కర్తవ్యమే ప్రధానం

ABN , First Publish Date - 2020-02-14T06:07:36+05:30 IST

తత్త్వం అంటే అంత తేలిగ్గా తెలియనిది. తర్కం అంటే అంత తేలిగ్గా తెగనిది. వాదోపవాదాలు చేసేవారు పొద్దస్తమానం ఏదో ఒక తర్కాన్ని ప్రదర్శించి కాలం వెళ్ళబుచ్చుతుంటారు.

కర్తవ్యమే ప్రధానం

తత్త్వం అంటే అంత తేలిగ్గా తెలియనిది. తర్కం అంటే అంత తేలిగ్గా తెగనిది. వాదోపవాదాలు చేసేవారు పొద్దస్తమానం ఏదో ఒక తర్కాన్ని ప్రదర్శించి కాలం వెళ్ళబుచ్చుతుంటారు. తమను అందరూ పండితులుగా గుర్తించాలని ఆరాటపడతారు. వాదన మొదలుపెట్టారంటే చాలు-  ‘ఫలానా గ్రంథం, ఫలానా అధ్యాయం, ఫలానా పేజీ, ఫలానా శ్లోకం’ అంటూ ఎక్కాల పుస్తకంలా ఏకరవు పెట్టేస్తారు. సిద్ధాంతానికీ, ఆచరణకీ ఉన్న కొద్దిపాటి సర్దుబాటులను కూడా గ్రహించలేరు, సహించలేరు. ఉత్త పిడివాదంతో 

ఊకదంపుడు కొడుతూ ఉంటారు. 


అలాంటివారిలో మాలుంక్యపుత్రుడు ఒకడు. ఒకసారి బుద్ధుని దగ్గరకు అతను వచ్చి, కుతర్కం మొదలుపెట్టాడు. ‘‘మాలుంక్యా! తర్కం, వితర్కం కన్నా కర్తవ్యం, కార్యాచరణ ప్రధానం. తర్కం వల్ల ఉపయోగం ఉండదు’’ అన్నాడు బుద్ధుడు.


అయినా మాలుంక్యుడు మొండిపట్టు వదలలేదు. ‘అదెట్లా? ఇదెట్లా?’ అంటూ వితర్కం మొదలుపెట్టాడు. ‘‘మాలుంక్యపుత్రా! విను. ఒక వ్యక్తికి విషం పూసిన బాణం బాగా దిగింది. అదుగో! అతణ్ణి ఒక వైద్యుడి దగ్గరకు తీసుకువచ్చారు. 


బాణం దిగిన వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి వైద్యం వెంటనే అవసరం. అలాంటి సమయంలో వైద్యుడు ఆ రోగితో ‘‘నీ మీద బాణం వేసింది ఎవరు? బ్రాహ్మణుడా? శూద్రుడా? వైద్యుడా? అతను కుడి వైపు నుంచి వేశాడా? ఎడమ వైపు నుంచి గురి చూశాడా? వెనుక నుంచా? ముందు నుంచా? ఎటునుంచి వేశాడు? అసలు ఆ బాణం వెదురుతో చేసినదా? రాగితో చేసినదా? ఇనుముతో చేసినదా? టేకుతో చేసినదా? దాని నారి గుర్రపు నరమా? ఎద్దు నరమా? గాడిద నరమా? ఆ బాణానికి ఉన్న ఈకలు ఏ పక్షివి? నెమలివా? గద్దవా? కోడివా? అసలు ఆ బాణం వేసిన వాడి పేరేమిటి? ఊరేమిటి? ఇంటి పేరేమిటి? నల్లగా ఉన్నాడా? తెల్లగా ఉన్నాడా? చామన ఛాయగా ఉన్నాడా? పొట్టివాడా? పొడుగరా? ఒక మాదిరి కుదమట్టం వాడా?’’ అంటూ ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం అవసరమా? లేదా వైద్యం చేయడం అవసరమా?’’ అని ప్రశ్నించాడు బుద్ధుడు.


మాలుంక్యపుత్రుడు మారు మాట్లాడలేదు. ‘తర్కం, వితర్కం, కుతర్కం కన్నా కర్తవ్యమే ప్రధానం!’ అనే బుద్ధుని సందేశం అతనికి అర్థమయింది. ఆ తరువాత అతను ఇంకెప్పుడూ వితర్కాలకు దిగలేదు. ప్రశ్నల పరంపరలు కురిపించలేదు.


బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-02-14T06:07:36+05:30 IST