారు. తమ అరచేతులపై ‘హాయ్‌మామ్‌’ అని రాసుకుని చేతులు కలిపి.. తమ తల్లి జాక్లిన్‌ను తలుచుకున్నారు. అక్కడే ఉన్న వాలీ ఫంక్‌, అలివర్‌ డేమెన్‌ కూడా వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. నాలుగు నిమిషాల తర్వాత వారి క్యాప్సూల్‌ వేగంగా కిందికి దిగడం ప్రారంభించింది. మరోవైపు.. అంతకు ముందే కిందికి దిగడం ప్రారంభించిన బూస్టర్‌.. ఈ యాత్ర ప్రారంభమైన 7.20 నిమిషాలకు క్షేమంగా కిందికి దిగింది. బెజోస్‌ బృందం క్యాప్సూల్‌ కూడా పారాచూట్ల సాయంతో క్రమంగా వేగాన్ని అదుపు చేసుకుంటూ సురక్షితంగా ల్యాండయింది. లిఫ్టాఫ్‌ నుంచి క్యాప్సూల్‌ ల్యాండయ్యేదాకా ఈ యాత్రకుపట్టిన సమయం 10 నిమిషాల 20 సెకన్లు. రోదసిలోకి వెళ్లొచ్చిన బెజోస్‌, ఆయన సోదరుడు, వాలీ ఫంక్‌, అలివర్‌ డేమెన్‌లను బ్లూఆరిజిన్‌ సిబ్బంది ఆలింగనం చేసుకుని అభినందించారు. 


బెజోస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ లారెన్‌ శాంచెజ్‌, ఆయన పిల్లలు, సోదరి, మార్క్‌ భార్య, అలివర్‌ డేమెన్‌.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలా.. అపర కుబేరుడు.. అమెజాన్‌ అధిపతి.. జెఫ్‌ బెజోస్‌ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అనంతరం  ‘‘ఇదొక పరిపూర్ణమైన మిషన్‌’’ అని బెజోస్‌ ప్రకటించారు.  కాలుష్యకాసారంగా మారుతున్న భూగోళాన్ని కాపాడడానికి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు పెద్ద పరిశ్రమలను రోదసిలోకి తీసుకెళ్లాలన్న తన మాస్టర్‌ప్లాన్‌ దిశగా ఇది ఒక చిన్న అడుగు అని ఆయన పేర్కొన్నారు. తన కల సాకారం కావడానికి, ఇది జరగడానికి కారణమైన ప్రతి ఒక్క అమెజాన్‌ వినియోగదారుడికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే.. భవిష్యత్తులో తమ బ్లూఆరిజిన్‌ సంస్థ చేపట్టబోయే స్పేస్‌ ఫ్లైట్లకు సంబంధించి ఇప్పటికే 10 కోట్ల డాలర్ల (దాదాపు రూ.745 కోట్లు) విలువ చేసే టికెట్లు అమ్ముడైనట్టు తెలిపారు. ఈ ఏడాది తమ సంస్థ.. మరో రెండు వాణిజ్య యాత్రలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. కాగా.. 


ఈ యాత్రలో తనను తీసుకెళ్లినందుకు బెజో్‌సకు వాలీ ఫంక్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బెజోస్‌ ఆమెకు మరో అపురూపమైన బహుమతి ఇచ్చారు. అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని విమానంలో ఒంటరిగా దాటిన అమెలియా ఇయర్‌హార్ట్‌ ధరించిన కళ్లజోడును బహూకరించారు. అలాగే ఈ యాత్రలో తాను ధరించిన ఒక పక్షి ఈకను తన తల్లికి బెజోస్‌ బహూకరించారు. కాగా.. వర్జిన్‌ గెలాక్టిక్‌ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌.. బెజోస్‌ బృందానికి అభినందనలు తెలిపారు. అప్పుడు బ్రాన్సన్‌, శిరీష తదితరుల బృందం భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లగా.. బెజోస్‌ బృందం అంతకు మించి.. 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి అంతరిక్ష పర్యాటకంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. కాగా.. తాను 10 కోట్ల డాలర్లతో (రూ.745 కోట్లు) ఏర్పాటు చేసిన దాతృత్వ పురస్కారాన్ని తొలిగా.. సీఎన్‌ఎన్‌ యాంకర్‌ వాన్‌జోన్స్‌కు ప్రకటిస్తున్నట్టు బెజోస్‌ ప్రకటించారు. 


41 వేల కోట్ల యాత్ర

214 బిలియన్‌ డాలర్ల (దాదాపుగా రూ.15.83 లక్షల కోట్లు) సంపద కలిగిన జెఫ్‌ బెజోస్‌ ఈ యాత్రకు చేసిన ఖర్చు.. 5.5 బిలియన్‌ డాలర్లు. అంటే దాదాపుగా 41 వేల కోట్ల రూపాయలు. 

Updated Date - 2021-07-21T07:26:15+05:30 IST