రామయ్య దర్శనాల పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-06-21T04:28:19+05:30 IST

రామయ్య దర్శనాల పునఃప్రారంభం

రామయ్య దర్శనాల పునఃప్రారంభం
రామాలయంలో భక్తులను అనుమతించడం ప్రారంభిస్తున్న దృశ్యం

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో 39రోజుల తర్వాత 

తెరుచుకున్న రామాలయ ద్వారాలు

తొలిరోజున రెండువేల మందికిపైగా రాక 

భద్రాచలం, జూన్‌ 20: కరోనా సెకెండ్‌ వేవ్‌ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌విధించడంతో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులకు దర్శనా లను నిలిపేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో 39రోజుల తర్వాత మళ్లీ భక్తుల రాకమొదలైంది. మే 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన క్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ఉత్తర్వుల మేరకు భక్తులకు దర్శనాలు నిలిపేసిన అధికారులు స్వామి వారి సేవలను అంతరంగికంగా నిర్వహించారు. ఆదివారం నుంచి అన్‌లాక్‌ ప్రక్రియ మొదలవడంతో 39రోజుల తరువాత భద్రాద్రి రామయ్య దర్శనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రెండువేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 500 లడ్డూలు, 500 పులిహోర  ప్యాకెట్లు అమ్ముడయ్యాయి. అదేవిధంగా అంతరాలయంలో స్వామి వారికి నిర్వహించే అభిషేకం, సువర్ణపుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలకు కూడా భక్తులు అధికసంఖ్యలోనే పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ ఉధృతి ఇంకా ఉన్నందున భౌతిక దూరం ఏర్పాటు చేయడంతో పాటు ఇతరత్రా రక్షణ చర్యలను చేపడుతున్నట్టు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. భక్తులు పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. 

Updated Date - 2021-06-21T04:28:19+05:30 IST