టీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా వనమాను వెనకేసుకొస్తున్నారు : కోనేరు చిన్ని

ABN , First Publish Date - 2022-01-06T18:43:56+05:30 IST

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

టీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా వనమాను వెనకేసుకొస్తున్నారు : కోనేరు చిన్ని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. రామకృష్ణ సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో రామకృష్ణ సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వనమా రాఘవ తన కుటుంబసభ్యులతో అసభ్యంగా ప్రవర్తించాడని రామకృష్ణ ఆ వీడియోలో తెలిపారు. ఈ అంశంపై స్పందించిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని ఫోన్ ద్వారా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. వనమా రాఘవది ఇది మొదటి కేసు కాదన్నారు. తండ్రి పేరు అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. సిగ్గులేకుండా టీఆర్ఎస్ నేతలు వనమాను వెనకేసుకువస్తున్నారని, ఈ ఘటనపై ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు.


ఈటల రాజేందర్ ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఆయనను సస్పెండ్ చేశారని, వనమా రాఘవవల్ల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కోనేరు చిన్ని ప్రశ్నించారు. ఈ ఘటనకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, కొడుకు రాఘవను పోలీసులకు అప్పగించాలని కోనేరు చిన్ని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-06T18:43:56+05:30 IST