భద్రాద్రిపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-05-08T05:01:52+05:30 IST

కరోనా వైరస్‌ రెండో విడత ఉదృతి తీవ్రంగా ఉండటంతో ఆ ప్రభావం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంపై స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం ఇప్పటికే స్వామివారి తిరుకల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాలను ఆంతరంగికంగా నిర్వహించారు. దీంతో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దేవస్థానం రూ.రెండు కోట్లకు పైగా ఆదాయం కోల్పోయింది. అయితే గత ఏడాది లాక్‌డౌన్‌ ఉండటంతో భక్తులను సాధారణ రోజుల్లో దర్శనాలకు అనుమతించలేదు.

భద్రాద్రిపై కరోనా ఎఫెక్ట్‌
బోసిపోతున్న ఆలయ ప్రాంగణం

రోజుకు 250 మందిలోపే భక్తులు 

రూ.30 వేలకు మించని ఆదాయం

11 మంది ఆలయ సిబ్బందికీ పాజిటివ్‌ 

అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తగ్గించేందుకు కసరత్తు

దర్శనం వేళలు ఒంటిగంటకు తగ్గించే యోచన

భద్రాచలం, మే 7: కరోనా వైరస్‌ రెండో విడత ఉదృతి తీవ్రంగా ఉండటంతో ఆ ప్రభావం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంపై స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం ఇప్పటికే స్వామివారి తిరుకల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాలను ఆంతరంగికంగా నిర్వహించారు. దీంతో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దేవస్థానం రూ.రెండు కోట్లకు పైగా ఆదాయం కోల్పోయింది. అయితే గత ఏడాది లాక్‌డౌన్‌ ఉండటంతో భక్తులను సాధారణ రోజుల్లో దర్శనాలకు అనుమతించలేదు. ఈసారి ఆ పరిస్థితి లేకున్నా కరోనా ఉదృతి అధికంగా ఉండటంతో భక్తులు అత్యంత స్వల్పంగా వస్తున్నారు. సాధారణ సమయాల్లో పదివేల మంది వరకు వచ్చే భక్తులు ప్రస్తుతం కేవలం 250మందిలోపే వస్తున్నట్లు దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. ఆదాయం సైతం సాధారణ రోజుల్లో మూడు లక్షల వరకు ఉండగా ప్రస్తుతం కేవలం రూ.30వేలలోపే వస్తోందం టున్నారు. ఇటీవలి కాలంలో దేవస్థానం పరిధిలోని కాటేజీలు, సత్రాలు రోజూ కనీసం ఐదు శాతం కూడా భర్తీ కావడం లేదు. కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో ముందు జాగ్రత్తగా భక్తుల దర్శనాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకే అనుమతించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే కసరత్తు చేపట్టారు.  

11 మంది దేవస్థానం సిబ్బందికి కరోనా 

భద్రాద్రి దేవస్థానంలో పని చేస్తున్న పరిపాలన సిబ్బందిలో 11మంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు. దీంతో దేవస్థానం పరిపాలన, వైదిక, ఎస్‌పీఎఫ్‌ సిబ్బందిలో ఆందోళన అధికమైంది.  ఈ క్రమంలో దేవస్థానం అధికారులు పూర్తిస్థాయిలో కరోనా నివారణ చర్యలను చేపడుతున్నారు.   సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.  

తాత్కాలికంగా అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తగ్గించే కసరత్తు

కరోనాతో దేవస్థానం పరిపాలన, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో దేవస్థానం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఒకవైపు కరోనా, మరోవైపు ఆదాయం సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో దేవస్థానంపై ఆర్థిక భారం తగ్గించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా అవుట్‌సోర్సింగ్‌, హౌస్‌కీపింగ్‌లో పని చేస్తున్న 130మంది సిబ్బందిలో సుమారు 30మందిని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు చక్కబడిన తరువాత తిరిగి వారిని విధుల్లోకి తీసుకునే అవకాశముంది. 

Updated Date - 2021-05-08T05:01:52+05:30 IST