Abn logo
Sep 19 2021 @ 06:53AM

అక్టోబరు 6 నుంచి భద్రాద్రిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 6న ప్రారంభమై 15వరకు సాగనున్నాయి. తొలుత అమ్మవారికి అష్టలక్ష్మీ అలంకారాన్ని నిర్వహించనున్నారు. అక్టోబరు 6న ఆదిలక్ష్మి, 7న సంతాన లక్ష్మి, 8న గజలక్ష్మి, 9న ధనలక్ష్మి, 10న ధాన్యలక్ష్మి, 11న విజయలక్ష్మి, 12న ఐశ్వర్య లక్ష్మీ, 13న వీరలక్ష్మి, 14న మహాలక్ష్మి అలంకారాలు చేయనున్నారు. ఈ సందర్భంగా అక్టోబరు 6నుంచి 15వరకు శ్రీ లక్ష్మీఅమ్మవారి సన్నిధిలో అభిషేకం,  చిత్రకూట మండపంలో సామూహిక శ్రీరామాయణ పారాయణం, శ్రీ లక్ష్మీతాయారు సన్నిధిలో సామూహిక కుంకు మార్చన, విశేష దర్బారు సేవ, నివేదన, మహామంత్రపుష్పం, ప్రసాద గోష్టి నిర్వహించనున్నారు. 


అలాగే చిత్రకూట మండపంలో శ్రీరామాయణ ప్రవచనాలు నిర్వహంచనుండగా తిరువీధి సేవలు అమ్మవారికి జరపనున్నారు. ఇదిలా ఉండగా శ్రీరామాయణ పారాయణం చేసే వారు కేవలం శ్రీరామసేవగా మాత్రమే పారాయణం చేయాలని దేవస్థానం ఎటువంటి పారితోషకాలు ఇవ్వదని ప్రకటించారు. ఆసక్తి గల వారు దేవస్థానం వెబ్‌సైట్‌, లేదా ఈమెయిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాగా అక్టోబరు 15వ తేదీన విజయదశమిని పురస్కరించుకొని శ్రీరామమహాపట్టాభిషేకం, షమీపూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. ఇందుకు సంబందించిన కరపత్రాన్ని శనివారం రాత్రి పత్రికలకు విడుదల చేశారు.