లాంఛనాలకు రూ.లక్ష ఏమైంది ?

ABN , First Publish Date - 2021-03-08T06:02:35+05:30 IST

శ్రీరామనవమిరోజున భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లాంఛనాలను సమర్పించే సంప్రదాయం ఏటికేడు ప్రహసనంగా మారుతోంది.

లాంఛనాలకు రూ.లక్ష ఏమైంది ?
స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు కల్యాణ సమయంలో పోస్తున్న దృశ్యం, పట్టువస్త్రాలను సమర్పిస్తున్న సీఎం (ఫైల్‌ఫోటో)

రెండు దశాబ్దాలుగా ఉత్తర్వులకే పరిమితమవుతున్న సంప్రదాయం 

కేటాయింపుల పెంపుపై తేల్చని రాష్ట్ర ప్రభుత్వం

ఈసారీ రూ.15వేలే కేటాయిస్తు ఉత్తర్వులు  

భద్రాచలం, మార్చి 7: శ్రీరామనవమిరోజున భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లాంఛనాలను సమర్పించే సంప్రదాయం ఏటికేడు ప్రహసనంగా మారుతోంది. లాంఛనాల కోసం ప్రభుత్వం ఏటా మొక్కుబడిగా ఉత్తర్వులు జారీ చేయడం తప్ప ఒక్కపైసా ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రామయ్య కల్యాణంలో తానీషా కాలం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. లాంఛనాల కోసం అందించే రూ.15వేలకు సంబంధించిన ఉత్తర్వులు ఏటా దేవస్థానం అధికారులకు అందుతున్నా.. దేవస్థానం ఖాతాకు మాత్రం జమవడం లేదని దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి.  

కేటాయింపుల పెంపుపై తేల్చని ప్రభుత్వం

భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి కల్యాణానికి ప్రభుత్వం తరపున సమర్పించే  ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలకు కేటాయింపుల పెంపును ప్రభుత్వం ఇంకా ఎటూ తేల్చలేదు. గత ఏడాది మార్చి మూడో తేదీన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ భద్రాద్రి రామాలయంలో నవమి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంలో లాంఛనాల కేటాయింపులను పెంచాలన్న ప్రస్తావన రావడంతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని స్థానిక దేవస్థానం అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. దాంతో దేవస్థానం కమిషనర్‌ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. వాటికి ఆమోదం తెలిపి 2021లో జరిగే శ్రీరామనవమికి లాంఛనాలు రూ.లక్ష వచ్చేలా చూస్తామని కమిషనర్‌ ప్రకటించారు. కానీ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా ప్రభుత్వం వద్ద ఆమోదానికి నోచుకోలేదని సమాచారం.  

లాంఛనాల పెంపుపై ఉత్తర్వులు అందలేదు

బి.శివాజీ, భద్రాద్రి దేవస్థానం ఈవో 

లాంఛనాల పెంపుపై మాకు ఎలాంటి ఉత్తర్వులు నేటివరకు అందలేదు. తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సీఎం సమర్పించేందుకు రూ.15వేలతో కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు అందిన మాట వాస్తవమే.   

Updated Date - 2021-03-08T06:02:35+05:30 IST